ETV Bharat / international

ఆక్షన్​ థియరీ మెరుగుపరిచిన వారికి 'ఆర్థిక' నోబెల్​

author img

By

Published : Oct 12, 2020, 3:28 PM IST

Updated : Oct 13, 2020, 6:51 AM IST

The 2020 Sverige Riksband Prize in Economic sciences has been awarded to Paul R. Milgrom and Robert B. Wilson
ఆక్షన్​ థియరీని కొనుగొన్న వారికి 'ఆర్థిక' నోబెల్​

ఆక్షన్​ థియరీని మెరుగుపరిచి.. నూతన ఆక్షన్​ ఫార్మాట్​ను కనుగొన్న పాల్​ ఆర్​. మిల్​గ్రోమ్​, రాబర్ట్​ బీ విల్సన్​ను ఆర్థిక శాస్త్రంలో నోబెల్​ బహుమతి వరించింది. వీరికి బంగారు పతకంతో పాటు 1.1 మిలియన్​ డాలర్ల నగదు బహుమతి దక్కనుంది.

ఆర్థిక శాస్త్రం నోబెల్‌ బహుమతులు కూడా అమెరికాను వరించాయి. కాలిఫోర్నియాలోని స్టాన్‌ఫర్డ్‌ విశ్వవిద్యాలయానికి చెందిన ప్రముఖ ఆర్థిక శాస్త్రవేత్తలు రాబర్ట్‌ బి విల్సన్‌ (83), పౌల్‌ ఆర్‌ మిల్‌గ్రోం (72)లకు ఈ ఏడాది ఆర్థిక శాస్త్రంలో నోబెల్‌ పురస్కారం లభించింది. ఈ విషయాన్ని సోమవారం రాయల్‌ స్వీడిష్‌ అకాడమీ ఆఫ్‌ సైన్సెస్‌ సెక్రటరీ జనరల్‌ గోరన్‌ హాన్‌సన్‌ ఇక్కడ ప్రకటించారు. వేలం సిద్ధాంతా(ఆక్షన్‌ థియరీ)న్ని మరింతగా అభివృద్ధి చేయడం, కొత్త తరహా వేలం పద్ధతులు(ఆక్షన్‌ ఫార్మాట్స్‌) కనిపెట్టినందుకు ఈ పురస్కారాన్ని ఇస్తున్నట్టు తెలిపారు. ఈ అవార్డు కింద 10 మిలియన్‌ క్రోనాలు (1.1 మిలియన్‌ డాలర్లు/ సుమారు రూ.8 కోట్లు) నగదు బహుమతి, బంగారు పతకం బహూకరిస్తారు. వీరిద్దరూ గురు శిష్యుల్లాంటివారు. మిల్‌గ్రోం పీహెచ్‌డీ చేస్తున్నప్పుడు విల్స్‌న్‌ ఆయనకు అడ్వైజర్‌గా వ్యవహరించారు. ఇద్దరూ ఒకే వీధిలో ఎదురెదురుగా ఉంటారు. ఈ ఏడాది మొత్తం 11 మందికి నోబెల్‌ పురస్కారాలు రాగా అందులో ఏడుగురు అమెరికా వాసులు కావడం గమనార్హం.

వేలంలో నెగ్గినట్టు ఉంది

''వేలంలో గెలిచినట్టు అనిపించింది. పురస్కారం కింద వచ్చే సొమ్మును భార్యా పిల్లల కోసం పొదుపు చేస్తాను.''

-రాబర్ట్‌ విల్సన్‌

సామాజిక ప్రయోజనం కోసమే ఈ పరిశోధన..

ప్రకృతి వనరులకు ప్రయివేటు సంస్థలకు అప్పగించే సమయంలో ప్రభుత్వాలు వాటిని వేలం వేస్తుంటాయి. సెల్‌ఫోన్లు పనిచేయడానికి ఉపయోగపడే రేడియా ఫ్రీక్వెన్సీలు, సముద్రంలో చేపలు పట్టే ప్రదేశాలు, విమానాలు దిగే స్థలాలు, ఇతర ప్రకృతి వనరుల విషయంలో దీన్ని పాటిస్తుంటాయి. వీటిలో నెగ్గాలంటే సంప్రదాయ వేలం పాట విధానాలు పనికిరావు. వాటిపై ఏ మేరకు పెట్టుబడి పెట్టాలన్న దానిపై శాస్త్రీయంగా అధ్యయనం చేయాల్సి ఉంటుంది. వేలం సిద్ధాంతం(ఆక్షన్‌ థియరీ) ఆధారంగా అంచనాలు వేస్తారు. ఇందులో మూడు అంశాలను పరిగణనలోకి తీసుకుంటారు. ఒకటి...వేలం నిబంధనలు ఏమిటి? ఇది బహిరంగమా, రహస్యమా? ఎన్నిసార్లు వేలంలో పాల్గొనవచ్చు? విజేత, రెండో స్థానంలో ఉండడానికి ఎంత పెట్టాల్సి ఉంటుంది? రెండోది...వేలం పెట్టే వస్తువ విలువను ఒక్కొక్కరు ఎలా అంచనా వేస్తారు? అందరూ ఒకేలా చూస్తారా, లేదంటే తేడాలా ఉంటాయా? మూడోది.. అనిశ్చిత పరిస్థితులు ఎలా ఉంటాయి? వేలానికి వచ్చిన వారి దగ్గర ఇందుకు ఉన్న సమాచారం ఏమిటి?.. దీని ఆధారంగానే ఎంత పెట్టవచ్చు అన్నదానిపై ఆయా వేలంపాటదార్లు తుది విలువను నిర్ణయించుకుంటారు. ఈ విషయమై ఇప్పటికే ఉన్న సిద్ధాంతాలు, నమూనాలను వీరు విస్తృత పరిచారు. గరిష్ఠ ఆదాయం పొందడానికి కాకుండా, అధిక సామాజిక ప్రయోజనం కలిగేలా నమూనాలను రూపొందించారు. 1994లో రేడియో ఫ్రీక్వెన్సీలు వేలం వేసినప్పుడు అమెరికా ప్రభుత్వం ఈ సూత్రాలనే అమలు చేసింది. ఆ తరువాత వివిధ దేశాలు కూడా వీటినే పాటిస్తున్నాయి. ఆన్‌లైన్‌ ప్రకటనలో విషయంలో గూగుల్‌ దీన్నే అనుసరిస్తోంది. ప్రపంచం మొత్తం మీద అమ్మకందార్లు, కొనుగోలుదార్లు, పన్ను చెల్లింపుదార్లకు మేలు కలిగించాయని స్వీడిష్‌ అకాడమీ ప్రశంసించింది.

తలుపుకొట్టి చెప్పిన గురువు

''సహ విజేత విల్సన్‌ మా ఇంటికి వచ్చి తలుపుకొట్టారు. తెరిచి చూస్తే ఈ విషయం చెప్పారు. చాలా తీపి కబురు. నోబెల్‌ కమిటీ గౌరవం, అభిమానం పొందినందుకు సంతోషంగా ఉంది.''

-పౌల్‌ మిల్‌గ్రోం

విలువ ఎలా కనుక్కుంటారు?

పాటదార్లు తొలుత వేలంపాటకు సంబంధించిన నిబంధనలు, చివరి ధరను అంచనా వేసి వేలం నమూనా(ఆక్షన్‌ ఫార్మాట్‌)ను రూపొందించుకోవాలి. ఇది సంక్ష్లిష్టమైన వ్యవహారం. ఎందుకంటే ఎదుటివారి వ్యూహం ఏమిటన్నది తెలియదు. వారు కూడా అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగానే ఎత్తుగడలను రూపొందించుకుంటాయి. వీటిని అంచనా వేయడానికి వేలం సిద్ధాంతం (ఆక్షన్‌ థియరీ)లోని సూత్రాలు ఉపకరిస్తాయి. చివరి ధర ఎంత పెట్టవచ్చు అనే విషయమై తొలుత... ఆ వస్తువు ‘సమాన విలువ’(కామన్‌ వ్యాల్యూ) కనుక్కోవాలి. దాదాపుగా ఇది వేలంలో పాల్గొనే వారందరికీ ఒకేలా ఉంటుంది. ఆ వస్తువు విలువ ఏంటి? భవిష్యత్తు ఎలా ఉంటుందనేదీ పరిగణనలోకి తీసుకొని వేలంలో చెప్పాల్సిన ధరను నిర్ణయించుకోవాల్సి ఉంది. హేతుబద్ధంగా ఆలోచించేవారు ఈ ‘కామన్‌ వ్యాల్యూ’కు తక్కువగా తమ వేలం ధర ఉండేలా చూసుకుంటారు. కామన్‌ వాల్యూను కనుక్కోవడం వేలం పాటదారుల నైపుణ్యంపై ఆధారపడి ఉంటుంది. లేకుంటే అది ‘విజేత శాపం’ (విన్నర్స్‌ కర్స్‌) అవుతుంది. ఎక్కువ మొత్తాన్ని చెల్లించి, అధికంగా నష్టపోవాల్సి ఉంటుంది. దీనికి భయపడే సక్రమంగా అంచనాలు వేసుకున్నవారు కూడా తాము అనుకున్నదానికన్నా కొంచం తక్కువ మొత్తానికే బిడ్‌ వేస్తారు. వీటన్నింటినీ లెక్క వేసుకొని సరయిన ఫార్మాట్‌ రూపొందించుకోవడమే విల్సన్‌ పరిశోధన సారాంశం.

పక్కవారి అంచనాలు ఎలా ఉంటాయి?

పాల్‌ మిల్‌గ్రోం తన పరిశోధనలో కామన్‌ వ్యాల్యూతో పాటు, ఆయా పాటదార్లు వ్యక్తిగతంగా నిర్ణయించుకొనే ధరలు ఆధారంగా విశ్లేషణ జరిపారు. ఈ ధరలకు ‘ప్రయివేటు వ్యాల్యూ’ అంటారు. ఇది ఒక్కొక్కరికి ఒక్కో విధంగా ఉంటుంది. వీటిని సరిగ్గా అంచనా వేయగలిగితే అమ్మకందార్లకు ప్రయోజనకరంగా ఉంటుంది. వేలంపాటదార్లు వివిధ సందర్భాల్లో ఎలా వ్యవహరించారన్నదానిపై అధ్యయనం చేసి దీన్ని గణిస్తారు. దీని ఆధారంగా వేలంపాటదార్లు కూడా ప్రత్యర్థి అంచనాలు ఎలా ఉన్నాయని లెక్కకట్టే వీలుంది. దీనిపై ఆయన కొత్త సిద్ధాంతాన్నే రూపొందించారు.

ఇనీ చూడండి:-

Last Updated :Oct 13, 2020, 6:51 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.