ETV Bharat / international

తన చుట్టూ ఉండే సెక్యూరిటీని చూసి సల్మాన్ రష్దీ అసహనం

author img

By

Published : Aug 13, 2022, 9:09 PM IST

Salman Rushdie security భారత మూలాలున్న ప్రముఖ రచయిత, ప్రతిష్ఠాత్మక బుకర్‌ ప్రైజ్‌ విజేత సల్మాన్‌ రష్దీపై జరిగిన దాడి ప్రపంచాన్ని షాక్‌కు గురిచేసింది. ఈ దాడిలో తీవ్రగాయాలపాలైన సల్మాన్ రష్దీ కాలేయం దెబ్బతిందని, ఓ కన్ను కోల్పోయే ప్రమాదం ఉందని ఆయన బుక్ ఏజెంట్ ఒకరు రాయిటర్స్‌కు వెల్లడించారు. అయితే సల్మాన్ తన చుట్టూ ఉన్న రక్షణ వలయాన్ని చూసి అసహనంగా ఉండేవారని అంతర్జాతీయ మీడియా కథనం పేర్కొంది. మరోవైపు రష్దీపై దాడికి పాల్పడిన నిందితుడు హాది మతార్​కు ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్​కు సంబంధం లేదని పోలీసులు తెలిపారు.

salman rushdie
ప్రముఖ రచయిత సల్మాన్ రష్దీ

Salman Rushdie security దుండగుడి దాడిలో తీవ్ర గాయాలపాలైన ప్రముఖ రచయిత సల్మాన్ రష్దీ తన చుట్టూ ఉండే రక్షణ చూసి అసహనంగా ఉండేవారు. 2001లో ఒకసారి బహిరంగంగానే దానిపై అసంతృప్తి వ్యక్తం చేశారని అంతర్జాతీయ మీడియా కథనం పేర్కొంది.

'ఇక్కడ నా చుట్టూ భారీస్థాయిలో ఉన్న రక్షణ వలయాన్ని చూసి నాకు చాలా ఇబ్బందిగా అనిపించింది. ఇది చాలా ఎక్కువగా ఉంది. నిజానికి ఇది అనవసరమని నా అభిప్రాయం. ఇదంతా నా అభ్యర్థన మేరకు ఏర్పాటు చేసింది కాదు. ఇక్కడకు వచ్చేముందు నేనేమి దీన్ని కోరుకోలేదు. కానీ ఈ ఏర్పాటంతా నాకు ఆశ్చర్యాన్ని కలిగించింది' అంటూ ఆ వేళ రష్దీ వ్యాఖ్యానించారు. ఇదిలా ఉండగా.. ప్రతిష్ఠాత్మక బుకర్‌ ప్రైజ్‌ విజేత అయిన ఆయనపై జరిగిన దాడి ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. ప్రస్తుతం ఆయన వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్నారు. ఈ దాడి వల్ల ఆయన ఒక కన్ను కోల్పోయే ప్రమాదం ఉందని తెలుస్తోంది. అలాగే ఆయన కాలేయం తీవ్రంగా దెబ్బతిందని సన్నిహితుడొకరు మీడియాకు వెల్లడించారు. అందరూ చూస్తుండగానే వేదికపైకి దూసుకొచ్చి కత్తితో రచయితపై దాడి చేసిన దుండగుడు ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నాడు. పేరు హాది మతార్‌ అని, న్యూజెర్సీకి చెందిన వ్యక్తి అని గుర్తించారు.

భారత మూలాలున్న ప్రముఖ రచయిత, ప్రతిష్ఠాత్మక బుకర్‌ ప్రైజ్‌ విజేత సల్మాన్‌ రష్దీ(75)పై జరిగిన దాడి ప్రపంచాన్ని షాక్‌కు గురిచేసింది. తీవ్ర గాయాలపాలైన రష్దీ కాలేయం దెబ్బతిందని, ఓ కన్ను కోల్పోయే ప్రమాదం ఉందని ఆయన బుక్ ఏజెంట్ ఒకరు రాయిటర్స్‌కు వెల్లడించారు. వెంటిలేటర్‌పై ఉన్నారని, పరిస్థితి ఇంకా విషమంగానే ఉన్నట్లు తెలిపారు. అందరూ చూస్తుండగానే వేదికపైకి దూసుకొచ్చి కత్తితో రచయితపై దాడి చేసింది ఓ యువకుడు. అతడిని న్యూజెర్సీకి చెందిన 24 ఏళ్ల హాది మతార్‌గా గుర్తించారు. ప్రస్తుతం అతడు పోలీసుల అదుపులో ఉన్నాడు. అయితే, ఎవరీ మతార్‌? ఎందుకు రష్దీపై దాడికి పాల్పడ్డాడు? అనే ప్రశ్నలు వస్తున్నాయి.

న్యూజెర్సీలో నివసించే మతార్‌(24)కు సంబంధించి సోషల్‌ మీడియా ఖాతాలను పోలీసులు పరిశీలించారు. అతడు ఇరాన్‌కు చెందిన ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్​కు సానుభూతిపరుడని ఆ సామాజిక మాధ్యమాలు తెలియజేస్తున్నాయి. మతార్‌కు, ఐఆర్‌జీసీ మధ్య ప్రత్యక్ష సంబంధాలు లేనప్పటికీ.. నిందితుడి సెల్‌ఫోన్‌లో 2020లో హత్యకు గురైన ఇరాన్ కమాండర్ ఖాసేమ్ సోలేమాని చిత్రాలను గుర్తించారు. ఇదిలా ఉంటే.. రష్దీ రచించిన 'ది సాతానిక్‌ వెర్సెస్‌‌' నవల వివాదాలకు కేంద్రబిందువై.. ఆయనకు హత్యా బెదిరింపులు కూడా వచ్చాయి. 1988 నుంచి ఇరాన్‌లో ఈ నవలను నిషేధించింది.

అయితే ఇప్పటివరకు జరిగిన దర్యాప్తు మేరకు.. మతార్‌కు ఎలాంటి గ్రూపులతో సంబంధాలు లేవని, ప్రస్తుతం అతడు ఒంటరిగానే పనిచేస్తున్నట్లు తేలిందని పోలీసులు చెప్పారు. ఘటనా స్థలంలో ఎలక్ట్రానిక్ పరికరాలను స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం పలు వస్తువుల కోసం సెర్చ్ వారెంట్లు పొందే ప్రక్రియలో ఉన్నారు. పోలీసులు మరిన్ని కోణాల్లోనూ విచారిస్తున్నారు. రష్దీపై దాడికి ప్రేరేపిత కారణాలేంటి? మతార్‌ ఏ దేశానికి చెందినవాడు? అతడిపై ఇప్పటివరకు క్రిమినల్‌ రికార్డు ఉందా? ఉగ్రవాద సంస్థలతో సంబంధాలున్నాయా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.

న్యూయార్క్‌లోని చౌతాక్వా ప్రాంతంలోని ఓ ఇన్‌స్టిట్యూట్‌లో సమావేశానికి సల్మాన్‌ రష్దీ నిన్న హాజరయ్యారు. అయితే ఆయన ప్రసంగానికి సిద్ధమవుతున్న క్రమంలోనే స్టేజిపైకి దూసుకొచ్చిన మతార్‌ ఆయనపై దాడికి పాల్పడ్డాడు. తీవ్ర గాయాలపాలైన రచయితను వెంటనే హెలికాప్టర్‌లో ఆసుపత్రికి తరలించారు. బుకర్‌ ప్రైజ్‌ విజేత అయిన రష్దీకి ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు ఉంది. అయితే, ఆయన రచించిన పలు నవలలు వివాదాస్పదమయ్యాయి.

ఇవీ చదవండి: కరవు కథాచిత్రం.. ఎండిన నదులు, చెరువులు.. 500 ఏళ్లలో లేని దుర్భర పరిస్థితులు

'అప్పటి నుంచి ఆయన నా ఫోన్‌ కాల్స్‌కు స్పందించడం లేదు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.