ETV Bharat / international

ఇరాన్ అణుకేంద్రంలో నూతన ప్లాంట్​ నిర్మాణం!

author img

By

Published : Oct 28, 2020, 5:45 PM IST

Satellite image show construction at Iran nuclear site
ఇరాన్ అణుకేంద్రంలో నూతన నిర్మాణం!

ఇరాన్​లోని యురేనియం నిల్వల కేంద్రం నటాన్జ్​ వద్ద నిర్మాణ పనులు జరుగుతున్నట్లు ఉపగ్రహ చిత్రాలు స్పష్టం చేస్తున్నాయి. ఇది నూతనంగా నిర్మిస్తున్న భూగర్భ సెంట్రిఫ్యూజ్ అసెంబ్లీ ప్లాంట్ అయి ఉంటుందని నిపుణులు భావిస్తున్నారు.

నటాన్జ్ అణుకేంద్రంలో నూతన నిర్మాణాన్ని ప్రారంభించింది ఇరాన్​. తాజాగా విడుదలైన ఉపగ్రహ చిత్రాలను చూస్తే ఇది స్పష్టంగా తెలుస్తోంది. ఐకరాజ్యసమితి అణు సంస్థ కూడా దీనిని ధ్రువీకరించింది. భూగర్భంలో అధునాతన సెంట్రిఫ్యూజ్ అసెంబ్లీ ప్లాంట్​ను టెహ్రాన్​ నిర్మిస్తోందని తెలిపింది. గతేడాది వేసవిలో జరిగిన దాడిలో ధ్వంసమైన ప్లాంట్​ స్థానంలో ఈ నూతన నిర్మాణాన్ని ఇరాన్​ చేపట్టి ఉంటుందని ఐరాస అణు సంస్థ భావిస్తోంది.

అమెరికా అధ్యక్ష ఎన్నికలు దగ్గరపడుతున్న నేపథ్యంలో ఇరాన్ ఈ నిర్మాణాన్ని ప్రారంభించింది. అణు కార్యకలాపాలను విరమించుకోవాలని ఇరాన్​పై ఇదివరకే ఒత్తిడి తీసుకొచ్చారు డొనాల్డ్​ ట్రంప్. ఆయనతో విబేధించిన అనంతరం అణు కార్యకలాపాలపై పరిమితులను ఇరాన్​ పూర్తిగా ఎత్తివేసింది. అయితే తాము అధికారంలోకి వస్తే అణుఒప్పందాన్ని పునరుద్దరించే విషయంపై ఆలోచిస్తామని జో బైడెన్ ప్రకటించారు. అధ్యక్ష ఎన్నికల ఫలితాల అనంతరం ఇరాన్​తో అమెరికా ఏ విధంగా ముందుకు సాగుతుందనే విషయంపై స్పష్టత రానుంది.

నూతన నిర్మాణంపై స్పందించేందుకు ఇరాన్​ అణుశక్తి సంస్థ ముఖ్య అధికారి అలీ అక్బర్ సలేహీ నిరాకరించారు. అయితే గతేడాది ధ్వంసమైన ప్లాంట్ స్థానాన్ని భర్తీ చేసేందుకు పర్వత ప్రాంతాలో నిర్మాణాన్ని చేపడుతున్నట్లు సెప్టెంబరులో ప్రభుత్వ టీవీ ఛానల్​కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు.

ఈ విషయంపై తమకు సమాచారం ఉందని అంతర్జాతీయ అణుశక్తి సంస్థ డైరెక్టర్ జనరల్​ రఫేల్​ గ్రోసి తెలిపారు. నూతన ప్లాంట్ నిర్మాణాన్ని ఇరాన్​ ప్రారంభించిందని, కానీ అది పూర్తవడానికి చాలా సమయం పడుతుందని ఆయన చెప్పారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.