ETV Bharat / international

మరియుపోల్​పై రష్యా ఉక్కుపాదం.. 10 నిమిషాలకోసారి బాంబుల వర్షం

author img

By

Published : Mar 22, 2022, 11:09 PM IST

Ukraine Russia War
రష్యా ఉక్రెయిన్​ యుద్ధం

Ukraine Russia War: ఉక్రెయిన్‌ ప్రధాన నగరాలపై బాంబులు, క్షిపణులతో రష్యా విరుచుకుపడుతోంది. భీకర దాడులతో మరియుపోల్, కీవ్, ఖార్కి వ్, ఖేర్సన్‌ నగరాలపై దండెత్తుతోంది. మరియుపోల్‌లో ప్రతి పది నిమిషాలకో బాంబుదాడి జరుపుతోంది. రష్యా దండయాత్రతో ఇతర దేశాల్లోనూ కరవు పరిస్థితులు తలెత్తుతాయని జెలెన్‌స్కీ వ్యాఖ్యానించారు. మరోవైపు బ్రిటన్​ ప్రధానమంత్రి బోరిస్​ జాన్సన్​తో ప్రధాని మోదీ సంభాషించారు.

Ukraine Russia War: ఉక్రెయిన్‌ నగరాలపై బాంబులు, క్షిపణులతో విరుచుకుపడుతున్న రష్యా.. ఓడరేవు నగరం మరియుపోల్‌ను స్వాధీనం చేసుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. మరియుపోల్‌ను నలుదిశలా చుట్టుముట్టిన పుతిన్‌ బలగాలు కొత్త వ్యూహాలకు తెరలేపాయి. స్థానికులను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు మానవతా కారిడార్లు ఏర్పాటు చేస్తామని, అందుకు ఉక్రెయిన్‌ సేనలు ఆయుధాలు విడిచి, మరియుపోల్‌ను అప్పగించాలని డిమాండ్‌ చేశాయి. మరియపోల్‌ను స్వాధీనం చేసుకుని వ్యూహాత్మకంగా ఉక్రెయిన్‌ను దెబ్బకొట్టాలని పుతిన్‌ బలగాలు వ్యూహాలు రచిస్తున్నాయి. ఈ డిమాండ్‌ను జెలెన్‌స్కీ బలగాలు తోసిపుచ్చడం వల్ల రెచ్చిపోయిన పుతిన్‌ సేనలు.. మరియుపోల్‌లో ప్రతి 10 నిమిషాలకోసారి బాంబుల వర్షం కురిపించింది.

ఉక్రెయిన్‌లో ఇప్పటివరకు రష్యా జరిపిన దాడుల్లో 651 నివాస భవనాలు పూర్తిగా ధ్వంసం కాగా.. 3,780 భవంతులు పాక్షికంగా దెబ్బతిన్నాయని ఉక్రెయిన్‌ స్టేట్‌ ఎమర్జెన్సీ ప్రకటించింది. రష్యా దండయాత్రతో కొన్నిదేశాల్లో భయంకరమైన కరవు పరిస్థితులు తలెత్తుతాయని జెలెన్‌స్కీ హెచ్చరించారు. అతిపెద్ద ఆహార ధాన్యాల ఎగుమతుల దేశాల్లో ఉక్రెయిన్‌ ఒకటిగా ఉందన్న జెలెన్‌స్కీ.. రష్యా దాడులతో తాము ఎలా వ్యవసాయం చేస్తామని ప్రశ్నించారు.

2,389 మంది పిల్లలు దూరం

మరియుపోల్‌తో పాటు కీవ్‌, ఖార్కివ్‌, సుమీ, చెర్నిహివ్‌, జపోరిజ్జియాలపైనా.. రష్యా దాడుల తీవ్రతను మరింత పెంచింది. కీవ్‌లో భారీగా బాంబుదాడులు జరిగే అవకాశం ఉండటం వల్ల కర్ఫ్యూ విధించారు. రాజధాని కీవ్‌కు శివారు మక్రీవ్‌ ప్రాంతం రష్యా దళాల అదుపులో ఉండగా.. తిరిగి తమ అధీనంలోకి తీసుకున్నట్లు ఉక్రెయిన్‌ సైన్యం తెలిపింది. డాన్‌బాస్ ప్రాంతంలోని వేలాది మంది పిల్లలను రష్యాకు బలవంతంగా తరలించిందని ఉక్రెయిన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ఆరోపించింది. ఒకే రోజు 2,389 మంది పిల్లలను వారి తల్లిదండ్రులకు దూరం చేశారని తెలిపింది. రష్యా ప్రధాన లక్ష్యం రాజధాని కీవ్‌ను చేజిక్కించుకోవడమేనని ఉక్రెయిన్‌ అధ‌్యక్షుడి సలహాదారు ఒలెక్సీ అరెస్టోవిచ్ తెలిపారు. దానికి వారు ప్రయత్నిస్తే అది రష్యాకు ఆత్మహత్యా సదృశ్యమేనని వ్యాఖ్యానించారు. రష్యా-ఉక్రెయిన్ మధ్య ప్రత్యక్ష యుద్ధం 2,3 వారాల్లో ముగుస్తుందని ఒలెక్సీ పేర్కొన్నారు.

35 లక్షల మంది వలస

ఖేర్సన్‌ ప్రజలకు మానవతాసాయం అందకుండా రష్యా అడ్డుకుంటోందని ఉక్రెయిన్‌ ఉపప్రధాని తెలిపారు. రష్యా దండయాత్రతో 35 లక్షల మంది ఉక్రెయిన్‌ విడిచి వలస వెళ్లారని ఐక్యరాజ్యసమితి శరణార్థుల సంస్థ వెల్లడించింది. రష్యా దాడి తర్వాత ఉక్రెయిన్‌ను వీడిన వారి సంఖ్య త్వరలో కోటికి చేరనుందని.. జర్మనీ అంచనా వేసింది. ఏడు మానవతా కారిడార్‌ల ద్వారా.. సోమవారం 8,057 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. పోలాండ్‌కు వలస వెళ్లిన 5 లక్షల మందికి మానసిక రుగ్మతల నుంచి సహాయం అవసరమని ఆ దేశంలోని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. అందులో 30 వేల మంది తీవ్ర మానసిక ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లు వెల్లడించింది. ఇటు రష్యాను ఒంటరి చేసే చర్యలను పశ్చిమ దేశాలు ముమ్మరం చేశాయి. ప్రపంచ ఆర్థిక, వాణిజ్య రంగాల్లో రష్యాపై ఆంక్షలు తీవ్రం చేసే చర్యలను యూరోపియన్‌ యూనియన్‌ పరిశీలిస్తోంది.

రష్యా ఉక్రెయిన్ మధ్య చర్చల్లో పురోగతి కనిపిస్తున్నప్పటికీ.. ఇరు దేశాల మధ్య చాలా పెద్ద అంతరాలు ఉన్నాయని ఇజ్రాయెల్ ప్రధాని నఫ్తాలీ బెన్నెట్ తెలిపారు. రెండు దేశాల మధ్య మధ్యవర్తిగా వ్యవహరించిన బెన్నెట్ రష్యా ఉక్రెయిన్‌ మధ్య అంతరాన్ని తగ్గించే ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు. ఉక్రెయిన్‌కు సైనిక సహకారం అందిస్తామని ఇటలీ ప్రధానమంత్రి మారియో డ్రాగి స్పష్టం చేశారు. ఇటు ఉక్రెయిన్‌ అంశంపై చర్చించేందుకు ఐక్యరాజ్య సమితి అత్యవసర ప్రత్యేక సెషన్‌ బుధవారం ప్రారంభం కానుంది.

బోరిస్​కు మోదీ ఫోన్​

ఉక్రెయిన్​లో నెలకొన్న పరిస్థితులపై బ్రిటన్​ ప్రధాని బోరిస్​ జాన్సన్​.. ప్రధాని నరేంద్ర మోదీ చర్చించుకున్నారు. ఇరు దేశాలు విభేదాలను పక్కనపెట్టి సామరస్యంగా చర్చింకోవడమే ఉత్తమమని ప్రధాని మోదీ ఉద్ఘాటించారు. దీంతో పాటు ఇరు దేశాల మధ్య దౌత్యసంబంధాలపై చర్చించారు. సాంకేతికం, పెట్టుబడులు, రక్షణ, వ్యాపార రంగాలకు సంబంధించి చర్చ జరిగినట్లు ప్రధాన మంత్రి కార్యాలయం వెల్లడించింది.

ఇదీ చూడండి : చైనా విమాన ప్రమాదంలో మొత్తం 132 మంది మృతి!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.