ETV Bharat / international

కోలుకుంటున్న సల్మాన్ రష్దీ    వెంటిలేటర్ తొలగింపు

author img

By

Published : Aug 14, 2022, 9:00 AM IST

ప్రముఖ రచయిత సల్మాన్ రష్దీ కోలుకుంటున్నారు. ప్రస్తుతం ఆయనకు వెంటిలేటర్ తొలగించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. రష్దీ ఇప్పుడు మాట్లాడగలుగుతున్నారని వెల్లడించాయి.

SALMAN RUSHDIE
SALMAN RUSHDIE

దాడికి గురైన ప్రముఖ రచయిత సల్మాన్ రష్దీ కోలుకుంటున్నారు. ఆయనకు ఇదివరకు వెంటిలేటర్​పై చికిత్స అందించిన వైద్యులు ప్రస్తుతం దాన్ని తొలగించారు. ప్రస్తుతం రష్దీ మాట్లాడగలుగుతున్నారని న్యూయార్క్​లోని చౌతాకా ఇన్​స్టిట్యూషన్ అధ్యక్షుడు మైఖెల్ హిల్ తెలిపారు. చౌతాకా సంస్థలో ప్రసంగించేందుకు వెళ్లిన సమయంలోనే రష్దీపై దాడి జరిగింది. ఓ దుండగుడు రష్దీపై కత్తితో దాడి చేశాడు. తీవ్రగాయాలతో ఆస్పత్రిలో చేరిన అతడికి గంటల పాటు చికిత్స కొనసాగింది. ఓ సర్జరీ సైతం నిర్వహించారు వైద్యులు. కత్తి పోట్ల వల్ల కాలేయం తీవ్రంగా దెబ్బతిందని శనివారం రష్దీ ఏజెంట్ న్యూయార్క్ టైమ్స్​కు వెల్లడించారు. ఓ కన్ను కోల్పోయే ప్రమాదం సైతం ఉందని తెలిపారు.

దీర్ఘకాలంగా మృత్యునీడలో రష్దీ
బుకర్‌ బహుమతి విజేత సల్మాన్‌ రష్దీ చాలాకాలం నుంచి మృత్యునీడలో ఉన్నారు. ప్రతిష్ఠాత్మక బహుమతి వరించగానే ఆయన పేరు అంతర్జాతీయ సాహిత్య రంగంలో మార్మోగిపోయింది. ఇరాన్‌ అధినాయకుడు అయతుల్లా ఖొమైనీ జారీ చేసిన ఫత్వా వల్ల మృత్యువు వెన్నాడటంతో ఆయన దీర్ఘకాలం అజ్ఞాతంలో ఉండిపోవాల్సి వచ్చింది. భావ ప్రకటన స్వేచ్ఛకు ప్రతిరూపంగా నిలిచినందున రష్దీ కొందరికి ఆరాధ్యనీయుడిగా, మరికొందరికి సైతానుగా కనిపించారు.

1947 జూన్‌ 19న బొంబాయి (ముంబయి)లో ఒక కశ్మీరీ ముస్లిం కుటుంబంలో అహ్మద్‌ సల్మాన్‌ రష్దీ జన్మించారు. 14 ఏళ్ల వయసులోనే రష్దీని తల్లిదండ్రులు విద్యాభ్యాసం కోసం ఇంగ్లండ్‌ పంపారు. ఉన్నత విద్య పూర్తి చేసిన తరవాత రష్దీ బ్రిటిష్‌ పౌరసత్వం పొందారు. క్రమంగా ఇస్లాం మత విశ్వాసాలకు దూరం జరిగారు. రచనా వ్యాసంగం కొనసాగిస్తూనే నటుడిగా, వాణిజ్య ప్రకటనల రచయితగా పనిచేశారు. రష్దీ మొదటి నవల ‘గ్రైమస్‌’ గొప్ప విజయం సాధించకపోయినా, విమర్శకులు ఆయనలో ప్రతిభను గుర్తించారు. ఆయన రెండో నవల మిడ్‌నైట్స్‌ చిల్డ్రన్‌ 1981లో ప్రతిష్ఠాత్మక బుకర్‌ బహుమతిని సాధించిపెట్టింది. సర్వత్రా ప్రశంసలు పొందిన ఆ పుస్తకం 5 లక్షల ప్రతులు అమ్ముడుపోయింది.

వివాదం రేకెత్తించిన సెటానిక్‌ వెర్సెస్‌
రష్దీ 14 నవలలు రాయగా, వాటిలో 1988లో వెలువడిన 'ది సెటానిక్‌ వెర్సెస్‌' అత్యంత వివాదాస్పదంగా నిలిచింది. ఈ నవలను దైవదూషణగా, మహాపచారంగా ముస్లింలు ఖండించారు. ఆ రచయితను హతమార్చాలంటూ ఇరాన్‌ అధినాయకుడు అయతుల్లా రుహుల్లా ఖొమేనీ ఫత్వా జారీ చేయడంతో రష్దీ తొమ్మిదేళ్లపాటు అజ్ఞాతవాసం చేశారు. ఈ నవల పాశ్చాత్య దేశాల్లో పలువురి ప్రశంసలతోపాటు విట్‌బ్రెడ్‌ బహుమతి కూడా పొందింది. ఈ పుస్తకం ఇస్లాంను అవమానిస్తోందని కొందరు ముస్లింలు మండిపడ్డారు. ఆయన భారత గడ్డపై అడుగుపెట్టరాదని పదేళ్లపాటు అమల్లో ఉన్న నిషేధాన్ని 1990లో తొలగించారు. ముస్లింల మనోభావాలను గాయపరచినందుకు రష్దీ క్షమాపణ చెప్పినా ఖొమేనీ మాత్రం ఫత్వాను ఉపసంహరించలేదు.

రష్దీతోపాటు ఆయన నవలను ఇతర భాషల్లోకి అనువదించినవారు సైతం బెదిరింపులకు లోనయ్యారు. నవలను జపనీస్‌ భాషలోకి అనువదించిన హిటోషీ ఇగరాషీ అనే సహాయ ఆచార్యుడిని 1991 జులైలో ట్సుకుబా విశ్వవిద్యాలయంలో ఆయన కార్యాలయం ఎదుటే ఎవరో కత్తితో పొడిచి చంపారు. అదే నెలలో ఇటాలియన్‌ అనువాదకుడు ఎట్టోరె క్యాప్రియాలోను మిలన్‌ నగరంలో కత్తిపోట్లకు గురయ్యారు. నార్వే అనువాదకుడు విలియం నైగార్డ్‌పై 1993లో ఆస్లో నగరంలోని ఆయన నివాసం ఎదుటే తుపాకీ కాల్పులు జరిగాయి. వీరిద్దరూ కూడా ప్రాణాలతో బయటపడ్డారు.

నాలుగుసార్లు పెళ్లి
సల్మాన్‌ రష్దీ నాలుగుసార్లు పెళ్లాడారు. ఆయనకు ఇద్దరు సంతానం. సాహిత్యానికి చేసిన సేవలను గౌరవిస్తూ రష్దీని బ్రిటిష్‌ రాణి 2007లో సర్‌ బిరుదుతో సత్కరించారు. ప్రస్తుతం అమెరికాలోనే నివసిస్తున్న రష్దీపై ఫత్వాకు ఇరాన్‌ ప్రభుత్వం అధికారికంగా వత్తాసు ఇవ్వడం 1998 నుంచే మానేసింది. దీంతో ఆయన కొంత ఊపిరి పీల్చుకోగలిగారు. రష్దీపై జారీచేసిన ఫత్వా.. తుపాకీ గొట్టం నుంచి దూసుకొచ్చిన తూటా లాంటిదనీ, అది లక్ష్యాన్ని చేరేవరకు విశ్రమించదని ఖొమేనీ గతంలో వ్యాఖ్యానించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.