ETV Bharat / international

చెస్​ ఆడుతుండగా రోబో 'పైశాచికం'.. పిల్లాడి వేలు విరిచేసిన చిట్టి!

author img

By

Published : Jul 26, 2022, 10:23 AM IST

Robot Chess finger break : ఏడేళ్ల బాలుడితో చెస్​ ఆడుతున్న రోబో.. ఒక్కసారిగా ఆ పిల్లాడి వేలు విరిచేసింది. ఈ హఠాత్ పరిణామంతో అక్కడున్న వారు ఖంగుతిన్నారు. రోబో చెర నుంచి బాలుడ్ని విడిపించారు.

robot chess finger
చెస్​ ఆడుతుండగా రోబో 'పైశాచికం'.. పిల్లాడి వేలు విరిచేసిన చిట్టి!

Robot Chess finger break : అది మాస్కో చెస్​ ఓపెన్ టోర్నమెంట్​. గత వారం రష్యాలోని చెస్ ప్రియుల దృష్టంతా ఆ పోటీలపైనే. అందులోనూ ఏడేళ్ల బాలుడికి, రోబోకు మధ్య జరుగుతున్న చెస్​ గేమ్​పైనే అందరి ఆసక్తి. మనిషికి, మర మనిషికి మధ్య మేధోపోరులో ఎవరు గెలుస్తారని ఉత్కంఠ. అంతా తీక్షణంగా గేమ్ చూస్తున్నారు. ప్రత్యర్థులు ఇద్దరూ వేస్తున్న ఎత్తుల్ని నిశితంగా గమనిస్తున్నారు. ఇంతలోనే అనూహ్య పరిణామం.

ఏడేళ్ల బాలుడు.. తన వంతు రాగానే చెస్​ బోర్డుపై పావుల్ని కదుపుదామని అనుకున్నాడు. ఇంతలోనే అక్కడున్న రోబో.. అతడి పావుల్లో ఒకదాన్ని లాగేసుకుంది. బాలుడి చేతిని గట్టిగా పట్టుకుంది. పక్కనున్న వారు ఒక్కసారిగా షాక్ అయ్యారు. వెంటనే అప్రమత్తమై రోబో చెర నుంచి బాలుడ్ని విడిపించేందుకు ప్రయత్నించారు. నలుగురు పెద్దలు కలిసి చాలాసేపు శ్రమించి.. రోబో నుంచి బాలుడ్ని రక్షించారు. అతడ్ని హుటాహుటిన అక్కడి నుంచి తీసుకెళ్లిపోయారు.

"రోబో.. చిన్నారి వేలు విరిచేసింది. ఇలా జరగడం దురదృష్టకరం. ఈ రోబో.. గతంలో అనేక పోటీల్లో పాల్గొంది. ఎప్పుడూ ఇలా జరగలేదు. ఆ బాలుడు మరుసటి రోజు చెస్ ఆడాడు. టోర్నమెంట్​ పూర్తి చేశాడు." అని చెప్పారు మాస్కో చెస్​ ఫెడరేషన్ అధ్యక్షుడు సెర్జీ లాజరెవ్.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.