ETV Bharat / international

రష్యా చేతికి ఉక్రెయిన్​ ఎయిర్​పోర్ట్​- 1000 మంది సైనికులు మృతి

author img

By

Published : Feb 25, 2022, 7:08 PM IST

Russia-Ukraine conflict: ఉక్రెయిన్​కు చెందిన కీలక విమానాశ్రయం తమ అధీనంలోకి వచ్చినట్లు ప్రకటించింది రష్యా. దీంతో కీవ్​ నగర శివార్లలో ఉన్న బలగాల్ని రాజధానికి తరలించడం రష్యాకు మరింత సులువు కానుంది. మరోవైపు.. ఇప్పటి వరకు 1000 మంది రష్యా సైనికులు మరణించినట్లు ఉక్రెయిన్​ ప్రకటించింది.

Russian military
రష్యా అధీనంలోకి ఉక్రెయిన్​ ఎయిర్​పోర్ట్

Russia-Ukraine conflict: ఉక్రెయిన్ రాజధాని కీవ్​కు సమీపంలోని కీలకమైన విమానాశ్రయాన్ని హస్తగతం చేసుకున్నట్లు రష్యా సైన్యం ప్రకటించింది. దీంతో పశ్చిమ దేశాలతో కీవ్​ను దూరం చేసినట్లు తెలిపింది.

హోస్టోమెల్​లో అతిపెద్ద రన్​వేతో కూడిన ఈ ఎయిర్​పోర్ట్​కు భారీ రవాణా విమానాలు వచ్చే అవకాశముంది. ఫలితంగా కీవ్​ నగర శివార్లలో ఉన్న బలగాల్ని రాజధానికి తరలించడం రష్యాకు మరింత సులువు కానుంది. కీవ్​కు వాయవ్య ప్రాంతంలో కేవలం 7 కిలోమీటర్ల దూరంలోనే హోస్టోమెల్​ ఉంటుంది. రష్యా వాయుసేనకు చెందిన 200 హెలికాప్టర్లు.. హోస్టోమెల్​లో దిగేందుకు చర్యలు చేపట్టినట్లు చెప్పారు ఆ దేశ రక్షణ శాఖ ప్రతినిధి మేజర్​ జనరల్​ ఇగోర్​ కొనషెంకోవ్​.

వెయ్యి మంది సైనికులు మృతి..

ఉక్రెయిన్​ రాజధాని కీవ్​ను ఆక్రమించుకునేందుకు దూసుకెళ్తున్న రష్యా బలగాలను ప్రతిఘటిస్తున్నాయి ఉక్రెయిన్​ సేనలు. ఈ దాడుల్లో ఇప్పటివరకు రష్యాకు చెందిన 1000 మందికిపైగా సైనికులు చనిపోయినట్లు ఉక్రెయిన్ రక్షణ శాఖ ప్రకటించింది.

చర్చలకు పుతిన్​ సిద్ధం!

ఉక్రెయిన్​తో చర్చలు చేపట్టేందుకు బెలారస్​ రాజధాని.. మిన్స్క్​కు ఉన్నతస్థాయి అధికారులను పంపేందుకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్​ పుతిన్​ సిద్ధంగా ఉన్నట్లు ప్రకటన వెలువడింది. క్రెమ్లిన్​ అధికార ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్ ఈ విషయం​ తెలిపారని భారత్​లో రష్యా రాయబారి కార్యాలయం వెల్లడించింది.

ఇదీ చూడండి: ఆ 27 దేశాలను నమ్మి ఉక్రెయిన్​ మోసపోయిందా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.