'ప్రధానిగా సునాక్​ తప్ప ఇంకెవరైనా ఓకే.. అతను నాకు ద్రోహం చేశాడు'

author img

By

Published : Jul 16, 2022, 8:28 AM IST

boris

బ్రిటన్​ ప్రధాని రేసులో ఉన్న రిషి సునాక్​ను ఎన్నుకోవద్దని మద్దతుదారులకు మాజీ ప్రధాని బోరిస్​ జాన్సన్​ సూచిస్తున్నట్లు తెలుస్తోంది. విదేశాంగమంత్రి లిజ్‌ ట్రస్‌ లేదంటే జాకబ్‌ రీస్‌, డోరిస్‌, పెన్నీ మోర్డాంట్‌లలో ఎవరో ఒకరికి మద్దతివ్వాలని ఆయన సూచించినట్టు తెలిపింది.

బ్రిటన్‌ ప్రధాని ఎన్నికలో మాజీ ఆర్థిక మంత్రి రిషి సునాక్‌ను ఎలాగైనా ఓటమిపాలు చేయాలని తాత్కాలిక ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ అంతర్గతంగా ప్రచారం చేస్తున్నట్టు సమాచారం. సునాక్‌ను తప్ప.. మరెవరినైనా బలపరచండని తన వర్గం ఎంపీలకు జాన్సన్‌ సూచించినట్టు తెలుస్తోంది. తనపై అభియోగాలు రావడం, పలువురు మంత్రులు రాజీనామా చేయడంతో.. అధికార కన్జర్వేటివ్‌ పార్టీకి చెందిన జాన్సన్‌ ఈనెల 7న ప్రధాని పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. అయితే- రిషి తనకు ద్రోహం చేశారని, ఆయన కారణంగానే సొంత పార్టీ నేతలు కూడా తనకు దూరమయ్యారని బోరిస్‌ ఆగ్రహంతో ఉన్నట్టు చెబుతున్నారు. తదుపరి ప్రధానిగా ఎవరు ఉండాలన్న విషయంలో తలదూర్చబోనని, బరిలో ఉన్న ఏ అభ్యర్థినీ బలపరచనని జాన్సన్‌ బహిరంగంగా వెల్లడించినా.. సునాక్‌ ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రధాని కాకూడదంటూ తన మద్దతుదారులతో ఆయన మంతనాలు సాగిస్తున్నట్టు 'ద టైమ్స్‌' కథనం పేర్కొంది. విదేశాంగమంత్రి లిజ్‌ ట్రస్‌ లేదంటే జాకబ్‌ రీస్‌, డోరిస్‌, పెన్నీ మోర్డాంట్‌లలో ఎవరో ఒకరికి మద్దతివ్వాలని ఆయన సూచించినట్టు తెలిపింది.

వ్యక్తిగత ద్వేషంతోనే..?
10 డౌనింగ్‌ స్ట్రీట్‌ రిషిని వ్యక్తిగతంగా ద్వేషిస్తోందని, బోరిస్‌ను పదవి నుంచి తప్పించేందుకు సునాక్‌ కొన్ని నెలలుగా ప్రయత్నాలు చేసినట్టు భావిస్తోందని టైమ్స్‌ కథనం పేర్కొంది. ‘‘సునాక్‌ను ఓడించేందుకు బోరిస్‌ పట్టుదలతో ఉన్నట్టు జరుగుతున్న ప్రచారం ఉత్తదే. అయితే, రిషి తనకు ద్రోహం చేశాడన్న బాధ మాత్రం ప్రధానికి ఉంది’’ అని ఆయన సన్నిహితుడొకరు వ్యాఖ్యానించారు.

ఇదీ చూడండి : 'మనం భూమ్మీద ఉన్నదే పిల్లల్ని కనడానికి'.. ఎలాన్​ మస్క్​ తండ్రి కామెంట్స్​!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.