ETV Bharat / international

92ఏళ్ల ఏజ్​లో ప్రేమ.. త్వరలోనే ఆమెతో కుబేరుడి పెళ్లి.. ఇదే చివరిది!

author img

By

Published : Mar 20, 2023, 7:23 PM IST

92 ఏళ్ల వయసులో మళ్లీ పెళ్లి చేసుకోనున్నారు ప్రపంచ మీడియా మొఘల్ రూపర్ట్ మర్డాక్​. ఇప్పటికే నాలుగు వివాహాలు చేసుకున్న ఆయన.. తాజాగా మరో మహిళతో పెళ్లికి సిద్ధమయ్యారు.

rupert murdoch new relationship
92 ఏళ్ల వయసులో ఐదోసారి పెళ్లి

ప్రపంచ మీడియా మొఘల్, 92 ఏళ్ల రూపర్ట్ మర్డాక్​ ఐదోసారి పెళ్లి చేసుకోనున్నారు. ఇప్పటికే నాలుగు సార్లు విడాకులు తీసుకున్న ఆయన.. తాజాగా మరో మహిళతో పెళ్లికి సిద్ధమయ్యారు. ఆమెతో ఎంగేజ్​మెంట్​ కూడా చేసుకున్నారు రూపర్ట్​. నాలుగో భార్య జెర్రీ హాల్​తో విడాకులు తీసుకున్న సంవత్సరంలోపే మరో పెళ్లికి సిద్ధమైపోయారు. 66 ఏళ్ల లెస్లీ ఆన్​ను త్వరలోనే పెళ్లి చేసుకోనున్నట్లు ప్రకటించిన రూపర్ట్​.. ఇదే తన చివరి వివాహమని స్పష్టం చేశారు. వీరి ఎంగేజ్​మెంట్​ న్యూయార్క్​లోని సెయింట్​ పాట్రిక్​లో జరిగింది. మరో మీడియా సంస్థ ప్రముఖడైన దివంగత చెస్టర్ స్మిత్​ భార్య లెస్లీ ఆన్​ను ఈ ఏడాది వేసవిలో పెళ్లి చేసుకోనున్నట్లు తెలిపారు. కాలిఫోర్నియా, బ్రిటన్​, న్యూయార్క్​లో వారి జీవితాన్ని గడపనున్నారు.

"నేను చాలా సంతోషంగా ఉన్నాను. గత సంవత్సరం ఓ సమావేశంలో ఆమెను కలుసుకున్నాను. కొంచెం సేపు ఆమెతో మాట్లాడాను. ఆ తర్వాత రెండు వారాలకు ఆమెకు ఫోన్ చేశాను. ఆ తర్వాత పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాం. ఇదే నాకు చివరి వివాహం."

--రూపర్ట్​ మర్డాక్​, మీడియా సంస్థల అధినేత

"నేను 14 ఏళ్లు ఒంటరిగా బతికాను. 70 ఏళ్ల వయసుకు చేరుకోవడం అంటే దాదాపు చివరికి వచ్చినట్లే. మా ఇద్దరికీ ఇది దేవుడు ఇచ్చిన కానుక. మేమిద్దరం గత సెప్టెంబర్‌లో కలిశాం. మా నిర్ణయం పట్ల మా స్నేహితులు చాలా సంతోషంగా ఉన్నారు."

--లెస్లీ ఆన్, రూపర్ట్​ పెళ్లి చేసుకోబోయే మహిళ

న్యూస్‌కార్ప్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్, బిలియనీర్ అయిన రూపర్ట్​ మర్డాక్​ 2016లో జెర్రీ హాల్‌ను (65) పెళ్లి చేసుకున్నారు. ప్రముఖ అమెరికన్ నటి, మోడల్‌ అయిన హాల్​.. రూపర్ట్​ కంటే 25 ఏళ్లు తక్కువ వయసు. 2022, జులై 1న వీరిద్దరూ విడాకుల కోసం దరఖాస్తు చేయగా.. అదే ఏడాది ఆగష్టులో మంజూరు చేసింది కోర్టు.

మర్డాక్​ ఇప్పటికే పాట్రిషియా బుకర్‌, అన్నా మరియా మన్‌, వెండీ డెంగ్‌ను వివాహం చేసుకున్నారు. అయితే ఈ నలుగురితోనూ రూపర్ట్​ విడాకులు తీసుకున్నారు. ఆయనకు ముగ్గురు కొడుకులు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. తన రెండో భార్య మన్‌ నుంచి విడిపోతున్నప్పుడు రూపర్ట్​ మర్డాక్​ చెల్లించిన భరణం అత్యంత ఖరీదైన భరణాల్లో ఒకటి. ఆ సమయంలో ఆమెకు 1.7 బిలియన్‌ డాలర్ల ఆస్తిని భరణంగా చెల్లించినట్లు సమాచారం. ప్రపంచవ్యాప్తంగా అనేక మీడియా సంస్థలను కలిగి ఉన్న మర్దోక్ ఆస్తుల నికర విలువ 17.7 బిలియన్ల డాలర్లుగా ఫోర్బ్స్‌ ఇటీవల లెక్కకట్టింది.

ఇవీ చదవండి : 28 ఏళ్లకే 9 మందికి తల్లి.. దశాబ్దం పాటు ఏటా ఒకరికి జన్మ!

మరియుపోల్​కు పుతిన్​.. ఆక్రమించుకున్నాక తొలిసారి.. స్వయంగా కారు నడుపుతూ..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.