ETV Bharat / international

ఉక్రెయిన్​లో ఆగని మారణహోమం.. చర్చలతో ఈసారైనా..

author img

By

Published : Mar 18, 2022, 6:30 AM IST

Ukraine Russia war: ఉక్రెయిన్​పై భీకర దాడులతో రష్యా విరుచుకుపడుతోంది. ఖర్కివ్‌కు సమీపంలోని మెరెఫాలో పాఠశాల భవనాన్ని, సామాజిక కేంద్రాన్ని రష్యా సేనలు ధ్వంసం చేసిన ఘటనలో 21 మంది ప్రాణాలు కోల్పోయారు. నివాసిత ప్రాంతాలపై కూడా దాడులు జరుపుతోంది. మరోవైపు ఇప్పటివరకు జరిపిన చర్చల్లో పురోగతి లేదు. ఈ నేపథ్యంలో శుక్రవారం జరగనున్న మరో విడత చర్చలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఈ చర్చల్లోనైనా పురోగతి దక్కి రష్యా దాడుల నుంచి తమకు విముక్తి కలగాలని ఉక్రెయిన్​ ఆశిస్తోంది.

Ukraine Russia war
ఉక్రెయిన్​పై రష్యా దాడి

Ukraine Russia war: చర్చల ద్వారా యుద్ధానికి తెరపడుతుందని ఉక్రెయిన్‌ ఒకపక్క ఆశాభావంతో ఉంటే మరోపక్క రష్యా గురువారం యథావిధిగా ముప్పేట దాడులు కొనసాగించింది. బుధవారం రాత్రి మేరియుపొల్‌లో గగనతల దాడిలో దెబ్బతిన్న మూడంతస్తుల డ్రామా థియేటర్‌ శిథిలాల కింద పలువురు చిక్కుకుపోయారు. దిగువ అంతస్తులో తలదాచుకున్న అనేకమందిలో కొంతమంది సురక్షితంగా బయటపడగా మిగిలిన వారిని రక్షించే చర్యలపై అధికార వర్గాలు చర్యలు చేపట్టాయి. ఇదే నగరంలో ఈతకొలను సముదాయంలో మహిళలు, పిల్లలు సహా పలువురు తలదాచుకోగా దానిపైనా రష్యా దాడి చేసింది. థియేటర్‌పై గానీ, ఈ నగరంలోని వేరేచోట గానీ తాము బాంబుదాడి చేయనేలేదని రష్యా ఖండించింది.

బాంబుల వర్షం

యుద్ధం మొదలయ్యాక రష్యా గుప్పిట్లోకి వెళ్లిన ఖేర్సన్‌ విమానాశ్రయాన్ని ఉక్రెయిన్‌ సైనికులు తిరిగి స్వాధీనం చేసుకున్నారు. కీవ్‌ శివార్లలోని మరిన్ని ప్రాంతాల్లోనూ జనావాసాలపై రష్యా సైనికులు బాంబుల వర్షం కురిపించారు. రష్యా రాకెట్‌ను ఉక్రెయిన్‌ కూల్చివేయగా దాని శకలాలు పడి 16 అంతస్తుల భవంతికి నిప్పంటుకుంది. ఖర్కివ్‌కు సమీపంలోని మెరెఫాలో పాఠశాల భవనాన్ని, సామాజిక కేంద్రాన్ని కూడా రష్యా సేనలు ధ్వంసం చేశాయి. ఈ ఘటనలో 21 మంది మృతి చెందారు. మరో వసతి గృహంపై జరిగిన దాడిలో మూడేళ్ల కవలలు, వారి తల్లిదండ్రులు ప్రాణాలు కోల్పోయారు. చనిపోయినవారిలో 22 రోజుల పసికందు ఉండడం వైద్యుల్ని కదిలించింది. "ఉక్రెయిన్‌లో సున్నితమైన పరిస్థితుల్లో ఉన్న పౌరుల రక్షణ"కు ఐరాస భద్రత మండలిలో రష్యా ప్రవేశపెట్టిన తీర్మానంపై శుక్రవారం ఓటింగు జరిగే అవకాశం ఉంది. నాటో సభ్య దేశమైన పోలండ్‌కు 'క్షిపణి నిరోధక వ్యవస్థ'ను పంపించాలని బ్రిటన్‌ నిర్ణయించింది.

Ukraine Russia war
చెర్నిహివ్​ నగరంలో చెల్లా చెదురుగా మృతదేహాలు

జెలెన్‌స్కీ ఉన్నచోటకు చేరువగా దాడి

జర్మనీ చట్టసభ సభ్యులనుద్దేశించి ఉక్రెయిన్‌ అధ్యక్షుడు వొలొదిమిర్‌ జెలెన్‌స్కీ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మాట్లాడారు. యుద్ధంలో 108 మంది చిన్నారులు సహా వేలమంది ఉక్రెయిన్‌ ప్రజలు ప్రాణాలు కోల్పోయారనీ చెప్పారు. జెలెన్‌స్కీ ప్రసంగిస్తున్న ప్రాంతానికి సమీపంలోనే రష్యా దాడులు జరగడంతో ఈ కార్యక్రమం కొంత ఆలస్యంగా ప్రారంభమైంది. జర్మనీకి తమకంటే సహజవాయువు పైపులైనే ముఖ్యమైపోయిందని నిష్ఠూరమాడారు. నాటో, ఈయూ దేశాలు తమకు మద్దతివ్వాలని కోరారు.

కఠిన ఆంక్షలపై పుతిన్‌ పరోక్ష సంకేతాలు

రష్యాను నాశనం చేసేలా పౌరుల్లో అశాంతి రేకెత్తించడానికి పశ్చిమ దేశాలు ప్రయత్నిస్తున్నాయని రష్యా అధ్యక్షుడు పుతిన్‌ ఆరోపించారు. వార్తాసంస్థలు, నిరసనకారులపై తాను విధించిన ఆంక్షలు మరింత కఠినతరం అవుతాయనే పరోక్ష సంకేతాలు వెలువరించారు. పుతిన్‌ను యుద్ధ నేరస్థునిగా అమెరికా అధ్యక్షుడు బైడెన్‌ అభివర్ణించడాన్ని రష్యా ఖండించింది. ఒక దేశాధినేతగా బైడెన్‌ చేసిన వ్యాఖ్యలు క్షమార్హం కానివని పేర్కొంది.

పుతిన్‌-జెలెన్‌స్కీ మాట్లాడుకుంటే అది సాధ్యమే

ఉక్రెయిన్‌కు తటస్థ సైనిక హోదా ఇచ్చే విషయమై ఉభయపక్షాలూ తీవ్రంగా చర్చించుకున్నట్లు రష్యా విదేశాంగ మంత్రి సెర్గే లవ్రోవ్‌ చెప్పారు. ఉక్రెయిన్‌ను ఎప్పటికీ తమ కూటమిలోకి చేర్చుకోబోమని నాటో ప్రతిజ్ఞ చేయాలని రష్యా డిమాండ్‌ చేస్తోంది. దాడుల విరమణ, వివిధ దేశాల నుంచి ఉక్రెయిన్‌కు భద్రతపై హామీని తాము కోరినట్లు జెలెన్‌స్కీ సలహాదారుడు పొదల్యాక్‌ తెలిపారు. పుతిన్‌, జెలెన్‌స్కీ నేరుగా మాట్లాడుకుంటే అది సాధ్యమేనని చెప్పారు. రెండు దేశాల మధ్య శుక్రవారం చర్చలు కొనసాగుతాయి.

ఐసీజేలో రష్యాకు వ్యతిరేకంగా ఓటేసిన భారత జడ్జి

ఉక్రెయిన్‌పై రష్యా దండయాత్రకు వ్యతిరేకంగా తీర్పు వెలువరించిన అంతర్జాతీయ న్యాయస్థానం (ఐసీజే) ధర్మాసనంలో ఉన్న భారత న్యాయమూర్తి జస్టిస్‌ దల్వీర్‌ భండారీ రష్యాకు వ్యతిరేకంగా ఓటు వేశారు. అది న్యాయమూర్తిగా ఆయన వ్యక్తిగత స్థాయిలో తీసుకున్న నిర్ణయమని, దానిపై వ్యాఖ్యానించలేమని భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ స్పష్టంచేసింది. 15 మందిలో ఇద్దరు (చైనా, రష్యా) న్యాయమూర్తులు ఉక్రెయిన్‌ పిటిషన్‌ను వ్యతిరేకించారు. భద్రతా మండలికి వెళ్లినా ఈ తీర్పు అమలు ప్రశ్నార్థకమేనని న్యాయనిపుణులు పేర్కొంటున్నారు. ఐసీజే తీర్పును అమెరికా స్వాగతించింది.

ఇదీ చూడండి: 'పుతిన్ యుద్ధ నేరస్థుడు.. భారీ మూల్యం చెల్లించక తప్పదు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.