ETV Bharat / international

ఆసక్తికరంగా బ్రిటన్​ రాజకీయాలు.. రిషి సునాక్​ X బోరిస్​ జాన్సన్​!

author img

By

Published : Oct 21, 2022, 7:11 AM IST

బ్రిటన్‌లో ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో ప్రధానిగా లిజ్‌ ట్రస్‌ రాజీనామా ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే, వచ్చే వారం నాటికి తదుపరి ప్రధానిని ఎన్నుకుంటారని ఆమె ప్రకటించడం వల్ల అందరిచూపూ భారత సంతతికి చెందిన రిషి సునాక్‌ పైనే పడింది. ఇప్పుడు మళ్లీ మాజీ ప్రధాని బోరిస్​ జాన్సన్​ పోటీ పడేందుకు సిద్ధమవుతున్నారు. దీంతో బ్రిటన్​ రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి.

rishi sunak
rishi sunak

2016 బ్రెగ్జిట్‌ తర్వాత ఏడేళ్లలో బ్రిటన్‌ ఐదో ప్రధానిని చూడబోతోంది. ఇంతకూ లిజ్‌ ట్రస్‌ తర్వాత బ్రిటన్‌ పగ్గాలు ఎవరు చేపడతారు? ఇప్పటికైనా ఆంగ్లేయులు భారత సంతతికి చెందిన రిషి సునాక్‌కు అవకాశం ఇస్తారా? సమర్థుడైన ఆర్థిక మంత్రిగా పేరొందిన ఆయన పేరును ఆమోదిస్తారా? లేక మరొకరిని ఎంచుకుంటారా అనేది వెయ్యి పౌండ్ల ప్రశ్న!

బోరిస్‌ జాన్సన్‌ మళ్లీ సై
45 రోజుల కిందటే లిజ్‌ ట్రస్‌తో పోటీపడి ఓడిపోయిన రిషి సునాక్‌.. బ్రిటన్‌ ప్రధాని పదవి పోటీలో మళ్లీ తెరపైకి వచ్చారు. ట్రస్‌ రాజీనామా నేపథ్యంలో అందరికళ్లూ మళ్లీ సునాక్‌పై పడ్డాయి. రేసులో ఆయనే ముందంజలో ఉన్నారు. అయితే కన్జర్వేటివ్‌ పార్టీలోని అంతర్గత రాజకీయాల కారణంగా ఎవరి పేరైనా అనూహ్యంగా తెరపైకి వచ్చే అవకాశముంది. సునాక్‌తోపాటు మరికొందరి పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. వారు మాజీ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌, ప్రస్తుత ఆర్థిక మంత్రి జెరెమీ హంట్‌, ప్రతినిధుల సభ నేత పెనీ మోర్డౌంట్‌, రక్షణ మంత్రి బెన్‌ వాలెస్‌. వీరందరిలోనూ సునాక్‌కే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. సాధారణంగానైతే ప్రస్తుతం బ్రిటన్‌ ఉన్న ఆర్థిక ఇబ్బందుల దృష్ట్యా, గతంలో భేషైన ఆర్థిక మంత్రిగా ప్రశంసలు అందుకున్న సునాక్‌ సరైన, ఏకైక ఎంపిక కావాలి.

కానీ ఆంగ్లేయుల రాజకీయాల్లో సునాక్‌కు ఇంకా ఇబ్బందులు ఎదురవుతూనే ఉన్నాయి. తన రాజీనామాకు కారణమైన సునాక్‌ను ప్రధానిగా చూడటానికి మాజీ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ సిద్ధంగా లేరు. మొన్నటి ఎన్నికల్లోనే ట్రస్‌ కంటే తొలుత రేసులో ముందంజలో ఉన్న సునాక్‌కు వ్యతిరేకంగా ఆయన ప్రచారం చేశారు. సునాక్‌పై కోపంతో ట్రస్‌కు మద్దతిచ్చారు. ఆమె గెలిచేలా చేశారు. తాజాగా మళ్లీ తానే రంగంలోకి దిగాలని ఆశపడుతున్నారు. ఒకవేళ తాను నెగ్గలేని పరిస్థితుల్లో సునాక్‌ను ఓడించటానికే జాన్సన్‌ ప్రయత్నిస్తున్నారు. బ్రిటన్‌లో తదుపరి సార్వత్రిక ఎన్నికలు 2025లో జరుగుతాయి. అప్పటిదాకా మెజార్టీ ఉన్న కన్జర్వేటివ్‌ పార్టీ అభ్యర్థే ప్రధాని అవుతారు. ట్రస్‌ తర్వాతి ప్రధానిని ఎన్నుకునేది కన్జర్వేటివ్‌ పార్టీయే. క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న దేశ భవితవ్యానికి ఆ పార్టీ పెద్దపీట వేస్తుందా, లేదా సంకుచిత రాజకీయాలకా అనేది మరో వారంలో తేలిపోతుంది. ఒకవేళ రిషి సునాక్‌ ప్రధానిగా ఎన్నికైతే భారత సంతతి నుంచి ఆ అవకాశం లభించిన తొలి వ్యక్తి అవుతారు.

బ్రిటన్‌లో పరిణామాలకు సంబంధించి కొన్ని కీలక పాయింట్లు ఇవే..

  1. బ్రిటన్‌లో ఆర్థిక మాంద్యం తీవ్రరూపం దాల్చే అవకాశం ఉందన్న ఆందోళనల నేపథ్యంలో తాను ఏ లక్ష్యంతోనైతే పదవి చేపట్టానో దాన్ని నిర్వర్తించే పరిస్థితిలేక రాజీనామా చేస్తున్నట్టు లిజ్‌ తెలిపారు. ఆమె చేపట్టిన ఆర్థిక కార్యక్రమాలపై సొంత పార్టీ నేతల నుంచే తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దే లక్ష్యంతో లిజ్‌ తీసుకున్న చర్యలు కన్జర్వేటివ్‌ పార్టీలో చీలికలు తీసుకొచ్చాయి. బ్రిటన్‌ చరిత్రలో అత్యంత తక్కువ రోజులు (దాదాపు ఆరు వారాలు) ప్రధానిగా ఉన్న వ్యక్తి లిజ్‌ ట్రస్‌.
  2. లిజ్‌ ట్రస్‌ అధికారం చేపట్టిన తర్వాత గత నెలలో ప్రవేశపెట్టిన మినీ బడ్జెట్‌తో దేశ ఆర్థిక వ్యవస్థ కుదేలైంది. మార్కెట్లు కుప్పకూలడం, పౌండ్‌ విలువ పతనం గందరగోళానికి దారితీసింది. అయితే, ఈరోజు ఆమె రాజీనామా ప్రకటించడంతో చోటుచేసుకున్న పరిణామాల వేళ పౌండ్‌ విలువ 0.36శాతం పెరిగినట్టు సమాచారం.
  3. కన్జర్వేటివ్‌ పార్టీ నేత జెర్మీ హంట్‌ తాను ప్రధాని రేసులో లేనని ప్రకటించారు. దీంతో తదుపరి ప్రధానిగా ఎవరికి అవకాశం వస్తుందన్న చర్చలో ప్రధానంగా రిషి సునాక్‌ పేరే వినిపిస్తోంది. కొన్ని నెలల క్రితం జరిగిన కన్జర్వేటివ్‌ పార్టీ ఎన్నికల్లో లిజ్‌ ట్రస్‌ చేతిలో రిషి ఓటమిపాలైన విషయం తెలిసిందే.
  4. లిజ్‌ రాజీనామా తర్వాత ప్రధాని పోస్టు కోసం ఐదుగురి పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. వీటిలో రిషి సునాక్‌ పేరు ముందు వరుసలో ఉండగా.. ఆ తర్వాత పెన్నీ మోర్డాంట్‌, బెన్‌ వాల్స్‌, టామ్ తుగెందాట్‌లతో పాటు బోరిస్‌ జాన్సన్ పేరు కూడా వినిపిస్తున్నట్టు అంతర్జాతీయ మీడియా కథనాలు పేర్కొంటున్నాయి. ఇటీవల ప్రధాని పదవికి బోరిస్‌ జాన్సన్‌ రాజీనామా చేయడంతోనే లిజ్‌ట్రస్‌ తదుపరి ప్రధానిగా ఎన్నికైన విషయం తెలిసిందే. అలాగే, బ్రిటన్‌ హోంసెక్రటరీ పదవికి నిన్న రాజీనామా చేసిన సుయెల్లా బ్రేవర్మన్‌ పేరు కూడా ప్రచారంలో ఉన్నట్టు సమాచారం.
  5. గొప్ప అవకాశాలకు భారత్‌ నిలయంగా ఉందని గతంలో లిజ్ ట్రస్ పేర్కొన్నారు. ఇరుదేశాల మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేసుకుంటామని ఇటీవల చెప్పారు. ఈ నేపథ్యంలో ప్రధాని పదవి నుంచి ఆమె నిష్క్రమణ భారత్‌-యూకే స్వేచ్ఛా వాణిజ్యంలో అనిశ్చితి ఏర్పడినట్టయింది. లిజ్‌ ట్రస్‌, ఆమె కేబినెట్‌ భారతదేశంతో ఒప్పందాన్ని మరింత ఇనుమడింప జేసుకొనేందుకు ప్రయత్నించింది.
  6. బ్రిటన్‌కు మరో వారంలోపే కొత్త ప్రధాని నియమితులవుతారని లిజ్‌ ప్రకటించారు. బ్రిటన్‌ చరిత్రలో అత్యంత కీలక అధ్యాయమైన 2016లో బ్రెగ్జిట్‌ పరిణామాల తర్వాత గత ఏడేళ్ల వ్యవధిలో ఐదో వ్యక్తి బ్రిటన్‌ ప్రధానిగా బాధ్యతలు చేపట్టనున్నారు.
  7. బ్రిటన్‌లో సంక్షోభ పరిస్థితులు అధికార కన్జర్వేటివ్‌ పార్టీకి ఇబ్బందికరంగా మారాయి. ఆ పార్టీలో 62% మంది నేతలు తాము తప్పుడు అభ్యర్థిని ఎన్నుకున్నామనే భావనలో ఉన్నట్లు 'ది టైమ్స్‌' నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణలో ఇటీవల వెల్లడైంది. 15 శాతం మంది సభ్యులు మాత్రం తమ నిర్ణయం సరైందేననే అభిప్రాయం వ్యక్తం చేశారని ఆ నివేదిక పేర్కొంది.

ఇదీ చదవండి: బ్రిటన్ ప్రధాని రాజీనామా- పదవి చేపట్టిన 45 రోజులకే..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.