ETV Bharat / international

న్యూస్​ పేపర్లలో దేశ రహస్య పత్రాలు దాచిన ట్రంప్, ఎఫ్​బీఐ సంచలన నివేదిక

author img

By

Published : Aug 27, 2022, 7:10 PM IST

Updated : Aug 27, 2022, 7:22 PM IST

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. తన ఇంట్లోని మ్యాగజైన్లు వార్తా పత్రికల మధ్య రహస్య పత్రాలను దాచిపెట్టుకున్నారని ఎఫ్​బీఐ తెలిపింది. జనవరిలో ఎఫ్‌బీఐ అధికారులు ట్రంప్ ఎస్టేట్‌లో సోదాలు చేపట్టగా 15 బాక్సుల్లో పత్రాలు లభించాయి. వీటికి సంబంధించిన అఫిడవిట్‌ను ఎఫ్‌బీఐ తాజాగా బయటపెట్టింది.

TRUMP SECRET PAPERS
TRUMP SECRET PAPERS

ఫ్లోరిడాలో అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌నకు చెందిన మార్‌-ఎ-లాగో ఎస్టేట్‌లో ఫెడరల్‌ బ్యూరో ఆఫ్‌ ఇన్వెస్టిగేషన్‌ (ఎఫ్‌బీఐ) చేపట్టిన తనిఖీలకు సంబంధించి కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. దేశానికి చెందిన అత్యంత రహస్య పత్రాలను ట్రంప్‌ తన ఇంట్లో ఇతర మ్యాగజైన్లు, వార్తా పత్రికలు, కాగితాల మధ్య కలిపేశారని తెలిసింది. ఎఫ్‌బీఐ అఫిడవిట్‌లో ఈ విషయం వెల్లడైంది.

ట్రంప్‌నకు చెందిన మార్‌-ఎ-లాగో ఎస్టేట్‌ను ట్రంప్‌, ఆయన సిబ్బంది, కుటుంబసభ్యులు మాత్రమే కాకుండా ఇతరులు కూడా ఉపయోగిస్తుంటారు. ఇక్కడ వివాహాలతో పాటు రాజకీయ, సామాజిక కార్యక్రమాలు జరుగుతుంటాయి. అయితే, ట్రంప్‌ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో దేశానికి చెందిన కొన్ని రహస్య ప్రతాలను ఇక్కడకు తరలించారని ఫెడరల్‌ బ్యూరోకు విశ్వసనీయ సమాచారం వచ్చింది. దీంతో ఈ ఏడాది జనవరిలో ఎఫ్‌బీఐ అధికారులు ఈ ఎస్టేట్‌లో సోదాలు చేపట్టగా.. 15 బాక్సుల్లో పత్రాలు లభించాయి. ఈ సోదాలకు సంబంధించిన అఫిడవిట్‌ను ఎఫ్‌బీఐ తాజాగా బయటపెట్టింది.

ఈ బాక్సుల్లో 67 విశ్వసనీయ, 92 రహస్య, 25 అత్యంత రహస్య పత్రాలు లభించినట్లు తెలుస్తోంది. ఈ పత్రాలను ట్రంప్‌ తన ఇంట్లో ఇతర కాగితాలతో కలిపి ఉంచినట్లు తెలిసింది. ఒక్కో బాక్సుల్లో రహస్య పత్రాలతో పాటు వార్తా పత్రికలు, మ్యాగజైన్లు, ఫొటోలు, వివిధ రకాల ప్రింట్‌అవుట్‌లు, వ్యక్తిగత పత్రాలు కలిపి ఉన్నట్లు తేలింది. కాగా.. గతంలో ఈ బాక్సుల గురించి ట్రంప్‌ కుమారుడు ఎరిక్ స్పందిస్తూ.. శ్వేత సౌధం ఖాళీ చేసేందుకు కేవలం ఆరు గంటల సమయం మాత్రమే ఉంటుందన్నారు. ఆ సమయంలో ట్రంప్‌ వద్ద ఉన్న క్లిప్పింగ్‌లను భద్రపర్చారని.. అవే ఆ పెట్టెలని పేర్కొన్నారు. అయితే, ఈ పత్రాలను తిరిగిచ్చేందుకు ట్రంప్‌నకు అనేక అవకాశాలు లభించినప్పటికీ.. ఆయన వాటిని ప్రభుత్వానికి అందించలేదని ఎఫ్‌బీఐ దర్యాప్తులో తేలినట్లు సమాచారం.

Last Updated :Aug 27, 2022, 7:22 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.