ETV Bharat / international

దావూద్‌ చిరునామాల్లో ఒకటి మాయం!

author img

By

Published : Aug 23, 2020, 3:58 PM IST

pak-hide-dawood-one-address
దావూద్‌ చిరునామా ఒకటి మాయం..!

ఎఫ్​ఏటీఎఫ్​​ గ్రే లిస్ట్​ నుంచి బయటకు వచ్చేందుకు దావూద్​ను ఉగ్రవాదుల జాబితాలో చేర్చిన పాక్..​ కరాచీలోని అతడి చిరునామాలను ప్రకటించింది. కానీ.. దావూద్​కు సంబంధించిన ఓ చిరునామాను దాచిపెట్టింది. 2010లో అల్‌ఖైదా ఆంక్షల కమిటీ చూపిన చిరునామాల్లోని నాలుగింటిలో మూడింటిని మాత్రమే పేర్కొనటంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ఫైనాన్షియల్‌ యాక్షన్‌ టాస్క్‌ఫోర్స్‌ గ్రే లిస్ట్​ నుంచి బయటపడేందుకు ఉగ్రవాదుల జాబితాలో దావూద్​ ఇబ్రహీం పేరును చేర్చిన పాకిస్థాన్​.. కరాచీలోని అతని చిరునామాలను ప్రకటించింది. కానీ, గతంలో అల్​ఖైదా ఆంక్షల కమిటీ వెల్లడించిన చిరునామాల్లో ఉన్న నాలుగింటిలో మూడింటిని మాత్రమే చూపి.. ఒక చిరునామాను మాయం చేసింది.

పాక్​‌ చూపిన చిరునామాల్లో 'వైట్‌ హౌస్‌, కరాచీ', 'హౌస్‌ నెంబర్‌ 37, 30వ స్ట్రీట్‌-డిఫెన్స్‌, హౌసింగ్‌ అథారిటీ కరాచీ', 'పలాటియాల్‌ బంగ్లా, నూరాబాద్‌, కరాచీ' ఉన్నాయి. కానీ, 2010లో అల్‌ఖైదా ఆంక్షల‌ కమిటీ (1267 కమిటీ) చూపిన చిరునామాల్లో పై మూడింటితోపాటు మార్గల్లా రోడ్డులోని హౌస్‌ నెంబర్‌ 29, ఎఫ్‌ 6/2 స్ట్రీట్‌ నెంబర్‌.22, కరాచీ కూడా ఉంది. పాక్‌ తాజాగా వెల్లడించిన జాబితాలో అది లేదు.

అబ్బే ఇక్కడలేడు..

కరాచీలోని ఈ హైప్రొఫైల్‌ చిరునామాలను బట్టే దావూద్‌ అక్కడ సైనిక సంరక్షణలో ఉన్నట్లు వెల్లడవుతోంది. చివరికి కరాచీలో చెత్తను తరలించే పనిలో కూడా సైన్యం జోక్యం ఉంటుంది. భారత్‌ నుంచి వలసవెళ్లిన మొహజిర్లు అత్యధిక మంది కరాచీలోనే ఉంటారు. కరాచీలో నివసించే మొహజిర్లను అణచివేసేందుకు వారి కదలికలపై ఓ కన్నేసి ఉంచుతుంది. ఈ నేపథ్యంలో దావూద్‌ అక్కడ ఏళ్ల తరబడి నివసించినా కనుక్కోలేదనుకోవడం అపోహే. ఇప్పుడు పాక్‌ కొత్తపాటను అందుకొంది. "దావూద్‌ ఆస్తులు ఉన్నాయన్నాము. కానీ.. అతను ఇక్కడ ఉన్నాడని అనలేదు" అని చెబుతోంది. ఈ మేరకు పాక్‌ విదేశాంగ శాఖ ఆదివారం ఉదయం ఒక ప్రకటన విడుదల చేసింది. 'శాంక్షనరీ రెగ్యూలేటరీ ఆర్డర్‌లోని వారంతా ఇక్కడ ఉన్నారని అర్థం కాదు' అని పేర్కొంది.

మసూద్‌ అజర్‌ అనుభవం ఏం చెబుతోంది..

భారత్‌ కొన్నేళ్ల కృషి తర్వాత 2019లో మేలో మసూద్‌ అజర్‌ పేరును ఐరాస 1267 కమిటీ జాబితాలోకి తీసుకొచ్చింది. అదే ఏడాది సెప్టెంబర్లో మసూద్‌ తినడానికి కూడా డబ్బుల్లేవని .. బ్యాంక్‌ ఖాతాల్లో సొమ్ము వాడుకోవడానికి అనుమతులు ఇవ్వాలని పాక్‌.. ఐరాస భద్రతా మండలిని కోరింది. దీనికి ఆ సంస్థ అంగీకరించింది. ఇక అతని పేరు ఉగ్రజాబితాలో చేర్చి ప్రయోజనం ఏమిటో తెలియదు. లష్కరే తోయిబా పై ఆంక్షలు విధించగానే జమాత్‌ ఉద్‌ దవా పేరుతో కార్యకలాపాలు మొదలుపెట్టిన విషయం తెలిసిందే. ఇక దావూద్‌ విషయానికి వస్తే తీవ్ర అనారోగ్యంతో ఉన్నట్లు చాలా సార్లు వార్తలు వచ్చాయి. కరోసా సోకి మరణించినట్లు కూడా జూన్‌లో వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఒక్క దావూద్‌ ఇబ్రహీం పైన మాత్రమే ఆంక్షలు విధిస్తే సరిపోదని.. అతని బృందం మొత్తాన్ని కట్టడి చేసి, సంస్థల ఆస్తులను స్తంభింపజేయాలని అంటున్నారు విశ్లేషకులు.

ఇదీ చూడండి: కరాచీలోనే డాన్​ దావూద్‌.. అంగీకరించిన పాక్‌‌!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.