'భూమిపై ఏలియన్లు.. అప్పుడప్పుడు వచ్చిపోయే సాసర్లు'.. అమెరికా ఏమందంటే?

author img

By

Published : Dec 17, 2022, 6:44 PM IST

Alien

భూమిపై గ్రహాంతరవాసుల కదలికలపై ఇప్పటివరకు ఎలాంటి ఆధారాలు లభించలేదని అమెరికా సైనిక అధికారులు తెలిపారు. ఇందుకోసం తాము వందలాది నివేదికలను పరిశీలిస్తున్నట్లు చెప్పారు.

గ్రహాంతరవాసులు, వారి వ్యోమనౌకలుగా భావిస్తున్న ఫ్లయింగ్‌ సాసర్లు భూమిపై ఉన్నాయా? లేవా?..అనే అంశం చాలా ఏళ్లుగా అంతుచిక్కని రహస్యమే. అయితే.. ఏలియన్లు భూమిని సందర్శించినట్లు, లేదా ఇక్కడ దిగినట్లు చెప్పడానికి ఇప్పటివరకు ఎలాంటి ఆధారాలు దొరకలేదని అమెరికా సీనియర్ సైనిక అధికారులు తాజాగా వెల్లడించారు. యూఎఫ్‌వో సంబంధిత ఘటనలపై రూపొందిన వందలాది నివేదికలను తాము క్షుణ్ణంగా పరిశీలిస్తున్నట్లు తెలిపారు. ఇంటెలిజెన్స్, భద్రత కోసం అమెరికా రక్షణశాఖ అండర్ సెక్రెటరీ రోనాల్డ్ మౌల్ట్రీ ఈ విషయాన్ని స్పష్టం చేశారు.

అయితే, గ్రహాంతరవాసుల ఉనికిని కొట్టిపారేయలేమని..పెంటగాన్ కొత్తగా ఏర్పాటు చేసిన ఆల్ డొమైన్ అనోమలీ రిజల్యూషన్ ఆఫీస్(ఏఏఆర్​ఓ) డైరెక్టర్ సీన్ కిర్క్‌ప్యాట్రిక్ అన్నారు. దీనిపై శాస్త్రీయ విధానాల్లో పరిశోధనలు చేస్తున్నట్లు చెప్పారు. తాజాగా నిర్వహించిన సంస్థ మొదటి వార్తాసమావేశంలో ఆయన రోనాల్డ్ మౌల్ట్రీతో కలిసి మాట్లాడారు. అమెరికా సైనిక స్థావరాలు, నిషేధిత గగనతలం, ఇతరత్రా ప్రదేశాల్లో అసాధారణ, గుర్తుతెలియని వస్తువుల కార్యకలాపాలపై ఈ సంస్థ దృష్టి పెట్టింది. దీంతో సైన్యానికి, జాతీయ భద్రతకు ముప్పు అవకాశాలపై ప్రభుత్వాన్ని అప్రమత్తం చేస్తుంది.

'గుర్తించని వైమానిక దృగ్విషయాలు(యూఏపీ)' అంటూ అమెరికా సైన్యం చెప్పే 140కిపైగా యూఎఫ్‌ఓ సంబంధిత ఘటనలను ప్రభుత్వం గత ఏడాది ఓ నివేదికలో పొందుపర్చింది. ఆ తర్వాత కూడా వందల కేసులూ నమోదైనట్లు కిర్క్‌ప్యాట్రిక్ చెప్పారు. కచ్చితమైన సంఖ్య త్వరలో ప్రకటిస్తామన్నారు. అయితే, మే నాటికే ఈ సంఖ్య 400కు చేరుకుందని నేవీ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. ఇటీవల ఆమోదించిన వార్షిక రక్షణ విధాన బిల్లులోనూ అమెరికా కాంగ్రెస్..పెంటగాన్‌ ప్రయత్నాలపై దృష్టి సారించింది. 1945ల నాటినుంచి యూఎఫ్‌ఓలకు సంబంధించిన ప్రభుత్వ రికార్డులను పరిశీలించి ఒక నివేదికను సిద్ధం చేయాలని సూచించింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.