ETV Bharat / international

క్యాన్సర్​తో పాటు కరోనాను జయించిన నాలుగేళ్ల శివాని

author img

By

Published : Apr 27, 2020, 8:18 PM IST

దుబాయ్​లో కరోనా నుంచి కోలుకున్న అతిపిన్న వయస్కురాలిగా నిలిచింది భారత్​కు చెందిన నాలుగేళ్ల శివాని. గతేడాదే క్యాన్సర్​ను జయించిన ఈ బాలిక రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్నప్పటికీ కరోనా మహమ్మారిపై విజయం సాధించింది.

Indian girl beats coronavirus
క్యాన్సర్​ను, కరోనాను జయించిన నాలుగేళ్ల శివాని

ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా మహమ్మారిని జయించింది నాలుగేళ్ల చిన్నారి. చిరుప్రాయంలోనే ప్రాణాంతక క్యాన్సర్​​పైనా విజయం సాధించింది. ఏప్రిల్ 1న వైరస్ లక్షణాలతో దుబాయ్​లోని అల్​ ఫతేమ్​ హెల్త్​ హబ్​ ఆస్పత్రిలో చేరింది భారత్​కు చెందిన శివాని. 20న కోలుకుని డిశ్చార్జ్​ అయింది. ఇప్పుడు 14 రోజులు హోం క్యారంటైన్​లో ఉండనుంది. క్యాన్సర్​పై పోరాడిన తర్వాత రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్నప్పటికీ చిన్నారి ప్రాణాలతో బయటపడినట్లు వైద్యులు తెలిపారు.

తల్లి నుంచి..

శివాని తల్లి దుబాయ్​లో ఆరోగ్య కార్యకర్తగా విధులు నిర్వహిస్తున్నారు. మొదట ఆమెకే వైరస్ సోకింది. ఎలాంటి లక్షణాలు లేకపోయినా ఆమె భర్తకు, బిడ్డకు వైద్య పరీక్షలు నిర్వహించారు. భర్తకు నెగిటివ్ వచ్చింది. శివానికి పాజిటివ్​గా తేలింది. శివాని తల్లి కూడా కోరానా నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం ఆస్పత్రిలో వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు. త్వరలోనే డిశ్చార్జ్ అవుతారు. వీరిద్దరికీ ఒకే వార్డులో చికిత్స అందించారు. శివాని గతంలో క్యాన్సర్​ బాధితురాలు అయినందు వల్ల ఎక్కువ జాగ్రత్తలు తీసుకున్నారు వైద్యులు.

క్యాన్సర్​పై పోరాడి..

పాలబుగ్గల ప్రాయంలోనే మూత్రపిండాలకు సంబంధించిన క్యాన్సర్​ బారిన పడింది శివాని. గతేడాదే ఆమెకు చికిత్స అందించారు వైద్యులు. అందువల్ల ఆమె రోగ నిరోధక శక్తి తగ్గింది. కరోనా వైరస్ కారణంగా ఆమె ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంటుందో అని వైద్యులు మొదట ఆందోళన చెందారు. నిరంతర పర్యవేక్షణలో ఉంచి ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. అదృష్టవశాత్తు శివానిపై వైరస్ తీవ్ర ప్రభావం చూపలేదు.

యూఏఈలో కరోనాను జయించిన అతిపిన్న వయస్కురాలిగా నిలిచింది శివాని. సిరియాకు చెందిన ఏడేళ్ల చిన్నారి, ఫిలిప్పీన్స్​కు చెందిన 9ఏళ్ల బాలుడు అబుదాబిలోని ఆస్పత్రిలో కరోనా నుంచి ఇప్పటికే కోలుకున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.