ETV Bharat / international

అసహనం అనర్థదాయకం.. శాంతికి విఘాతం

author img

By

Published : Jun 8, 2022, 5:59 AM IST

ఇరాక్‌, లిబియా, మలేసియా, తుర్కియే(టర్కీ)లతో పాటు ఈజిప్ట్‌లోని అరబ్‌ పార్లమెంటు నుపుర్‌ శర్మ, నవీన్‌ కుమార్‌ జిందాల్‌ చేసిన వ్యాఖ్యలపై నిరసన తెలిపాయి. అన్యమతాలను, మతాలకు చెందిన వ్యక్తులను, చిహ్నాలను అగౌరవ పరిచే చర్యలు సామరస్య వాతావరణాన్ని, ప్రజల శాంతియుత సహజీవనాన్ని ఆటంకపరుస్తాయని పేర్కొన్నాయి.

iraq-libya-reaction-on-nupur-sharma-statement
అసహనం అనర్థదాయకం.. శాంతికి విఘాతం

మహమ్మద్‌ ప్రవక్తపై భాజపా మాజీ అధికార ప్రతినిధులు నుపుర్‌ శర్మ, నవీన్‌ కుమార్‌ జిందాల్‌ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ ఇస్లామిక్‌ దేశాలన్నీ ప్రకటనలు చేస్తున్నాయి. ఇప్పటికే డజను ముస్లిం దేశాలు ఈ అంశంపై తీవ్రంగా స్పందించగా మంగళవారం ఇరాక్‌, లిబియా, మలేసియా, తుర్కియే(టర్కీ)లతో పాటు ఈజిప్ట్‌లోని అరబ్‌ పార్లమెంటు నిరసన తెలిపాయి. అన్యమతాలను, మతాలకు చెందిన వ్యక్తులను, చిహ్నాలను అగౌరవ పరిచే చర్యలు సామరస్య వాతావరణాన్ని, ప్రజల శాంతియుత సహజీవనాన్ని ఆటంకపరుస్తాయని పేర్కొన్నాయి. ‘నిందలు, అగౌరవపరచడం వంటి చర్యలకు పర్యవసానాలు చాలా తీవ్రంగా ఉంటాయి. వాటిని కట్టడి చేయకపోతే శాంతియుత సహజీవనానికి భంగంకలిగిస్తాయి. ఉద్రిక్తతలకు కారణమవుతాయ’ంటూ ఇరాక్‌ పార్లమెంటరీ కమిటీ ఒక ప్రకటన విడుదల చేసింది. ‘సహనం, సామరస్య జీవనానికి దోహదపడే విలువలను పెంపొందించుకొని హింస, విద్వేషం వంటివాటిని త్యజించాల’ని లిబియా విదేశీ వ్యవహారాల శాఖ సూచించింది. భారత్‌లో అధికార భాజపా ప్రతినిధులు చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు అరబ్‌ పార్లమెంట్‌ పేర్కొంది.

ఇరాక్‌, లిబియా, మలేసియాల ప్రకటనలపై ఆ దేశాల్లోని భారత దౌత్య అధికారులు వెంటనే స్పందించి వివరణలు ఇచ్చే ప్రయత్నం చేశారు. నుపుర్‌ శర్మ, నవీన్‌ జిందాల్‌ వ్యాఖ్యలు వారి వ్యక్తిగతమైనవేనని, వాటిని భారత ప్రభుత్వ అభిప్రాయాలు, ఆలోచనలుగా పరిగణించరాదని కోరారు. భిన్నత్వంలో ఏకత్వం కలిగి ఉండడం భారతీయ నాగరికత వారసత్వమని పేర్కొన్నారు. అన్ని మతాలకు భారత్‌లో అత్యున్నత గౌరవం లభిస్తుందని వివరించారు. అనుచిత వ్యాఖ్యల చేసిన వ్యక్తులపై ఇప్పటికే చర్యలు తీసుకున్న విషయాన్ని గుర్తుచేశారు. ఇస్లామిక్‌ దేశాలతో భారత్‌కు ఉన్న సత్సంబంధాలను దెబ్బతీయడానికి కొన్ని శక్తులు ప్రయత్నిస్తున్నాయని, వాటి కుయుక్తులు ఫలించకుండా మరింత కలిసికట్టుగా పనిచేద్దామని ఆయా దేశాలకు భారత దౌత్య వర్గాలు సూచించాయి. అనుచిత వ్యాఖ్యలు చేసిన భాజపా అధికార ప్రతినిధులను ఆ పార్టీ నుంచి సస్పెండ్‌ చేయడాన్ని మలేసియా విదేశీ వ్యవహారాల శాఖ స్వాగతించింది.

సర్వమత సహనాన్ని ప్రోత్సహిస్తాం: ఐరాస అధికార ప్రతినిధి
ప్రపంచంలోని అన్ని మతాల పట్ల సహనాన్ని, గౌరవాన్ని ఐక్యరాజ్యసమితి ప్రోత్సహిస్తుందని ఐరాస సెక్రెటరీ జనరల్‌ ఆంటోనియో గుటెర్రెస్‌ అధికార ప్రతినిధి స్టీఫెన్‌ దుజరిక్‌ తెలిపారు. పాకిస్థాన్‌కు చెందిన ఓ పాత్రికేయుడు...భాజపా మాజీ అధికార ప్రతినిధులు నుపుర్‌ శర్మ, నవీన్‌ జిందాల్‌ చేసిన వ్యాఖ్యలను ప్రస్తావించగా ఆయన ఈ విధంగా స్పందించారు.

22న ముంబయి పోలీసుల ఎదుటకు నుపుర్‌!
భాజపా మాజీ అధికార ప్రతినిధి నుపుర్‌ శర్మ, ఆమె కుటుంబానికి భద్రతను కల్పించినట్లు దిల్లీ పోలీసులు మంగళవారం వెల్లడించారు. తనను హతమార్చుతామంటూ బెదిరింపులు వస్తున్నాయన్న ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి ఈ చర్యలు తీసుకున్నట్లు పోలీసు అధికారి ఒకరు తెలిపారు. మరోవైపున...మహమ్మద్‌ ప్రవక్తపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ నుపుర్‌ శర్మపై దాఖలైన కేసుకు సంబంధించి ముంబయి పోలీసులు ఆమెకు మంగళవారం సమన్లు జారీ చేసినట్లు తెలిసింది. దీనిప్రకారం...ఈ నెల 22న ఠాణేలోని ముంబ్రా పోలీస్‌ స్టేషన్‌లో దర్యాప్తు అధికారి ఎదుట హాజరై ఆమె వాంగ్మూలం ఇవ్వాల్సి ఉంటుంది. సమన్లను, ఎఫ్‌ఐఆర్‌ వివరాలను స్పీడ్‌ పోస్ట్‌, ఈమెయిల్‌ ద్వారా నుపుర్‌ శర్మకు పంపించినట్లు పోలీసు అధికారి ఒకరు చెప్పారు. నుపుర్‌ శర్మ కొన్ని రోజుల క్రితం ఓ టీవీ ఛానల్‌ చర్చా కార్యక్రమంలో చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోను పోలీసులు సేకరించనున్నారు. వివాదాస్పద వ్యాఖ్యలున్న వీడియో క్లిప్పింగ్‌ను అందజేయాల్సిందిగా టీవీ ఛానల్‌ను అధికారులు ఆదేశించారు.

నవీన్‌ జిందాల్‌కు బెదిరింపులు
సామాజిక మాధ్యమ వేదికల ద్వారా తనకు, తన కుటుంబ సభ్యులకు బెదిరింపులు వస్తున్నాయని భాజపా దిల్లీ మీడియా విభాగం మాజీ అధ్యక్షుడు నవీన్‌కుమార్‌ జిందాల్‌ మంగళవారం తెలిపారు. దిల్లీ పోలీసుల దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లనున్నట్లు ట్వీట్‌ చేశారు. మహమ్మద్‌ ప్రవక్తపై వ్యాఖ్యలకు గాను నవీన్‌ జిందాల్‌ను పార్టీ నుంచి భాజపా బహిష్కరించిన విషయం తెలిసిందే.

నుపుర్‌ శర్మకు కంగనా రనౌత్‌ మద్దతు
మహమ్మద్‌ ప్రవక్తపై వ్యాఖ్యలతో అంతర్జాతీయ స్థాయిలో విమర్శలకు గురవుతున్న భాజపా మాజీ అధికార ప్రతినిధి నుపుర్‌ శర్మకు సినీ నటి కంగనా రనౌత్‌ మద్దతు పలికారు. అభిప్రాయాలను వెల్లడించే హక్కు ఆమెకు ఉందంటూ సామాజిక మాధ్యమ వేదిక ఇన్‌స్టాగ్రామ్‌లో పేర్కొన్నారు. నుపుర్‌ శర్మ, ఆమె కుటుంబాన్ని హతమార్చుతామంటూ బెదిరింపులు రావడాన్ని కంగనా ఖండించారు. టీవీ ఛానెల్‌ చర్చలో నుపుర్‌ చేసిన వ్యాఖ్యలతో విభేదించేవారు ఆమెకు వ్యతిరేకంగా చట్టబద్ధమైన చర్యలను ఆశ్రయించాలని సూచించారు. భౌతిక హాని తలపెట్టడం తగదని పేర్కొన్నారు. ‘ఇది అఫ్గానిస్థాన్‌ కాదు. ప్రజాస్వామ్య పద్ధతుల్లో పనిచేసే ప్రభుత్వం ఇక్కడ ఉందని మరచిపోవద్దు’ అని కంగనా పేర్కొన్నారు. నుపుర్‌ శర్మ ఫిర్యాదు మేరకు ఆమెకు, ఆమె కుటుంబానికి భద్రత కల్పించినట్లు దిల్లీ పోలీసులు వెల్లడించిన కొన్ని గంటల వ్యవధిలోనే రనౌత్‌ ఈ ప్రకటన చేశారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.