ETV Bharat / international

ఐదేళ్లుగా రోజూ సెల్ఫీ.. ఒక్కసారిగా కోటీశ్వరుడైన విద్యార్థి!

author img

By

Published : Jan 23, 2022, 6:51 PM IST

Updated : Jan 23, 2022, 7:27 PM IST

Ghozali Everyday: రోజూ సెల్ఫీ తీసుకోవడం ఆ విద్యార్థి అలవాటు. అలా ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా ఐదేళ్లుగా చేస్తున్నాడు. ఆ సెల్ఫీల్లో పెద్ద ప్రత్యేకత కూడా ఏమీ ఉండదు. అన్నింటిలోనూ దాదాపు ఒకటే ఎక్స్​ప్రెషన్. కానీ.. ఆ సెల్ఫీలే ఒక్కసారిగా అతడి జీవితాన్ని మార్చేశాయి. అంతర్జాతీయంగా గుర్తింపు, కోట్ల రూపాయల సొమ్మును తెచ్చిపెట్టాయి.

Ghozali Everyday
ఒక్కసారిగా లక్షాధికారైన విద్యార్థి ఘొజాలి

Ghozali Everyday: సుల్తాన్​ గుస్తాఫ్ అల్​ ఘొజాలి(22).. ఇండోనేసియా సెమరాంగ్​లోని ఓ యూనివర్సిటీలో కంప్యూటర్ సైన్స్ విద్యార్థి. అతడికి ఓ విచిత్ర అలవాటు ఉంది. అదే.. ప్రతిరోజు ఓ సెల్ఫీ తీసుకోవడం. అందుకోసం ఎమోజీ ఫేస్​ పెట్టడం, వింత మేకప్​ వేసుకోవడం వంటి కష్టాలేమీ పడడు అతడు. తన కంప్యూటర్ ముందు కూర్చుని, రోజూ ఒకటే ఎక్స్​ప్రెషన్​తో సెల్ఫీ తీసుకుంటాడు. దాన్ని సేవ్ చేసుకుంటాడు. అలా ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా ఐదేళ్లుగా చేస్తున్నాడు.

ఒక్క ఐడియా...

ఇలా రోజూ సెల్ఫీలు ఎందుకు తీసుకుంటున్నాడో ఘొజాలికి కూడా తెలియదు. రోజూ అలా జరిగిపోతోంది అంతే. మహా అయితే... గ్రాడ్యుయేషన్ సమయంలో తనలో వచ్చిన మార్పుల్ని తెలిపేలా ఆ సెల్ఫీలు అన్నింటితో కలిపి ఓ టైమ్​లాప్స్​ వీడియో చేద్దామనుకున్నాడు అతడు. ఇంతలోనే 'ఎన్​ఎఫ్​టీ'లకు సంబంధించిన వార్తలు అతడి దృష్టిని ఆకర్షించాయి.

ఎన్​ఎఫ్​టీ అంటే.. నాన్​ ఫంజిబుల్ టోకెన్. డిజిటల్ దునియాలో ఇప్పుడిదే నయా ట్రెండ్. ట్వీట్లు, పాటలు, ఫొటోలు, వీడియోలు.. ఇలా దాదాపు అన్నింటినీ డిజిటల్ రూపంలో అమ్మేందుకు, కొనేందుకు వినియోగిస్తున్న టెక్నాలజీనే ఎన్​ఎఫ్​టీ. దీనిద్వారా బిగ్​ బీ అమితాబ్​ బచ్చన్​ లాంటి వారు ఇప్పటికే కోట్ల రూపాయలు గడించారు.

ఎన్​ఎఫ్​టీల గురించి పూర్తి వివరాలు తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.

నా సెల్ఫీలు ఎవరు కొంటారులే...

ఐదేళ్లుగా తీసుకున్న సెల్ఫీలు అన్నింటినీ ఎన్​ఎఫ్​టీల రూపంలో అమ్మకానికి ఎందుకు పెట్టకూడదు అనుకున్నాడు ఘొజాలి. నిజానికి వాటిని ఎవరైనా కొంటారన్న నమ్మకం అతడికి అసలు లేదు. సరదాగా ప్రయత్నించి చూద్దాం అనుకున్నాడంతే. సంబంధిత వెబ్​సైట్​లో ఖాతా తెరిచాడు. జనవరి 10న 'ఘొజాలి ఎవిరీడే' పేరుతో 933 సెల్ఫీలు అమ్మకానికి పెట్టాడు. అసలు ఎవరూ కొంటారన్న నమ్మకం లేదు. అందుకే ఒక్కోదాని ధర 3 డాలర్లు మాత్రమేనని పోస్ట్ చేశాడు.

ఆ ఒక్కరి పోస్ట్​ వల్ల..

అప్పట్లో దర్శక దిగ్గజం రాజమౌళి 'హృదయ కాలేయం' ట్రైలర్​ గురించి చేసిన ట్వీట్​తో.. తెలుగు రాష్ట్రాల్లో 'బర్నింగ్​ స్టార్' అయిపోయాడు​ సంపూర్ణేశ్​ బాబు. ఘొజాలి విషయంలోనూ దాదాపు ఇలానే జరిగింది. ట్వీట్ చేసింది సినీ ప్రముఖులు కాదు. ఓ సెలబ్రిటీ షెఫ్. ఘొజాలి సెల్ఫీని ఎన్​ఎఫ్​టీగా కొన్నట్లు ఆ వ్యక్తి ట్వీట్ చేశారు. అంతే.. అందరి దృష్టి 'ఘొజాలి ఎవిరీడే' సెల్ఫీల సిరీస్​పై పడింది. అతడి స్వీయ చిత్రాలు హాట్​కేకుల్లా అమ్ముడుపోయాయి.

ఇదీ చూడండి: రూ.కోట్లు కురిపిస్తున్న 'మీమ్స్'- అమ్మేయండిలా...

జనవరి 21కల్లా.. 500 మందికిపైగా ఘొజాలి సెల్ఫీలు కొనుగోలు చేశారు. ఫలితంగా అతడి ఖాతాలో 384 ఎథెర్ కాయిన్స్ వచ్చి చేరాయి. ఎథెర్​ అంటే.. బిట్​కాయిన్​ తరహా క్రిప్టోకరెన్సీ. 384 ఎథెర్​ల విలువ.. 10 లక్షల డాలర్లకుపైనే. అంటే దాదాపు 7.5 కోట్ల రూపాయలు.

ఇంతకీ ఆ సెల్ఫీలతో ఏం చేస్తున్నారు?

ఎన్​ఎఫ్​టీ ప్రపంచంలో ఘొజాలి హాట్ టాపిక్ అయ్యాడు. అతడి సెల్ఫీలు కొన్నవారు.. వాటిని టీషర్టులపై ముద్రించి, ధరిస్తున్నారు. మరికొందరైతే అతడి గురించి పాటలు కూడా రాస్తున్నారట.

అలా చేయొద్దు ప్లీజ్..

తన సెల్ఫీలకు ఇంత క్రేజ్ ఎందుకు వచ్చిందో ఇప్పటికీ అర్థం కాలేదని చెబుతున్నాడు ఘొజాలి. వాటిని కొన్నవారికి ఓ ప్రత్యేక విజ్ఞప్తి చేస్తున్నాడు. దయచేసి తన ఫొటోలను ఎడిట్ చేసి, దుర్వినియోగం చేయొద్దని కోరుతున్నాడు. అలా చేస్తే తన తల్లిదండ్రులు బాధపడతారని అంటున్నాడు.

"ఇలా సెల్ఫీలు అమ్మి, కోట్లు సంపాదించిన విషయం ఇంకా నా తల్లిదండ్రులకు చెప్పలేదు. ప్రస్తుతానికి వారి చెప్పే ధైర్యం లేదు. ఎన్​ఎఫ్​టీల ద్వారా వచ్చిన సొమ్మును జాగ్రత్తగా మదుపు చేస్తా. ఏదొక రోజు సొంత ఏనిమేషన్ స్టూడియో తెరవాలన్నదే నా కల" అని చెప్పాడు ఘొజాలి.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

ఇదీ చూడండి: దేశంలో ఎన్​ఎఫ్​టిఫై కార్యకలాపాలు షురూ..!

Last Updated : Jan 23, 2022, 7:27 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.