ETV Bharat / international

ఆ దేశ పార్లమెంట్‌ రద్దు.. నాలుగేళ్లలో ఐదోసారి ఎన్నికలు

author img

By

Published : Jul 1, 2022, 11:36 AM IST

Israel Parliament: వివిధ పార్టీలతో కలిసి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పటికీ, దానిని విజయవంతంగా ముందుకు కొనసాగించడంలో ఇజ్రాయెల్​ దేశ ప్రభుత్వం విఫలమైంది. పార్లమెంటును రద్దు చేసి మళ్లీ ఎన్నికలకు వెళ్లాలని నిర్ణయించింది. అంతే కాకుండా ఈ ఏడాది నవంబర్‌లో ఎన్నికలు జరపనున్నట్లు వెల్లడించింది. తాజా పరిణామాలతో నఫ్తాలీ బెన్నెట్‌ అతితక్కువ వ్యవధిలోనే ప్రధాని పదవి కోల్పోవాల్సి వచ్చింది.

Israel Parliament:
Israel Parliament:

Israel Parliament: భిన్న సిద్ధాంతాలు కలిగిన పార్టీలతో సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పటికీ దానిని విజయవంతంగా నడపడంలో మాత్రం ఇజ్రాయెల్‌ ప్రభుత్వం విఫలమైంది. దీంతో పార్లమెంటును రద్దు చేసి కొత్తగా ఎన్నికలకు వెళ్లాలని నిర్ణయించింది. దీనికి ఇజ్రాయెల్‌ పార్లమెంట్‌ ఆమోదం తెలపడంతోపాటు నవంబర్‌లో మరోసారి ఎన్నికలు జరపనున్నట్లు తెలిపింది. అయితే, గడిచిన నాలుగేళ్లలో ఇలా ఎన్నికలు జరపడం ఐదోసారి కావడం గమనార్హం. తాజా పరిణామాలతో నఫ్తాలీ బెన్నెట్‌ అతితక్కువ వ్యవధిలోనే ప్రధాని పదవి కోల్పోవాల్సి వచ్చింది. ప్రస్తుతం విదేశాంగమంత్రిగా ఉన్న యాయెర్‌ లాపిడ్‌ ఎన్నికలు జరిగే వరకు ఆపద్ధర్మ ప్రధానిగా కొనసాగనున్నారు.

120 మంది సభ్యులు కలిగిన ఇజ్రాయెల్‌ సెనెట్‌కు గత రెండేళ్లలో నాలుగుసార్లు ఎన్నికలు జరిగాయి. ఇజ్రాయెల్‌ ప్రధానిగా సుదీర్ఘకాలం పాటు (12ఏళ్లు) కొనసాగిన బెంజమిన్‌ నెతన్యాహుకు పార్లమెంటులో మద్దతు లేకపోవడంతో గతేడాది జూన్‌లో పదవి నుంచి తప్పుకున్నారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ఏ పార్టీకీ మద్దతు లేకపోవడంతో ఎనిమిది పార్టీలతో సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. అనంతరం నఫ్తాలీ బెన్నెట్‌ను నూతన ప్రధానిగా అక్కడి పార్లమెంట్‌ ఎన్నుకుంది.

అయితే, ఈ సంకీర్ణ ప్రభుత్వాన్ని నడపడంలో నఫ్తాలీ బెన్నెట్‌ విఫలమయ్యారు. ముఖ్యంగా పాలనా వ్యవహారాలు, కొత్తగా ఎన్నికల తేదీలపై అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య తీవ్ర ఘర్షణ నెలకొంది. దీంతో పార్లమెంటును రద్దు చేయాలనే ప్రతిపాదన రావడంతోపాటు ఇందుకు 92 మంది చట్టసభ సభ్యులు ఆమోదం తెలిపారు. కేవలం తొమ్మిది మంది మాత్రమే వ్యతిరేకించడంతో ఇజ్రాయెల్‌ పార్లమెంట్‌ మరోసారి రద్దయ్యింది. నవంబర్‌ 1న ఎన్నికలు నిర్వహించనున్నారు. తాజా పరిణామాలతో నఫ్తాలీ బెన్నెట్‌ ఏడాదిలోనే పదవికి దూరం కావాల్సి వచ్చింది. ఇలా ఇజ్రాయెల్‌లో నెలకొన్న రాజకీయ అస్థిరత కారణంగా గడిచిన నాలుగేళ్లలోనే ఐదుసార్లు పార్లమెంటు రద్దు చేసి ఎన్నికలు నిర్వహించాల్సి రావడం గమనార్హం.

ఇవీ చదవండి: 'సాల్మొనెల్లా' కలకలం.. ప్రపంచంలోనే అతిపెద్ద చాక్లెట్‌ ప్లాంట్‌లో ఉత్పత్తి నిలిపివేత

'కరోనా ముగియలేదు.. కొత్త రూపాల్లో దాడి.. కనిపెట్టడం కష్టమే!'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.