ETV Bharat / international

ఉక్రెయిన్​ వాసులకు వేగంగా రష్యా పౌరసత్వం.. పుతిన్​ నిర్ణయం

author img

By

Published : Jul 12, 2022, 6:59 AM IST

Russia Ukraine citizenship: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఉక్రెయిన్ పౌరులకు వేగంగా రష్యా పౌరసత్వం పొందడానికి వీలు కల్పించే ఉత్తర్వుపై సోమవారం సంతకం చేశారు. అయితే ఈ ఉత్తర్వుతో ఉక్రెయిన్‌పై మాస్కో ప్రభావాన్ని మరింత విస్తరించే ప్రయత్నం మొదలైనట్లయింది. మరోవైపు, ఖర్కివ్​పై రష్యా దాడులకు దిగింది. ఈ ఘటనలో ముగ్గురు ప్రాణాలు కోల్పోగా.. 31 మంది గాయపడ్డారు.

Putin
వ్లాదిమిర్‌ పుతిన్‌

Russia Ukraine citizenship: ఉక్రెయిన్‌ వాసులంతా శీఘ్రగతిన రష్యా పౌరసత్వం పొందడానికి వీలు కల్పించే ఉత్తర్వుపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ సోమవారం సంతకం చేశారు. తద్వారా ఉక్రెయిన్‌పై మాస్కో ప్రభావాన్ని మరింత విస్తరించే ప్రయత్నం మొదలైనట్లయింది. ఇటీవలి కాలం వరకు ఉక్రెయిన్‌లోని దొనెట్స్క్‌, లుహాన్స్క్‌, జపోరిజిజియా, ఖేర్సన్‌ ప్రాంతాల నుంచి వచ్చినవారికే సులభతర విధానంలో రష్యా పౌరసత్వం లభించేది. దాదాపు ఇవన్నీ రష్యా నియంత్రణలోనే ఉండేవి. తాజాగా ఉక్రెయిన్‌ మొత్తానికి ఈ విధానాన్ని వర్తింపజేయాలని పుతిన్‌ నిర్ణయించారు. దీనిపై ఉక్రెయిన్‌ ఇంకా స్పందించలేదు. 2019లో ఈ విధానాన్ని రెండు ప్రాంతాల వారి కోసం ప్రారంభించగా ఈ ఏడాది మే నెలలో మరో రెండు ప్రాంతాలను చేర్చారు. మొత్తంమీద ఇప్పటివరకు దాదాపు 7.20 లక్షల మందికి రష్యా పాస్‌పోర్టులు జారీ అయ్యాయి. ఉక్రెయిన్‌ జనాభాలో 18% మంది వీటిని పొందారు.

.

జర్మనీకి గ్యాస్‌ పైపులైన్‌ మూసివేత: రష్యా నుంచి జర్మనీకి ఉన్న ప్రధానమైన గ్యాస్‌ పైపులైన్‌ను వార్షిక నిర్వహణ పనుల పేరిట సోమవారం మూసివేశారు. ఈ నెల 21 వరకు పనులు కొనసాగుతాయని రష్యా చెప్పినా, ఆ గడువులో దీనిని పునరుద్ధరించకపోవచ్చని జర్మనీ అనుమానం వ్యక్తంచేసింది. సాంకేతిక కారణాల పేరిట ఇప్పటికే జర్మనీకి 60% మేర గ్యాస్‌ సరఫరాను రష్యా తగ్గించింది.

ఈ దాడులు ఉగ్ర చర్యే: ఖర్కివ్‌పై రష్యా మరోసారి దాడులకు దిగడం కచ్చితంగా ఉగ్రచర్యేనని ఉక్రెయిన్‌ పేర్కొంది. దీనిలో ముగ్గురు చనిపోగా 31 మంది గాయపడ్డారు. వీరిలో పలువురు పిల్లలు కూడా ఉన్నారు. దుకాణాలు, నివాస భవనాలు, కార్లు దెబ్బతిన్నాయి. దొనెట్స్క్‌ సరిహద్దు ప్రాంతాలపైనా రాకెట్లు విరుచుకుపడ్డాయి. యుద్ధం మొదలైనప్పటి నుంచి కొందరు సైనికులు అవిశ్రాంతంగా పనిచేయాల్సి రావడం రష్యాకు నష్టం కలిగిస్తోందని బ్రిటన్‌ సైన్యం పేర్కొంది.

ఇవీ చదవండి: వచ్చేవారంలో శ్రీలంక కొత్త అధ్యక్షుడి ఎన్నిక

జపాన్​లో షింజో పార్టీదే విజయం.. వీచిన సానుభూతి పవనాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.