ETV Bharat / international

కొత్తగా మరో ఇన్ఫెక్షన్​.. మెదడును తినేస్తుందట..! ఇప్పటికే ఒకరు మృతి

author img

By

Published : Dec 28, 2022, 7:21 AM IST

ప్రపంచవ్యాప్తంగా కరోనా విలయతాండవం చేస్తున్న వేళ.. దక్షిణ కొరియాలో మరో అరుదైన ఇన్ఫెక్షన్​తో ఓ వ్యక్తి మృతిచెందాడు. మెదడును తినేసే ఈ ఇన్ఫెక్షన్​ ముక్కుద్వారా మనిషిలోపలికి ప్రవేశిస్తుందని వైద్యులు గుర్తించారు. అయితే దీనిపై పరీక్షలు జరిగిన శాస్త్రవేత్తలు ఇది అంటువ్యాధి కాదని తేల్చారు.

naegleria fowleri infection
నెగ్లేరియా ఫౌలెరి

పెరుగుతున్న కొవిడ్‌ కేసులతో ప్రపంచం ఆందోళన చెందుతున్న వేళ దక్షిణ కొరియాలో అరుదైన ఇన్ఫెక్షన్‌ బారిన పడి ఒక వ్యక్తి(50) మరణించాడు. మెదడును తినేసే 'నెగ్లేరియా ఫౌలెరి' అనే అమీబా వల్ల అతడికి ఈ ఇన్ఫెక్షన్‌ సోకింది. ఈ ఇన్ఫెక్షన్‌ను 'ప్రైమరి అమీబిక్‌ మెనింజోఎన్‌సైఫలిటిస్‌ (పీఏఎమ్‌)' అని పిలుస్తారు. ప్రస్తుత ఘటనలో దక్షిణ కొరియాలో మరణించిన వ్యక్తికి థాయ్‌లాండ్‌లో ఈ ఇన్ఫెక్షన్‌ సోకింది. అతడు అక్కడ నాలుగు నెలలు గడిపి డిసెంబరు 10న దక్షిణ కొరియాకు చేరుకున్నాడు. ఈ విషయాన్ని 'ది కొరియా డిసీజ్‌ కంట్రోల్‌ అండ్‌ ప్రివెన్షన్‌ ఏజెన్సీ(కేడీసీఏ)' ధ్రువీకరించింది.

మృత్యువును తప్పించడం కష్టం..
అమెరికాకు చెందిన సెంటర్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌ అండ్‌ ప్రివెన్షన్‌ (సీడీసీ) తెలిపిన దాని ప్రకారం ఈ జీవి ముక్కు ద్వారా లోనికి ప్రవేశించి.. మెదడు వద్దకు చేరుకుంటుంది. దానిని ఆహారంగా భావించి అక్కడి కీలక ప్రాంతాలపై దాడి చేస్తుంది. తద్వారా నాడీ వ్యవస్థా దెబ్బతింటుంది. దాంతో పీఏఎమ్‌ సమస్య తలెత్తుతుంది. తీవ్రమైన భరించలేని తలనొప్పి ఈ ఇన్ఫెక్షన్‌ మొదటి లక్షణం. అనంతరం మానసిక సంతులత దెబ్బతినడం, భ్రాంతికి గురవడం తదితర మార్పులకు గురై బాధిత వ్యక్తి కోమాలోకి వెళ్లిపోతారు. 1962 నుంచి 2021 మధ్యలో అమెరికాలో 154 మందిపై ఈ అమీబా దాడి చేయగా కేవలం నలుగురే మృత్యువును తప్పించుకున్నారు. అయితే మనిషి నుంచి మనిషికి ఈ వ్యాధి సోకదని వైద్యులు స్పష్టం చేయడం ఊరట కలిగించే విషయం. దీనికి ప్రభావవంతమైన ఔషధం అందుబాటులో లేదు. ఇప్పటికే ఉన్న కొన్ని రకాల ఔషధాల సమ్మేళనాలతో వైద్యం చేస్తారని సీడీసీ వివరించింది.

ఏమిటీ 'నెగ్లెరియా ఫౌలెరి'?
ఏకకణజీవి అయిన నెగ్లెరియా ఫౌలెరి అమీబా వర్గానికి చెందినది. ఈ జీవులు మంచి నీటి వనరుల్లో, మట్టిలో, చెరువుల్లో, సరసుల్లో ఉంటాయి. అమీబాలు అన్నీ మనకు ప్రాణాంతకం కావు కానీ నెగ్లేరియా ఫెలోరి మాత్రం మనిషి ప్రాణం తీయగలదు. ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉన్నపుడు సరస్సులు, చెరువుల్లో నీటి పరిమాణం తగ్గిపోవడమే కాకుండా వెచ్చగానూ మారతాయి. ఏదైనా కారణం వల్ల అలాంటి మడుగుల్లోని నీరు ముక్కు ద్వారా లోపలికి వెళితే ఈ ఇన్ఫెక్షన్‌ బారిన పడే అవకాశం చాలా ఎక్కువ.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.