ETV Bharat / international

టీకా తీసుకున్న వారి నుంచి కూడా 'డెల్టా' వ్యాప్తి!

author img

By

Published : Oct 29, 2021, 12:27 PM IST

టీకాలు అందుబాటులోకి వచ్చినప్పటికీ యూకే, రష్యా వంటి దేశాల్లో కొవిడ్​ మళ్లీ విజృంభిస్తోంది. టీకా వేసుకున్న వారి నుంచి కూడా డెల్టా వ్యాప్తి చెందడమే ఇందుకు గల కారణమని బ్రిటన్​కు చెందిన ఇంపీరియల్​ కాలేజ్​ లండన్​ చేసిన అధ్యయనంలో తేలింది.

delta variant covid
టీకాన జయించిన 'డెల్టా'.. వారి నుంచి కూడా వైరస్​ వ్యాప్తి!

కరోనా మహమ్మారి రక్కసిని అడ్డుకునేందుకు టీకా పంపిణీ కార్యక్రమం ప్రపంచవ్యాప్తంగా ముమ్మరంగా సాగుతోంది. ఇప్పటికే కొన్ని దేశాలు బూస్టర్‌ డోసులను కూడా అందిస్తున్నాయి. అయినా సరే యూకే, రష్యా లాంటి దేశాల్లో మళ్లీ కొవిడ్ విజృంభణ మొదలైంది. ఆయా దేశాల్లో డెల్టా రకం వైరస్ వ్యాప్తి విపరీతంగా ఉంది. మరి.. టీకాలు అందుబాటులోకి వచ్చినప్పటికీ కరోనా ఉద్ధృతికి కారణమేంటి? అంటే.. వ్యాక్సిన్‌ వేసుకున్నవారి నుంచి కూడా డెల్టా వ్యాప్తి చెందడమే అని తాజా అధ్యయనం ఒకటి వెల్లడించింది.

కరోనా రకాల్లోనే అత్యంత ప్రమాదకరమైన, వేగవంతమైన వేరియంట్‌గా పిలుస్తున్న డెల్టా రకం వైరస్‌.. టీకా వేసుకున్న వ్యక్తి నుంచి కూడా సులువుగా ఆ వ్యక్తి కుటుంబసభ్యులకు వ్యాప్తి చెందుతుందని ఈ అధ్యయనం వెల్లడించింది. బ్రిటన్‌కు చెందిన ఇంపీరియల్‌ కాలేజ్‌ లండన్‌.. 621 మందితో ఏడాది పాటు చేపట్టిన అధ్యయనంలో ఈ విషయం బయటపడిందట. వీరి నుంచి సేకరించిన నమూనాలను పరిశీలించగా.. టీకా వేసుకున్న వ్యక్తుల నుంచి వారి కుటుంబసభ్యులకు వైరస్‌ వ్యాప్తి చెందుతున్నట్లు తేలింది.

621 మందిపై ఈ అధ్యయనం జరపగా.. ఇందులో 205 మంది నుంచి వారి కుటుంబసభ్యులకు డెల్టా వేరియంట్‌ సోకినట్లు తేలింది. వైరస్‌ సోకిన వారిలో 38శాతం మంది కుటుంబసభ్యులు టీకా తీసుకోలేదని, 25శాతం మంది టీకా వేయించుకున్నప్పటికీ కరోనా బారిన పడ్డారని శాస్త్రవేత్తలు తెలిపారు. అయితే వ్యాక్సిన్‌ తీసుకున్నవారు కరోనా నుంచి త్వరగా కోలుకోగలిగారని పేర్కొన్నారు. అధిక వ్యాక్సిన్‌ రేటు ఉన్న దేశాల్లోనూ డెల్టా వేరియంట్‌ వైరస్‌ విజృంభణకు కారణమిదేనని వెల్లడించారు.

మన చుట్టూ ఉన్నవారు టీకా తీసుకున్నారు కదా..మనం వేయించుకోవాల్సిన అవసరం లేదులే అనుకుంటే అది చాలా పొరబాటు. టీకా తీసుకున్నవారి నుంచి కూడా వైరస్‌ ముప్పు ఉంటుంది. అందువల్ల ప్రతిఒక్కరూ వ్యాక్సిన్ వేయించుకోవాలని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. అంతేగాక, టీకాతో పాటు మాస్క్‌ ధరించడం, భౌతిక దూరం వంటి కరోనా నిబంధనలు కూడా పాటించాలని పిలుపునిచ్చారు.

ఇదీ చూడండి:- భయపెడుతున్న ఏవై.4.2 వేరియంట్​- శాస్త్రవేత్తలు ఏమంటున్నారు?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.