ETV Bharat / international

చొచ్చుకుపోతున్న రష్యా బలగాలు- కీవ్​లో బాంబుల వర్షం

author img

By

Published : Mar 3, 2022, 10:51 PM IST

Ukraine-Russia crisis: ఉక్రెయిన్‌పై సమరశంఖం పూరించిన రష్యా.. 8వరోజు దాడులు కొనసాగిస్తోంది. రాజధాని కీవ్‌తోపాటు ఖార్కివ్ నగరాలపై పుతిన్ సేనలు పెద్దఎత్తున దాడులు చేస్తున్నాయి. ఖేర్సన్ నగరాన్ని స్వాధీనం చేసుకున్నట్లు ప్రకటించాయి. ఈ విషయాన్ని ఉక్రెయిన్ ప్రభుత్వవర్గాలు కూడా ధ్రువీకరించాయి. ఉక్రెయిన్ యుద్ధంలో 500 మంది తమ సైనికులు చనిపోయినట్లు రష్యా ప్రకటించింది. మరోవైపు.. మాస్కోపై బ్రిటన్ మరికొన్ని ఆర్థిక ఆంక్షలు ప్రకటించగా.. రష్యా, బెలారస్ అథ్లెట్స్ బీజింగ్ శీతాకాల పారా ఒలింపిక్స్‌లో పాల్గొనకుండా అంతర్జాతీయ పారాఒలింపిక్స్ కమిటీ నిషేధం విధించింది.

Ukraine War
ఉక్రెయిన్ యుద్ధం

Ukraine-Russia crisis: ఉక్రెయిన్‌పై సైనికచర్య చేపట్టిన రష్యా.. 8వ రోజు రాజధాని కీవ్, ఖార్కివ్‌సహా పలు నగరాల్లో బాంబులవర్షం కురిపించింది. మాస్కో దాడులను ఉక్రెయిన్ సేనలు కూడా గట్టిగానే ప్రతిఘటిస్తున్నాయి. దక్షిణ ప్రాంతంలోని ఖేర్సన్‌ నగరంపై రష్యా పూర్తి పట్టు సాధించింది. ఈ మేరకు రష్యా రక్షణ శాఖ ఓ ప్రకటన చేయగా.. ఈ విషయాన్ని ఉక్రెయిన్‌ కూడా ధ్రువీకరించింది. కీవ్‌లో ఈ తెల్లవారుజామున నాలుగు భారీ పేలుళ్లు జరిగినట్లు ప్రభుత్వవర్గాలు తెలిపాయి. శివారులో భీకరపోరు కారణంగా కీవ్‌ నగరంలో వైమానికదాడుల సైరన్లు మోగినట్లు ఉక్రెయిన్ మీడియా ప్రకటించింది. షెల్టర్లలో తలదాచుకోవాలని స్థానిక యంత్రాంగం ప్రజలకు సూచించింది. ఆక్రమణదారులు నగరంలోకి ప్రవేశించేందుకు గట్టి ప్రయత్నాలు చేస్తున్నట్లు టెలిగ్రామ్ సందేశం ద్వారా పేర్కొన్నకీవ్ మేయర్.. మాస్కో జరిపిన తాజా దాడుల్లో పౌరులెవరు చనిపోలేదన్నారు. ఇకనుంచి ప్రతిదాడులు చేయనున్నట్లు ఉక్రెయిన్ సైనికదళాల ప్రధానాధికారి తెలిపారు. కీవ్ సరిహద్దులకు 30కిలోమీటర్ల దూరంలోనే రష్యా భారీ సాయుధ కాన్వాయ్‌ను ఉక్రెనియన్లు అడ్డుకున్నట్లు మీడియా తెలిపింది.

Ukraine-Russia crisis
ఉక్రెయిన్‌లోని కీవ్ శివార్లలో భారీ నష్టం జరిగిన దృశ్యం

ఉక్రెయిన్ రెండో పెద్దనగరం ఖార్కివ్‌లోను దాడులు కొనసాగాయి. రష్యా వైమానిక దాడులు విద్యాసంస్థలు, చర్చిలను తాకినట్లు ఉక్రెయిన్ ఆరోపించింది. మూడు విద్యాసంస్థలు, క్యాథెడ్రల్‌ చర్చి దెబ్బతిన్నట్లు పేర్కొంది. సిటీ కౌన్సిల్‌ భవనం సమీపంలోని పలు దుకాణాలు దెబ్బతిన్నట్లు అధికారవర్గాలు తెలిపాయి. గత 24గంటల్లో ఖార్కివ్ ప్రాంతంలో 34 మంది పౌరులు, 285 మంది గాయపడినట్లు పేర్కొన్నాయి.

Ukraine-Russia crisis
రష్యా దాడుల్లో గాయపడిన పౌరుడిని మారియుపోల్‌లో ఆసుపత్రికి తరలిస్తున్న రెస్క్యూ సిబ్బంది

ఆ చమురు డిపో లక్ష్యంగా..

శత్రు సైన్యాలు బాంబులు, షెల్స్, రాకెట్లు, గ్రెనేడ్లతో దాడులు చేస్తున్నట్లు ఉక్రెయిన్ తెలిపింది. ఓక్‌టిర్కా సైనిక స్థావరం లక్ష్యంగా మాస్కో సేనలు జరిపిన ఫిరంగుల దాడిలో పదుల సంఖ్యలో నివాస ప్రాంతాలు ధ్వంసమయ్యాయని, అయితే ఈ దాడుల్లో ఎవరు చనిపోలేదని అధికారవర్గాలు పేర్కొన్నాయి. ఉత్తర ప్రాంతంలోని చెర్నిహివ్ చమురు డిపోను లక్ష్యంగా రష్యా సేనలు దాడులు చేశాయి. ఇంధన ట్యాంకుల నుంచి దట్టమైన పొగ ఎగిసిన ఫొటోలను మీడియా ప్రచురించింది. చెర్నిహివ్, మరియుపోలో నగరాల్లోను పెద్దఎత్తున షెల్లింగ్ జరుగుతున్నట్లు ఉక్రెయిన్ తెలిపింది. నల్ల సముద్రం ఓడరేవు ఓల్వీయలో జరిగిన రాకెట్ దాడిలో బంగ్లాదేశ్ నావికుడు చనిపోయినట్లు షిప్పింగ్ సంస్థ ప్రకటించింది.

Ukraine-Russia crisis
రష్యా దాడుల్లో కీవ్​లో మంటలను ఆర్పుతున్న అగ్ని మాపక సిబ్బంది

ఉక్రెయిన్‌కు అండగా..

ఉక్రెయిన్‌కు వివిధ దేశాలు ఆయుధాలతోపాటు ఆర్థికసాయం ప్రకటిస్తున్నాయి. యూరోపియన్ యూనియన్‌ 500మిలియన్ యూరోల మానవతాసాయం ప్రకటించింది. ఇందుకోసం రొమేనియాలో ఓ కేంద్రం ఏర్పాటు చేయనుంది. జర్మనీ 2,700 క్షిపణులు, లాత్వియా 90 డ్రోన్లను ఉక్రెయిన్‌కు అందజేయనున్నట్లు తెలిపాయి. రష్యాపై బ్రిటన్ మరికొన్ని ఆంక్షలు విధించింది. బ్రిటిష్ బీమా కంపెనీల ద్వారా రష్యన్ కంపెనీలు విమానయానం, అంతరిక్ష పరిశ్రమల్లోకి ప్రవేశించకుండా నిషేధం విధించింది. రష్యాలో ఐకియా తన కార్యకలాపాలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. శుక్రవారం నుంచి ప్రారంభమయ్యే బీజింగ్ శీతాకాల పారా ఒలింపిక్స్‌లో పాల్గొనకుండా రష్యా, బెలారస్ అథ్లెట్స్‌పై నిషేధం విధిస్తున్నట్లు అంతర్జాతీయ పారా ఒలింపిక్స్ కమిటీ ప్రకటించింది. యుద్ధం మొదలైనప్పటి నుంచి 10లక్షలమందికిపైగా వలస వెళ్లినట్లు ఐరాస శరుణార్థుల విభాగం వెల్లడించింది. ఈ సంఖ్య 40 లక్షలకు పెరిగే అవకాశం ఉందని అంచనా వేసింది. శరణార్థులు ఎక్కువగా పోలాండ్, హంగరి వెళ్తున్నట్లు పేర్కొంది.

Ukraine-Russia crisis
జర్మనీ హాంబర్గ్‌లో స్పీల్‌బుడెన్‌ప్లాట్జ్, రీపర్‌బాన్‌లలో జరిగిన ర్యాలీలో పాల్గొన్న వేల మందితో ప్రదర్శన

ఇదీ చదవండి: పుతిన్‌ వంటవాడి కనుసన్నల్లో కాలకేయ సైన్యం

పుతిన్ సరికొత్త​ వ్యూహం.. ఉక్రెయిన్‌ పీఠంపై రష్యా అనుకూల విక్టర్‌

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.