ETV Bharat / international

క్యాన్సర్​ మరణాలకు ధూమపానమే అధిక కారణం, లాన్సెట్​ అధ్యయనంలో వెల్లడి

author img

By

Published : Aug 19, 2022, 11:07 PM IST

Cancer Deaths
క్యాన్సర్​ మరణాలు

విశ్వవ్యాప్తంగా ప్రజలను క్యాన్సర్ భయపెడుతూనే ఉంది. ప్రపంచవ్యాప్తంగా ధూమపానం, మద్యం సేవించడం, అధిక బరువు కలిగి ఉండడం వంటివి క్యాన్సర్​ మరణాలకు ప్రధాన ముప్పుగా మారినట్లు తాజా అధ్యయనం వెల్లడించింది.

Cancer Deaths: ప్రపంచ దేశాలను క్యాన్సర్‌ భూతం వెంటాడుతూనే ఉంది. ఏటా లక్షల సంఖ్యలో క్యాన్సర్‌ బాధితులు ప్రాణాలు కోల్పోతున్నట్లు అంతర్జాతీయ నివేదికలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో ధూమపానం, మద్యం సేవించడం, అధికబరువు కలిగి ఉండడం వంటివి క్యాన్సర్‌ మరణానికి ప్రధాన ముప్పుగా మారినట్లు తాజా అధ్యయనం వెల్లడించింది. ప్రపంచ వ్యాప్తంగా చోటు చేసుకుంటున్న క్యాన్సర్‌ మరణాల్లో దాదాపు సగం ఈ కారణాల వల్లే చోటుచేసుకుంటున్నాయని పేర్కొంది. ప్రపంచంపై వ్యాధులు, గాయాలు, ప్రమాద కారకాల భారం-2019 ఫలితాలపై నిర్వహించిన అధ్యయనం నివేదికను 'ది లాన్సెట్‌' జర్నల్‌ ప్రచురించింది.

ప్రపంచ వ్యాప్తంగా క్యాన్సర్‌ బాధితుల్లో మరణాలకు దారితీస్తున్న ప్రధాన కారణాలను విశ్లేషించేందుకు అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్‌ వాషింగ్టన్‌ స్కూల్‌ ఆఫ్‌ మెడిసిన్‌కు చెందిన పరిశోధకులు అధ్యయనం చేపట్టారు. ఈ సందర్భంగా ధూమపానం, మద్యం సేవించడం, అధిక బరువు కలిగి ఉండడం వంటివి క్యాన్సర్‌ మరణాలకు ప్రధాన కారణాలుగా నిలుస్తున్నాయని గుర్తించారు. వీటివల్లే ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 44.5లక్షల మంది బాధితులు ప్రాణాలు కోల్పోతున్నారని పేర్కొన్నారు. అంటే అన్ని దేశాల్లో చోటుచేసుకుంటున్న క్యాన్సర్‌ మరణాల్లో దాదాపు 44.4శాతం ఈ మూడు కారణాల వల్లే చనిపోతున్నారని వెల్లడించారు.

'2019లో దాదాపు 28.8లక్షల మంది క్యాన్సర్‌ సోకిన పురుషులు ఈ ప్రమాదకరమైన అలవాట్ల వల్లే ప్రాణాలు కోల్పోయారు. మహిళా బాధితులతో పోలిస్తే ఇవి దాదాపు మూడింతలు ఎక్కువ. ప్రధానంగా శ్వాసకోస క్యాన్సర్‌ బాధితుల్లోనే ఈ మరణాలు అధికంగా ఉన్నాయి. పురుషులు, మహిళలు ఇద్దరిలోనూ మరణాలకు ప్రధాన కారణం ధూమపానమే. దాదాపు 36.9శాతం బాధితులు ఈ ఒక్క ప్రమాదపు అలవాటు వల్లే చనిపోతున్నారు. ఈ నేపథ్యంలో పరిశోధకులతోపాటు విధానకర్తలకు ఈ అధ్యయనం ఎంతగానో దోహదపడుతుంది' అని అధ్యయనంలో కీలకంగా వ్యవహరించిన డాక్టర్‌ క్రిస్టోఫర్‌ ముర్రే పేర్కొన్నారు.

మరోవైపు మహిళల్లో ప్రధానంగా సర్వైకల్‌ (17.9శాతం), పేగు (15.8శాతం), రొమ్ము (11శాతం) క్యాన్సర్‌లు అధికంగా సంభవిస్తున్నట్లు తాజా అధ్యయనం పేర్కొంది. పురుషుల్లో మాత్రం ఎక్కువగా పేగు, అన్నవాహిక, జీర్ణాశయ క్యాన్సర్లు వెలుగు చూస్తున్నట్లు తెలిపింది.

ఇదీ చదవండి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.