ETV Bharat / international

చైనాలో అమెరికా వృద్ధ సింహం.. జిన్​పింగ్​తో వందేళ్ల కిసింజర్ భేటీ.. అంతరార్థమేంటో?

author img

By

Published : Jul 21, 2023, 10:14 AM IST

Henry Kissinger China Visit
Henry Kissinger China Visit

Henry Kissinger China Visit : ఆయన వయసు వందేళ్లు! ఆరోగ్యంగా ఇంట్లో కూర్చోగలిగితే గొప్ప అనుకునే దశ! కానీ అలాంటి వయసులో కూడా ఆ అమెరికా పెద్దమనిషి ఖండాలు దాటుకుంటూ ఏకంగా చైనా వెళ్లారు. చైనా ప్రభుత్వంలోని పెద్దల్ని కలిసి ముచ్చట్లు మొదలు పెట్టారు! వాళ్లు కూడా ఆయనకు పెద్దపీట వేస్తున్నారు. ఒకవంక అమెరికా ప్రభుత్వమేమో చైనాతో సై అంటే సై అంటుంటే.. ఈ వృద్ధుడు మాత్రం జిన్‌పింగ్‌ సర్కారుకు స్నేహహస్తం చాస్తున్నారు. ఇంతకూ ఎవరీ వృద్ధుడు? ఏంటీ పర్యటన అంతరార్థం! తెలుసుకోవాలంటే ఈ కథనం చదవాల్సిందే.

Henry Kissinger China Visit : హెన్రీ కిసింజర్‌.. ఈ తరంలో చాలా మందికి తెలియని పేరు ఇది. అమెరికా మాజీ విదేశాంగ మంత్రి. ఆ దేశ చరిత్రలో లింకన్‌లాంటి మాజీ అధ్యక్షులకు ఉన్నంత పేరు ప్రఖ్యాతలు ఉన్న రాజకీయ శక్తి! ఇప్పటికీ చైనా ఎంతో గౌరవించే దౌత్యయుక్తి! కారణం- 1970ల్లో ప్రచ్ఛన్నయుద్ధం (కోల్డ్​వార్​) వేళ.. కమ్యూనిస్టు సోవియట్‌ యూనియన్‌కు వ్యతిరేకంగా.. మావోయిస్టు చైనాతో క్యాపిటలిస్టు అమెరికాకు స్నేహం కుదిర్చింది ఆయనే! 1971లో అమెరికా జాతీయ భద్రత సలహాదారు హోదాలో బీజింగ్‌లో పర్యటించిన కిసింజర్‌.. ఇరు దేశాల మధ్య సంబంధాలకు బీజం వేశారు.

1979లో అమెరికా, చైనా పరస్పరం గుర్తించుకొని.. దౌత్యబంధాన్ని బలోపేతం చేసుకున్నాయి. ఆ సమయంలో కిసింజర్​ వేసిన స్నేహ విత్తనమే మొలకెత్తి.. దాదాపు ఐదు దశాబ్దాల పాటు కొనసాగింది. అప్పటి భౌగోళిక, రాజకీయ, ఆర్థిక కారణాలతో ఒకటైన ఈ రెండు దేశాలు.. అవే కారణాలతో వైరి శిబిరాలుగా మారాయి. అప్పటినుంచి నడుస్తున్న చరిత్ర ఇదే! ఇప్పుడు అమెరికా, చైనా మధ్య సంబంధాలు క్షీణించి మరో ప్రచ్ఛన్నయుద్ధానికి దారితీస్తున్న వేళ.. కిసింజర్‌ మళ్లీ అలుపెరగని రాయబారం మొదలెట్టారు!

కీలక నేతలతో భేటీ..
ఎలాంటి అధికార హోదా లేని కిసింజర్‌ అనూహ్యంగా చైనాలో అడుగుపెట్టారు. చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌, రక్షణమంత్రి లి షాంగ్‌ఫు, చైనా విదేశాంగశాఖలోని ఉన్నతాధికారి వాంగ్‌ యీలతో విడివిడిగా భేటీ అయ్యారు. "చైనాకు ఆయనకు పాత మిత్రుడు. రెండు దేశాల మధ్య చరిత్రాత్మక బంధానికి ఆద్యుడు. చైనాతో విధానాల విషయంలో అమెరికాకు కిసింజర్‌ తరహా దౌత్యనీతి, నిక్సన్‌ తరహా రాజకీయ ధైర్యం అవసరం" అని కిసింజర్‌తో భేటీ అనంతరం వాంగ్‌ వ్యాఖ్యానించడం విశేషం. ఈ మాటలంటూనే.. "చైనా అభివృద్ధి వెనక బలమైన స్వదేశీ పునాది ఉంది. అలాంటి చైనాను బయటి నుంచి బలవంతంగా మార్చాలని ప్రయత్నించడం కుదరని పని. అంతే కాకుండా చైనాను చుట్టుముట్టాలని, కట్టడి చేయాలని అనుకోవడం దుస్సాహసమే అవుతుంది" అని వాంగ్‌ స్పష్టం చేశారు.

Henry Kissinger China Visit
హెన్రీ కిసింజర్​తో సమావేశమైన షీ జిన్​పింగ్

తైవాన్‌ విషయంలో అమెరికా జోక్యం చేసుకోకుండా ఉండాలని కిసింజర్‌కు ఆయన కుండబద్దలు కొట్టి చెప్పినట్లు తెలుస్తోంది. చైనా నేతలకు కిసింజర్‌ ఏం చెప్పారనేది మాత్రం బయటకురాలేదు. కిసింజర్ సైతం- "అబ్బే.. నేను చైనా మిత్రుడిగా ఇక్కడికి వచ్చానంతే" అంటూనే.. "చైనా, అమెరికా తమ మధ్య ఉన్న అపోహలను తొలగించుకోవాలి. విభేదాలు దూరం చేసుకొని కలిసి నడవాలి. అవి పరస్పరం పోరాడితే ఎలాంటి లాభం ఉండదు. వాటి మధ్య యుద్ధమే వస్తే.. పరిణామాలు దారుణంగా ఉంటాయి" అని హెచ్చరించారు.

తగ్గేదేలే అంటున్న చైనా!
అనధికార రాయబారాల్లో భాగంగానే ఆయన చైనాకు వెళ్లి ఉండొచ్చనేది విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఎందుకంటే.. రాజకీయాల నుంచి వైదొలగినా.. చైనాతో, ఆ దేశ అధికార పక్షంతో కిసింజర్‌ సంబంధాలు కొనసాగిస్తునే వస్తున్నారు. నాలుగేళ్ల క్రితం కూడా కిసింజర్​ బీజింగ్‌ వెళ్లారు. చేతికర్ర పట్టుకొని నడుస్తూ వెళ్లి అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో సమావేశమయ్యారు. డ్రాగన్​, యూఎస్​ మధ్య దౌత్యసంబంధాలు మెరుగయ్యేందుకు ఈ వృద్ధరాయబారి చేస్తున్న ప్రయత్నాలు భేష్‌ అంటూ జిన్‌పింగ్‌ కొనియాడారు కూడా.

అయితే తాజాగా అమెరికాతో సంబంధాల పునరుద్ధరణ విషయంలో చైనా గట్టిగానే పట్టుబడుతోంది. 'సమస్థాయిలో.. ఇచ్చిపుచ్చుకునేట్లయితేనే రెండు దేశాల మధ్య సమస్యలకు పరిష్కారం సాధ్యం' అని అమెరికాకు తామేమాత్రం తీసిపోయేది లేదని చెప్పకనే చెబుతోంది డ్రాగన్. మరి 52 ఏళ్ల కిందట చైనాతో దోస్తీ కుదిర్చిన కిసింజర్‌ దౌత్యనీతి ఈసారి ఎంతమేరకు పనిచేస్తుందో వేచి చూడాలి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.