కరోనా వేళ.. అతి జాగ్రత్తలతో అనర్థాలు తప్పవు!

author img

By

Published : Oct 19, 2021, 7:06 AM IST

Updated : Oct 19, 2021, 8:20 AM IST

corona measures

కరోనా కారణంగా పరిసరాలను చాలా శుభ్రంగా ఉండేలా చూసుకుంటున్నాం. ఇందుకోసం చుట్టుపక్కల బ్లీచింగ్​ పౌడర్​ చల్లడం చేస్తుంటాం. ఇక వ్యక్తిగత శుభ్రతకు వస్తే.. చేతులకు శానిటైజర్​ రాసుకోవడం షరా మామూలైంది. ఇలా రోజూ మనం చేస్తున్న వాటి వినియోగం శృతిమించితే కష్టం అని అంటున్నారు నిపుణులు.

కరోనా పుణ్యమా అని పరిసరాల్లో బ్లీచింగ్‌ పౌడర్‌ చల్లడం, చేతులకు శానిటైజర్‌ రాసుకోవడం, వస్తువులపై వైరస్‌ సంహారక ద్రావణాన్ని పిచికారి చేయడం.. దైనందిన కార్యక్రమాలుగా మారిపోయాయి! వైరస్‌ కట్టడి సంగతి అటుంచితే, అతి జాగ్రత్తకుపోయి వీటిని అతిగా, తప్పుగా వినియోగించడం వల్ల అనర్థాలు తప్పడంలేదు. పొరపాటున ఇవి నోట్లోకి వెళ్తే ఏమవుతుంది? ఈ సాధనాలతో ఎలాంటి దుష్ప్రభావాలు ఉంటాయి? అంటూ ఆస్ట్రేలియాలోని 'న్యూ సౌత్‌వేల్స్‌లోని పాయిజన్స్‌ ఇన్ఫర్మేషన్‌ సెంటర్‌'కు ఇబ్బడిముబ్బడిగా ఫోన్‌కాల్స్‌ వస్తున్నాయి. దీంతో ఈ సాధనాల వల్ల ఎలాంటి దుష్ప్రభావాలు ఉంటాయన్నది అక్కడి నిపుణులు వివరించారు.

దంత చికిత్స చేసేముందు హైడ్రోజన్‌ పెరాక్సైడ్‌ (1-1.5%)తో పుక్కిలి పట్టాలని వైద్యులు సూచిస్తుంటారు. యాంటీసెప్టిక్‌గా వాడే ఈ ద్రావణంతో తరచూ పుక్కిలిపట్టి, ఆవిరి రూపంలో పీల్చకూడదు. అలా చేస్తే.. ముక్కు, నోరు, గొంతు, ఊపిరితిత్తులు వాచిపోతాయి. దగ్గు, వాంతులు తలెత్తుతాయి. శ్వాస తీసుకోవడమూ ఇబ్బంది కావచ్చు. ఊపిరితిత్తులు శాశ్వతంగా దెబ్బతినే ప్రమాదమూ లేకపోలేదు.

  • గాఢమైన ఇతర యాంటీసెప్టిక్‌ ద్రావణాలతో పుక్కిలిస్తే నోటిలో వాపు, కడుపునొప్పి, విరేచనాలు తలెత్తుతాయి.
  • మరుగుదొడ్లు, వంట గదిని శుభ్రపరిచేందుకు వినియోగించే పారిశుద్ధ్య ఉత్పత్తులు చాలా హానికరమైనవి. వీటితో పుక్కిలి పడితే అన్నవాహిక పగిలి, రక్తస్రావమయ్యే ప్రమాదముంటుంది. అంతర్గత గాయాల వల్ల ఒక్కోసారి ప్రాణాపాయం తప్పకపోవచ్చు.
  • బ్లీచింగ్‌ పౌడర్‌, వైరస్‌ సంహారక ద్రావణాలను నేరుగా ఒంటికి రాసుకోవడం, నీటిలో కలుపుకొని స్నానం చేయడం సరికాదు. దీనివల్ల దద్దుర్లు, తీవ్ర చికాకు బాధిస్తాయి. ఫేస్‌ మాస్కులపై క్రిమిసంహారక ద్రావణాలను స్ప్రేచేసి ధరించడం వల్ల వికారం, తలనొప్పి ఎదురవుతాయి.

ఇలాగైతే అనారోగ్యాన్ని కొని తెచ్చుకున్నట్టే..

అవసరం లేకపోయినా విటమిన్‌ మాత్రలను దీర్ఘకాలం వాడటమూ హానికరమే. విటమిన్‌-సి ఎక్కువైతే మూత్రపిండాల్లో రాళ్ల సమస్య వస్తుంది. జింక్‌ ఎక్కువైతే రుచి, వాసన కోల్పోయే ప్రమాదముంది. విటమిన్‌-డి ఎక్కువైతే రక్తంలో కాల్షియం స్థాయులు పెరిగి... తలనొప్పి, అతి దాహం, మూర్చ తలెత్తవచ్చు.

ఇదీ చూడండి: కొవిడ్‌ కోరలు వంచిన జపాన్.. ఇవే కారణాలు

Last Updated :Oct 19, 2021, 8:20 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.