ETV Bharat / international

'మరో చెర్నోబిల్​ అణువిపత్తుకు.. రష్యా ప్రయత్నం'

author img

By

Published : Mar 4, 2022, 1:07 PM IST

Ukraine Nuclear Plant Fire
రష్యా

Ukraine Nuclear Plant Fire: ఉక్రెయిన్​లో అణు విద్యుత్​ కేంద్రంపై రష్యా దాడి చేపట్టడాన్ని ప్రపంచ దేశాలు ఖండించాయి. రష్యా వైఖరిపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, బ్రిటన్​ ప్రధాని బోరిస్​ జాన్సన్​ తప్పుపట్టారు. చెర్నోబిల్‌ అణువిపత్తును పునరావృతం చేసేందుకు రష్యా ప్రయత్నిస్తోందన్నారు ఉక్రెయిన్​ అధ్యక్షుడు వొలొదిమిర్​ జెలెన్​స్కీ.

Ukraine Nuclear Plant Fire: ఉక్రెయిన్‌ను తన గప్పిట్లోకి తెచ్చుకునేందుకు రష్యా ఎంతటి తీవ్ర చర్యకైనా వెనుకాడటం లేదు. ఐరోపా ఖండంలోని అతిపెద్ద అణు రియాక్టర్ అయిన జాపోరిషియాపై ఈ తెల్లవారుజామున రష్యా దళాలు దాడి చేయడం అందుకు నిదర్శనం. ఈ అణు కేంద్రంలో పేలుడు సంభవిస్తే.. అది ఐరోపాకు ముగింపు అవుతుందని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోపక్క పుతిన్ మాత్రం దూకుడుగా ముందుకు వెళ్తున్నారు. తాము ప్రారంభించిన ప్రత్యేక సైనిక చర్యను విజయవంతంగా ముందుకు తీసుకెళ్తున్నామని ఇదివరకే వ్యాఖ్యలు చేశారు. కాగా, ఉక్రెయిన్‌ను లొంగదీసుకునే క్రమంలో రష్యా అణు పదార్థాలతో చెలగాటం ఆడటాన్ని ప్రపంచదేశాలు ముక్తకంఠంతో ఖండిస్తున్నాయి.

"రష్యా తప్ప ఏ ఇతర దేశం అణు విద్యుత్ కేంద్రాలపై దాడి జరపలేదు. ఇది మానవ చరిత్రలోనే మొదటిసారి. ఉగ్రవాద ధోరణి అనుసరిస్తోన్న ఆ దేశం.. ఇప్పుడు అణు బీభత్సానికీ ఒడిగట్టింది. చెర్నోబిల్‌ అణువిపత్తును పునరావృతం చేసేందుకు మాస్కో ప్రయత్నిస్తోంది."

- వొలొదిమిర్​ జెలెన్‌స్కీ, ఉక్రెయిన్​ అధ్యక్షుడు

"ఈ ప్రాంతంలో రష్యా వెంటనే సైనిక కార్యకలాపాలు నిలిపివేయాలి. అగ్నిమాపక సిబ్బంది, ఇతర అత్యవసర సేవల సిబ్బంది అక్కడికి చేరుకునేలా రష్యా అనుమతించాలి."

-జో బైడెన్‌, అమెరికా అధ్యక్షుడు

"అణు కేంద్రంపై దాడి గురించి నేను ఇప్పుడే ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీతో మాట్లాడాను. రష్యా అధ్యక్షుడు పుతిన్ లెక్కలేనితనం ఐరోపా భద్రతకు ముప్పుగా పరిణమిస్తోంది. రష్యా తక్షణమే పవర్ స్టేషన్‌పై దాడి నిలిపివేయాలి. ఆ రియాక్టర్‌ను సురక్షితంగా ఉంచేందుకు తగిన చర్యలు చేపట్టేలా వీలు కల్పించాలి."

-బోరిస్ జాన్సన్, బ్రిటన్ ప్రధాని

"అణు కేంద్రంపై జరిగిన భయంకరమైన దాడుల గురించి నేను జెలెన్‌స్కీతో మాట్లాడాను. ఏమాత్రం ఆమోదయోగ్యం కానీ ఈ దాడుల్ని రష్యా వెంటనే నిలిపివేయాలి."

-జస్టిన్ ట్రుడో, కెనడా ప్రధాని

ప్రస్తుతం అక్కడ ఎలాంటి రేడియేషన్ నమోదుకాలేదని యూఎస్‌ ఎనర్జీ సెక్రటరీ వెల్లడించారు. అలాగే ఎమర్జెన్సీ పరికరాలు ప్రభావితం కాలేదని స్థానిక అధికారులు వెల్లడించారు. అయితే రష్యా తర్వాత ఎలాంటి ప్రణాళికతో ముందుకెళ్తుందోనని వారు ఆందోళన వ్యక్తం చేశారు.

ఇదీ చూడండి : అతిపెద్ద అణు విద్యుత్తు కేంద్రంపై రష్యా దాడి.. ఐఏఈఏ ఆందోళన

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.