ETV Bharat / international

ఇరాన్​కు పుతిన్​.. ఆ అధునాతన డ్రోన్ల కోసమే.. ఉక్రెయిన్​కు ఇక కష్టమే!

author img

By

Published : Jul 12, 2022, 5:47 PM IST

Putin set to visit Iran next week
Putin set to visit Iran next week

Iran Drones To Russia: ఉక్రెయిన్​పై యుద్ధం జరుగుతున్న సమయంలోనే.. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్​ పుతిన్​ వచ్చే వారం ఇరాన్​ వెళ్లనున్నారు. ఇరాన్​ నుంచి రష్యా మానవరహిత డ్రోన్ల సాయం కోరిందని అమెరికా వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో.. పుతిన్​ పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది. అయితే.. ఉక్రెయిన్‌లో కీలక లక్ష్యాలను ఛేదించడానికి రష్యా.. ఇరాన్‌ సాయం కోరుతోందా? ఇరాన్‌ నుంచి వందలాది డ్రోన్లు రష్యాకు చేరుకోనున్నాయా?

Iran Drones To Russia: శత్రువుకు శత్రువు మిత్రుడు అనే నానుడి మనకు బాగా తెలుసు. రష్యా- ఉక్రెయిన్‌ యుద్ధంలో అలాంటి పరిణామాలే చోటు చేసుకుంటున్నాయి. తాజాగా మానవ రహిత డ్రోన్ల కోసం రష్యా.. ఇరాన్‌ వైపు చూస్తోందని అమెరికా వెల్లడించింది. ఈ తరహా డ్రోన్లు ఆయుధాలను మోసుకెళ్లగలిగే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. అటు రష్యా, ఇటు ఇరాన్‌ రెండూ అమెరికాతో వైరాన్ని కలిగి ఉన్నాయి. అయితే.. ఇరాన్‌ ఇప్పటికే డ్రోన్లను రష్యాకు అందజేసిందా అనే విషయంపై స్పష్టత లేదని అమెరికా జాతీయ భద్రతా సలహాదారు జేక్ సుల్లివన్ వెల్లడించారు. ఈ డ్రోన్లను ఎలా ఉపయోగించాలో రష్యా బలగాలకు ఇరాన్‌ ఈ నెలలో శిక్షణ ఇవ్వనున్నట్లు కూడా తెలిపారు. వందలాది డ్రోన్లను ఇరాన్‌ రష్యాకు అందజేసే సంకేతాలు ఉన్నట్లు వివరించారు.

ఇరాన్​కు పుతిన్​: ఈ నేపథ్యంలోనే రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్​ పుతిన్​ ఇరాన్​కు వెళ్లనుండటం ప్రాధాన్యం సంతరించుకుంది. వచ్చే వారం ఇరాన్​కు వెళ్లి అక్కడే ఇరాన్​, టర్కీ దేశాల నేతలతో పుతిన్​ త్రైపాక్షిక సమావేశానికి హాజరుకానున్నట్లు క్రెమ్లిన్​ ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్​ వెల్లడించారు. అయితే.. ఇది ఈ చర్చలు సిరియా అంశంపై అని ఆయన పేర్కొన్నారు. టర్కీ అధ్యక్షుడు ఎర్దోగన్​తో కూడా పుతిన్​ విడిగా సమావేశం కానున్నారని స్పష్టం చేశారు.

దీనిపై ఇరాన్​ విదేశాంగ మంత్రి ప్రతినిధి కూడా స్పందించారు. కానీ.. అమెరికా చేసిన వ్యాఖ్యలను ఏమాత్రం ఖండించలేదు. ఇరాన్​-రష్యా సంబంధాలు.. ఉక్రెయిన్​తో యుద్ధం కంటే ముందు నుంచే బలంగా ఉన్నాయని పేర్కొన్నారు. అధునాతన డ్రోన్ల సరఫరా కూడా ఇందులో భాగమేనని అన్నారు.
మరోవైపు వచ్చే వారం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్​.. సౌదీ అరేబియా, ఇజ్రాయెల్​ పర్యటనలు చేపట్టనున్న తరుణంలో.. పుతిన్​ ఇరాన్​ పర్యటన చర్చనీయాంశంగా మారింది.

తూర్పు ఉక్రెయిన్‌పై భీకర దాడులు చేసి అనేక ప్రాంతాలను తమ అధీనంలోకి తెచ్చుకునేందుకు చాలా ఆయుధాలను రష్యా ఖర్చు చేసిందని అమెరికా భావిస్తోంది. గత 20 ఏళ్లుగా డ్రోన్‌ సాంకేతికపై ఇరాన్‌ దృష్టిపెట్టింది. రష్యా వద్ద ఉన్న డ్రోన్ల కంటే ఇరాన్‌ డ్రోన్లు బాగా పని చేస్తున్నట్లు తెలుస్తోంది. వందలాది మైళ్ల దూరం ప్రయాణించి లక్ష్యాలను ఛేదించిన ట్రాక్‌ రికార్డు ఇరాన్‌ డ్రోన్లకు ఉంది. రాజధాని కీవ్‌ను ఆక్రమించడానికి వచ్చిన రష్యా బలగాలను డ్రోన్ల సాయంతోనే అప్పట్లో ఉక్రెయిన్‌ సైన్యం నిలువరించింది. ఉక్రెయిన్‌ విద్యుత్‌ కేంద్రాలను, రిఫైనరీలను, కీలక మౌలిక సదుపాయాలపై అత్యంత కచ్చితత్వంతో దాడులు చేయగల సామర్థ్యం ఇరాన్‌ డ్రోన్లకు ఉంది. యుద్ధానికి ముందు ఇజ్రాయెల్ నుంచి డ్రోన్‌ సాంకేతికతను రష్యా పొందాలని చూసినా యుద్ధం ప్రారంభమైన తర్వాత ఈ అంశంలో ఇజ్రాయెల్‌ తటస్థంగా ఉండటం వల్ల అది సాధ్యం కాలేదు. ఈ నేపథ్యంలో డ్రోన్ల కోసం ఇరాన్‌ను రష్యా ఆశ్రయించినట్లు అమెరికా ఆరోపిస్తోంది.

ఇవీ చూడండి: మరో బిడ్డకు తండ్రి కాబోతున్న పుతిన్​.. మాజీ జిమ్నాస్ట్​ ప్రేయసితోనే.. ఇష్టం లేదు కానీ!

ఉక్రెయిన్​ వాసులకు వేగంగా రష్యా పౌరసత్వం.. పుతిన్​ నిర్ణయం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.