ETV Bharat / international

ఏడేళ్లలో 17 రెట్లు పెరిగిన సౌర విద్యుత్​ సామర్థ్యం

author img

By

Published : Nov 8, 2021, 9:23 AM IST

గత ఏడేళ్లలో సౌర విద్యుత్​ సామర్థ్యాన్ని (solar power capacity in india) గణనీయంగా పెంచామని గ్లాస్గోలో కాప్‌-26 శిఖరాగ్ర సదస్సులో భారత్​ తెలిపింది. 17 రెట్లు పెరిగి 45 గిగావాట్లకు చేరుకుందని వెల్లడించింది. వాయు ఉద్గారాలను తగ్గించడంలోనూ విశేషంగా కృషి చేస్తున్నట్లు పేర్కొంది.

solar power capacity in india
ఇండియాలో సోలార్ పవర్

సౌర విద్యుత్​ సామర్థ్యం గత ఏడేళ్లలో 17 రెట్లు పెరిగి 45 గిగావాట్లకు చేరుకుందని (solar power capacity in india) భారత్‌ వెల్లడించింది. ప్రపంచ జనాభాలో 17% మందికి భారత్‌ ప్రాతినిధ్యం వహిస్తున్నప్పటికీ వాయు ఉద్గారాల్లో తమ వాటా నాలుగు శాతమేనని తెలిపింది. ఈ మేరకు పర్యావరణ మంత్రిత్వ శాఖ సలహాదారుడు, శాస్త్రవేత్త జె.ఆర్‌.భట్‌ ఆదివారం గ్లాస్గోలో కాప్‌-26 శిఖరాగ్ర సదస్సులో (cop 26 summit) ఒక ప్రకటన చేశారు. 2015-14 మధ్య ఉద్గారాల తీవ్రతను 24 శాతం మేర తగ్గించామనీ, ప్రస్తుతం వార్షిక గ్రీన్‌హౌస్‌ ఉద్గారాలు ఐదు శాతం మాత్రమే ఉన్నాయని చెప్పారు. వాతావరణ మార్పుల విషయంలో భారత్‌ చేస్తున్న ప్రయత్నాలను వివిధ పక్షాలు అభినందించాయి. వాతావరణ మార్పుల వల్ల వర్ధమాన దేశాలకు ముప్పు ఎక్కువగా ఉంటోందనీ, దీనిని అడ్డుకోవాలంటే అంతర్జాతీయ సహకారం మరింత పెరగాలని భారత్‌ పేర్కొంది. ప్రజా భాగస్వామ్యంతో అడవుల విస్తీర్ణాన్ని, మడ అడవుల్ని పెంచగలిగినట్లు తెలిపింది. సింహాలు, ఏనుగులు, ఖడ్గమృగాల సంఖ్య కూడా ఐదారేళ్లలో పెరిగిందని వివరించింది.

భారత్​-బ్రిటన్‌ ప్రతిపాదనలకు అమెరికా మద్దతు

భారత్‌-బ్రిటన్‌ నేతృత్వంలోని హరిత గ్రిడ్లలో భాగస్వామ్యం తీసుకోవడం ద్వారా అండగా నిలవాలని అమెరికా నిర్ణయించింది.'ఒకే సూర్యుడు- ఒకే ప్రపంచం- ఒకే గ్రిడ్‌' కింద తాము భాగస్వాములమవుతామని అమెరికా ఇంధన శాఖ మంత్రి జెన్నిఫర్‌ గ్రాన్‌హోమ్‌ తెలిపారు. మొత్తం మానవాళి ఒక ఏడాదిలో వాడే విద్యుత్తు సూర్యుని నుంచి భూమ్మీదికి ఒక గంటలో వచ్చే సూర్యరశ్మికి సమానమని చెప్పారు. తదుపరి తరం సౌర ఫలకాలు, సాంకేతికతలను అందరికీ అందుబాటులోకి తీసుకురావడంపై దృష్టి సారించినట్లు ఆమె వివరించారు.

సుస్థిర వ్యవసాయ కార్యాచరణపై భారత్​ సంతకం

సుస్థిర వ్యవసాయ కార్యాచరణపై భారత్‌ సహా 27 దేశాలు సంతకాలు చేయనున్నాయి. ఈ రంగం ద్వారా కాలుష్యం తక్కువ వెలువడేలా చూస్తామని భారత్‌ ప్రతినబూనింది.

ఇదీ చదవండి:గాలిలో ప్రమాదకర రసాయనాలు-ఓజోన్‌ పొరకు తూట్లు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.