ETV Bharat / international

లీకైన ఫొటోతో మాజీ ప్రధాని అనారోగ్యంపై అనుమానాలు

author img

By

Published : May 31, 2020, 10:54 PM IST

పాకిస్థాన్​ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ లండన్​లో టీ తాగుతున్న ఫొటో ఒకటి సామాజిక మాధ్యమాల్లో వైరల్​ అయింది. ఈ ఫొటో చూసిన వారు.. ఆయన అనారోగ్యంపై సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. నవాజ్ ఆరోగ్యంగా ఉన్నారని,​ వెంటనే పాక్ తిరిగొచ్చి అవినీతి కేసుల్లో విచారణ ఎదుర్కోవాలని కొందరు పాక్​ మంత్రులు డిమాండ్​ చేస్తున్నారు.

Nawaz Sharif's leaked photo sparks debate over his health
లీకైన ఫొటోతో మాజీ ప్రధాని అనారోగ్యంపై అనుమానాలు

పాకిస్థాన్​ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్​ ఆరోగ్యంపై ఇప్పుడు ఆ దేశంలో తీవ్రంగా చర్చ జరుగుతోంది. లండన్​లో కుటుంబసభ్యులతో కలిసి ఓ కేఫ్​లో టీ తాగుతున్న షరీఫ్​ ఫొటో సామాజిక మధ్యమాల్లో వైరల్ అయింది. ఆ ఫొటో చూసిన వారంతా.. ఆయన అనారోగ్యంపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. షరీఫ్​ ఆరోగ్యంగానే ఉన్నారని, పాకిస్థాన్ తిరిగి వచ్చి అవినీతి ఆరోపణల కేసుల్లో విచారణ ఎదుర్కోవాలని అధికార పీటీఐ పార్టీ మంత్రులు డిమాండ్​ చేస్తున్నారు.

లీకైనా ఫొటోలో నవాజ్​ తన మనమరాళ్లతో కలిసి ఓ రోడ్డు పక్కన ఉన్న కేఫ్​లో టీ తాగుతున్నారు. ఈ ఫొటో చూస్తే.. ఆయన తీవ్ర అనారోగ్యంగా ఉన్నారనే వార్తలు అవాస్తవమని అర్థమవుతోందని, కరోనా వైరస్​ వ్యాప్తి చెందుతున్న సమయంలోనూ ఆయన కనీసం మాస్కు కూడా ధరించలేదని కొందరు పాకిస్థానీ​ మంత్రులు ఆరోపిస్తున్నారు. పాకిస్థాన్​ న్యాయవ్యవస్థ తీరు ఎలా ఉందో ఈ ఫొటో చూస్తే తెలిసిపోతోందని సైన్స్​ మంత్రి ఫవాద్​ చౌద్రీ ధ్వజమెత్తారు.

Nawaz Sharif's leaked photo sparks debate over his health
లీకైన నవాజ్ ఫొటో

కోర్టుకు అబద్ధాలు చెప్పి షరీఫ్​ విదేశాలకు వెళ్లారని పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ సలహాదారు శబ్దాద్ గిల్ ఆరోపించారు. ప్రజలు తెలివితక్కువ వాళ్లని.. షరీఫ్​ భావిస్తున్నట్టు, వెంటనే వచ్చి అవినీతి కేసులో విచారణ ఎదుర్కోవాలన్నారు.

మరోవైపు షరీఫ్ మద్దతుదారులు మాత్రం ఈ ఫొటో చూసి.. తమ నాయకుడు ఆరోగ్యంగా ఉన్నారని తెలిసి ఆనందపడుతున్నారు.

గతంలోనూ..

జనవరిలోనూ షరీఫ్​ లండన్​లోని ఓ రెస్టారెంట్​లో టీ తాగిన ఫొటో లీకై వైరల్​ అయింది. ఆ సమయంలో కూడా తీవ్ర చర్చ జరిగింది. ఏదో ఒప్పందం కుదుర్చుకునే షరీఫ్ విదేశాలకు వెళ్లారని అప్పట్లో ప్రచారం జరిగింది.

షరీఫ్ కూతురు మర్యమ్ నవాజ్​ మాత్రం.. ఎవరో కావాలనే తన తండ్రిని ఇబ్బందులకు గురిచేసేందుకే ఈ ఫొటో లీక్ చేశారని ట్విట్టర్​లో చెప్పుకొచ్చారు. గతంలో తన తల్లి ఐసీయూలో ఉన్న ఫొటోలనూ వాళ్లే లీక్ చేశారని ఆరోపించారు.

అవినీతి కెేసులో షరీఫ్​ ఏడేళ్ల జైలు శిక్ష అనుభవిస్తున్న సమయంలో.. గతేడాది నవంబరులో అనారోగ్యానికి గురయ్యారు. ఆయనకు చికిత్స నిమిత్తం విదేశాలకు వెళ్లేందుకు న్యాయస్థానం నెల రోజుల గడువిచ్చింది. కోలుకున్నాకే తిరిగి రావచ్చని తెలిపింది.

లండన్​లో షరీఫ్​కు జరగాల్సిన శస్త్ర చికిత్స కరోనా ప్రభావం కారణంగా వాయిదా పడినట్లు సన్నిహిత వర్గాల సమాచారం.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.