ETV Bharat / international

'ఎలాంటి దాడులు చేయం.. ఉగ్రసంస్థలతో జట్టు కట్టం'

author img

By

Published : Sep 14, 2021, 10:16 PM IST

అఫ్గానిస్థాన్​ భూభాగాన్ని.. ఇతర దేశాల్లో దాడులు చేసేందుకు ఉపయోగించమన్న ప్రతిజ్ఞకు కట్టుబడి ఉన్నామని అఫ్గాన్ విదేశాంగ మంత్రి తెలిపారు. గతేడాది అమెరికాతో చేసుకున్న ఒప్పందం ప్రకారం ఉగ్రవాద సంస్థలతో సంబంధాలను వదులుకుంటామన్నారు.

taliban
తాలిబన్లు

ఇతర దేశాలపై దాడి చేసేందుకు తమ భూభాగాన్ని ఉపయోగించబోమన్న ప్రతిజ్ఞకు తాలిబన్లు కట్టుబడి ఉన్నారని అఫ్గానిస్థాన్​ నూతన విదేశాంగ మంత్రి మోలావి అమీర్​ఖాన్​ ముట్టాఖీ తెలిపారు. తాలిబన్లు ప్రభుత్వం ఏర్పాటు చేశాక మొదటిసారి మీడియా ముందుకు వచ్చి ముట్టాఖీ మాట్లాడారు. అయితే ఆపద్ధర్మ ప్రభుత్వం ఎంతకాలం ఉంటుందని కానీ, ప్రభుత్వంలో మహిళలకు, మైనారిటీలకు అవకాశం ఇవ్వటం గురించి ఆయన స్పందించలేదు. ఎన్నికల విషయంపై స్పందిస్తూ.. ఇతర దేశాలు అఫ్గానిస్థాన్ అంతర్గత వ్యవహారంలో జోక్యం చేసుకోవద్దని హితవు పలికారు. అమెరికాతో గతేడాది చేసుకున్న ఒప్పందం ప్రకారం.. ఆల్​ఖైదా, ఇతర ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు రద్దు చేసుకుంటామన్నారు.

నేరాలకు పాల్పడటం లేదు..

అఫ్గానిస్తాన్‌లోని పంజ్‌షీర్‌ లోయలో మానవ హక్కుల ఉల్లంఘనలకు పాల్పడుతున్నట్లు వస్తున్న ఆరోపణలను తాలిబన్లు ఖండించారు. పంజ్‌షీర్‌ ప్రావిన్స్‌లో తాలిబన్‌ ఫైటర్లు ఎలాంటి యుద్ధ నేరాలకు పాల్పడలేదని తాలిబన్ల ప్రతినిధి, సమాచార, సాంస్కృతికశాఖ డిప్యూటి మినిస్టర్‌ జబిహుల్లా ముజాహిద్‌ వ్యాఖ్యానించారు.

వస్తున్న ఆరోపణలపై క్షేత్రస్థాయిలో దర్యాప్తునకు మానవ హక్కుల సంస్థలకు అనుమతి ఇస్తామని వెల్లడించారు. కానీ, ఈ అవకాశాన్ని కల్పిత సమాచార వ్యాప్తికి వినియోగించకూడదని షరతు విధించారు. ఈ వ్యవహారంలో నిష్పక్షపాతంగా వ్యవహరించాలని సూచించారు.

మరోవైపు పంజ్‌షీర్‌లోని పలు ప్రాంతాల్లో ఇంకా రెసిస్టెన్స్‌ ఫోర్సెస్‌, తాలిబన్లకు మధ్య భీకర పోరు సాగుతున్నట్లు సమాచారం. ఈ దాడుల్లో ఇరు వర్గాలకు చెందిన అనేక మంది ప్రాణాలు కోల్పోయినట్లు అక్కడి ప్రజలు పేర్కొంటున్నారు. పంజ్‌షీర్‌ను తాలిబన్లు ఆక్రమించిన తర్వాత మారణహోమానికి పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి.

అక్కడి ప్రజలను ఇళ్ల నుంచి వెళ్లగొట్టి ఆ ఆవాసాలను తమ స్థావరాలుగా తాలిబన్లు మార్చుకున్నట్లు పంజ్‌షీర్‌ వాసులు ఆరోపిస్తున్నారు.

ఇదీ చదవండి: ఒకప్పుడు ఖైదీలు.. ఇప్పుడదే జైలుకు బాస్​లు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.