ETV Bharat / international

చైనాలో రోజుకి 3.7కోట్ల కరోనా పాజిటివ్‌ కేసులు! ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాప్తిగా..!

author img

By

Published : Dec 24, 2022, 7:39 AM IST

latest news about corona cases  increased  in china
చైనాలో పెరిగిపోతున్న కరోనా పాజిటివ్​ కేసులు

Corona Cases In China : చైనాలో రోజురోజుకి కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. డిసెంబరు చివరి వారంలో రోజుకు 3.7కోట్ల కరోనా కేసులు నమోదయ్యే అవకాశముందని చైనా నేషనల్‌ హెల్త్‌ కమిషన్‌ అంచనా వేసింది.

Corona Cases In China : పొరుగుదేశం చైనాలో కరోనా విజృంభిస్తోంది. రోజు రోజుకూ కరోనా కేసుల సంఖ్య పెరిగిపోతోంది. గత 20 రోజుల్లో 248 మిలియన్ల మందికి ఈ వైరస్‌ సోకి ఉండొచ్చని అంచనా. అంటే చైనా జనాభాలో దాదాపు 18 శాతం మందికి కరోనా నిర్ధారణ అయినట్లు తెలుస్తోంది. ఇదే పరిస్థితి కొనసాగితే డిసెంబరు చివరి వారంలో ఒక్క రోజులోనే 3.7కోట్లకు పైగా కేసులు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని చైనా ప్రభుత్వ యంత్రాంగం అంచనా వేస్తోంది. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాప్తిగా పరిణామం చెందుతుందని భావిస్తోంది.

దేశంలో కరోనా వైరస్‌ వ్యాప్తి తీవ్రమవుతున్న నేపథ్యంలో చైనా నేషనల్‌ హెల్త్‌ కమిషన్‌ (ఎన్​హెచ్​సీ) బుధవారం అత్యవసరంగా భేటీ అయ్యింది. కొవిడ్‌ వ్యాప్తిని ఎలా అరికట్టాలన్న అంశంపై చర్చించినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. మరోవైపు కొవిడ్‌ను కట్టడిచేసేందుకు అవలంబించిన జీరో కొవిడ్‌ పాలసీ వల్ల హెర్డ్‌ ఇమ్యూనిటీ తగ్గి.. ఒమిక్రాన్‌ సబ్‌ వేరియంట్లు వ్యాప్తి చెందడానికి దారి తీసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. తాజా వ్యాప్తిలో చిచువాన్‌ ప్రావిన్స్‌లోని సౌత్‌వెస్ట్‌, బీజింగ్‌లో సగానికిపైగా ప్రజలు ఈ వైరస్‌ బారిన పడే అవకాశముందని ఎన్‌హెచ్‌సీ అంచనా వేస్తోంది. అయితే చైనా హెల్త్‌ రెగ్యులేటరీ ఈ అంచనాలకు ఎలా వచ్చిందన్న అంశంపై స్పష్టత కొరవడింది.

మరోవైపు ఈ నెల ప్రారంభంలో దేశవ్యాప్తంగా పీసీఆర్‌ టెస్టింగ్‌ సెంటర్లను చైనా మూసివేసింది. అందువల్ల ఎంత మందికి కరోనా సోకుతోందన్న అంశంపై కచ్చితమైన లెక్కలు బయటకి రావడం లేదు. వ్యక్తిగత శ్రద్ధతో ర్యాపిడ్‌ యాంటీజెన్‌ టెస్టులు చేయించుకున్న వారు సైతం పాజిటివ్‌ వస్తే ప్రభుత్వ అధికారులకు చెప్పేందుకు నిరాకరిస్తున్నారు. దీంతో ప్రతి రోజూ ఎన్ని కేసులు నమోదవుతున్నాయన్న విషయాన్ని గత కొన్ని రోజులుగా చైనా ప్రభుత్వం వెల్లడించడం లేదు. మరోవైపు జనవరి చివరి నాటికి చైనాలోని ప్రధాన నగరాల్లో కరోనా మహమ్మారి తీవ్రత తారస్థాయికి చేరుకునే అవకాశముందని డేటా కన్సల్టెన్సీ సంస్థ మెట్రోడేటాటెక్‌ ఛీప్‌ ఎకనామిస్ట్‌ చెన్‌ క్విన్‌ వెల్లడించారు.

గత వేరియంట్ల వ్యాప్తిని పరీశీలిస్తే.. పట్టణ ప్రాంతాలల్లో ఎక్కువగా వ్యాపించిన ఈ వైరస్‌ క్రమంగా గ్రామీణ ప్రాంతాలకు చేరుకుంది. వైద్యసదుపాయాల లేమి కారణంగా రూరల్‌ ప్రాంతాల్లోనే మరణాలు అత్యధికంగా నమోదయ్యాయి. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని అన్ని రకాలుగా సిద్ధంగా ఉండాలని ఎన్‌హెచ్‌ఎస్‌ సూచించింది. అయితే ప్రముఖ వార్తా సంస్థ బ్లూమ్‌బర్గ్‌ మాత్రం ఈ అంచనాలను తప్పుబడుతోంది. డిసెంబరు 20న కేవలం 3,049 కేసులు మాత్రమే నమోదయ్యాయని, అలాంటిది ఈ వారంలో ఒక్క రోజులోనే 3.7కోట్ల కేసులు నమోదు కావడం సాధ్యం కాకపోవచ్చని తెలిపింది. కరోనా వ్యాప్తి ఉద్ధృంతంగా ఉన్న సమయంలో జనవరి 19, 2022న అత్యధికంగా 40 లక్షల కేసులు నమోదైన విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.