ETV Bharat / international

బిల్​గేట్స్​తో మోదీ భేటీ.. ఆ విషయంపై చర్చ

author img

By

Published : Nov 2, 2021, 8:28 PM IST

ప్రపంచ వాతావరణ సదస్సుకు హాజరైన ప్రధాని మోదీ.. వివిధ దేశాధినేతలతో భేటీ అయ్యారు. ఆయా దేశాలతో భారత ద్వైపాక్షిక సంబంధాలతో పాటు.. వివిధ అంశాలపై చర్చించారు. సదస్సులో భాగంగా.. మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్‌తోనూ మోదీ సమావేశమయ్యారు.

cop
ప్రపంచ వాతావరణ సదస్సు

ప్రపంచ వాతావరణ సదస్సులో భాగంగా గ్లాస్గోలో పర్యటిస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ.. దిగ్గజ వ్యాపారవేత్త, మైక్రోసాఫ్ట్​ సహవ్యవస్థాపకుడు బిల్ గేట్స్‌తో సమావేశమయ్యారు. వాతావరణ మార్పులు, స్థిరమైన అభివృద్ధి వంటి అంశాలపై ఇరువురూ చర్చించారు. ఇద్దరి మధ్య ఆహ్లాదకర వాతావరణంలో చర్చలు జరిగినట్లు పీఎంఓ ట్విట్టర్‌లో పేర్కొంది.

గేట్స్ ఫౌండేషన్ ద్వారా.. భారత్ సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను చేరుకునేందుకు తోడ్పాటునందిస్తామని గతంలో బిల్​గేట్స్ ప్రకటించారు. ఆరోగ్యం, పోషకాహారం, పారిశుద్ధ్యం, వ్యవసాయ రంగాలపై ప్రత్యేక దృష్టి సారించనున్నట్లు పేర్కొన్నారు. తాజాగా.. వినూత్న ఆవిష్కరణల ద్వారా వీటిని చేరుకుంటామని ఉద్ఘాటించారు.

cop
బిల్ గేట్స్‌తో ప్రధాని మోదీ

"ప్రపంచ వాతావరణ సదస్సు ద్వారా.. సున్నా ఉద్గారాల లక్ష్యాన్ని చేరుకునేందుకు అవసరమైన కాలుష్య రహిత సాంకేతికతల అభివృద్ధిని వేగవంతం చేయడానికి మరిన్ని మార్గాలను కనుగొనే అవకాశం కలిగింది," అని గేట్స్ ట్వీట్ చేశారు.

ఈ మధ్యకాలంలో కరోనాపై పోరులో ప్రధానంగా దృష్టి సారించిన గేట్స్.. మహమ్మారిని ఎదుర్కోవడానికి ప్రపంచ సహకారం అవసరం అని అభిప్రాయపడ్డారు. ఈ మేరకు మోదీతో భేటీ అనంతరం ట్విట్టర్ వేదికగా ఆయనకు ధన్యవాదాలు తెలిపారు.

"దేశ ప్రజలందరికీ కరోనా వ్యాక్సిన్లు, పరీక్షలు సులభంగా అందించడంలో భారత్ కీలక పాత్ర పోషిస్తోంది. ప్రజలపై సామాజిక, ఆర్థిక ప్రభావాన్ని తగ్గించడానికి కృషి చేస్తున్న మోదీకి ధన్యవాదాలు."

-బిల్​ గేట్స్, వ్యాపారవేత్త

నేపాల్ ప్రధానితో మోదీ..

ప్రపంచ వాతావరణ సద్సులో భాగంగా నేపాల్ ప్రధానమంత్రితో మోదీ భేటీ అయ్యారు. షేర్ బహదూర్ దేవ్​బా నేపాల్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం తొలిసారి సమావేశమయ్యారు మోదీ. ఈ సందర్భంగా ఇరుదేశాల ద్వైపాక్షిక సంబంధాల బలోపేతం సహా.. కరోనా మహమ్మారి, వాతావరణ మార్పులపై దేశాధినేతలు చర్చించారు. ఈ మేరకు విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి అరిందమ్ బాగ్చి ట్విట్టర్‌లో తెలిపారు.

cop
నేపాల్ ప్రధానితో మోదీ

మోదీతో భేటీ అనంతరం 'భారత ప్రధాని నరేంద్రమోదీని కలుసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది,' అని నేపాల్ ప్రధాని ట్వీట్ చేశారు.

ఇజ్రాయెల్ ప్రధానితో మోదీ భేటీ..

వాతావరణ శిఖరాగ్ర సదస్సులో భాగంగా.. ఇజ్రాయెల్ ప్రధాని నాఫ్తాలీ బెన్నెట్‌తో ప్రధాని మోదీ సమావేశమయ్యారు. భారత్-ఇజ్రాయెల్ ద్వైపాక్షిక సంబంధాలతో పాటు.. ఆవిష్కరణలు, ఉన్నత సాంకేతికత వంటి అంశాలపై చర్చించారు. ఈ రంగాల్లో సహకారాన్ని మరింత విస్తరించాలని నిర్ణయించారు.

cop
ఇజ్రాయెల్ ప్రధానితో మోదీ సమావేశం

ఉక్రెయిన్ అధ్యక్షునితోనూ..

ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్​స్కీ తో ప్రధాని మోదీ సమావేశమయ్యారు. ద్వైపాక్షిక, ప్రాంతీయ పరిణామాలపై చర్చించారు. కరోనా వ్యాక్సినేషన్ సర్టిఫికేట్‌ల పరస్పర గుర్తింపుపైనా చర్చించినట్లు అరిందమ్ బాగ్చి ట్విట్టర్‌లో పేర్కొన్నారు.

cop
ఉక్రెయిన్ అధ్యక్షునితో మోదీ

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.