ETV Bharat / international

కరోనా పుట్టింది భారత్​లోనే: చైనా

author img

By

Published : Nov 29, 2020, 2:53 PM IST

Updated : Nov 29, 2020, 3:56 PM IST

అందరూ అనుకుంటున్నట్లు కరోనా వైరస్​ తమ దేశంలో పుట్టలేదని చైనా శాస్త్రవేత్తలు చెబుతున్నారు. కరోనా కేసులను మొదటగా వుహాన్​లో గుర్తించినంత మాత్రాన.. వైరస్​ చైనాలో ఉద్భవించిందని చెప్పలేమని పేర్కొన్నారు. కరోనా జన్యుపరివర్తనంలో స్వల్పంగా మార్పులున్న భారత్ లేదా బంగ్లాదేశ్​లోనే కరోనా మూలాలు ఉండవచ్చని పరిశోధనా పత్రంలో పేర్కొన్నారు.

Chinese scientists claim coronavirus may have originated in India or Bangladesh
'చైనాలో కాదు భారత్​లోనే కరోనా పుట్టింది'

కరోనా వైరస్​ చైనాలోనే పుట్టిందని యావత్​ ప్రపంచం ముక్తకంఠంతో చెబుతున్నా ఆ దేశ శాస్త్రవేత్తలు మాత్రం అంగీకరించడం లేదు. కరోనా కేసులను మొదటగా వుహాన్​లో గుర్తించినంత మాత్రాన.. వైరస్​ చైనాలో ఉద్భవించినట్లు కాదని పేర్కొన్నారు. కరోనా జన్యు పరివర్తనంలో అతి తక్కువ మార్పులు కన్పిస్తున్న ఆసియా దేశాలు భారత్​ లేదా బంగ్లాదేశ్​లోనే కరోనా మూలాలు ఉండొచ్చని చెబుతున్నారు.

ఇందుకు సంబంధించిన పరిశోధనా పత్రాన్ని 'ద అర్లీ క్రిప్టిక్​ ట్రాన్స్​మిషన్​ అండ్​ ఎవల్యూషన్​ ఆఫ్​ సార్స్​ కోవ్​-2 ఇన్ హ్యూమన్​ హోస్ట్స్​' పేరుతో విడుదల చేశారు చైనా శాస్త్రవేత్తలు. ప్రముఖ మెడికల్​ జర్నల్ లాన్సెట్​కు చెందిన​ ప్లాట్​ఫాం 'SSRN.Com' వెబ్​సైట్​ దీన్ని ప్రచురించింది.

దాదాపు 17 దేశాల్లోని కరోనా వైరస్ జన్యుక్రమాలపై పరిశోధనలు జరిపిన అనంతరం ఈ నివేదికను రూపొందించినట్లు చైనా పరిశోధకులు పేర్కొన్నారు. ఫిలోజెనెటిక్​ విశ్లేషణ పద్ధతిలో కరోనా మూలాలపై పరిశోధనలు చేసినట్లు పేర్కొన్నారు.

ఆ దేశాల నుంచే వ్యాప్తి..

ఈ విశ్లేషణ ప్రకారం వుహాన్​లో కరోనా పుట్టలేదని చైనా శాస్త్రవేత్తలు తెలిపారు. భారత్​, బంగ్లాదేశ్​, అమెరికా, ఆస్ట్రేలియా, గ్రీస్, ఇటలీ, చెక్ రిపబ్లిక్​, రష్యా, సెర్బియా దేశాల నుంచే కరోనా వ్యాప్తి మొదలై ఉండవచ్చని అభిప్రాయం వ్యక్తం చేశారు.

వైరస్ జాతి మూలాలను కనుగొనేందుకు సంప్రదాయ పద్ధతి విధానం పనిచేయలేదని ఈ పరిశోధనకు నేతృత్వం వహించిన డా.షెన్ లిబింగ్​ చెప్పారు. చాలా సంవత్సరాల క్రితం నైరుతి చైనాలోని యునాన్లో కనుగొన్న గబ్బిలం వైరస్​ను ఇందుకోసం ఉపయోగించినట్లు వివరించారు.

అంత సులభం కాదు..

ఈ పరిశోధనా పత్రంలోని అంశాలతో చైనా ప్రభుత్వం ఏకీభవిస్తుందా? అని ఆ దేశ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ఝావో లిజియాన్​ను అడగ్గా.. కరోనా వైరస్​ మూలాన్ని కనుగొనడం అత్యంత క్లిష్టతరమని ఆయన బదులిచ్చారు. ప్రపంచ దేశాల శాస్త్రజ్ఞులు పరస్పర సహకారంతో పరిశోధనలు చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు.

ప్రపంచ దేశాలను కకావికలం చేసిన కరోనా వైరస్​ తొలికేసు చైనాలోని వుహాన్ నగరంలో గతేడాది డిసెంబరులో నమోదైంది. ఆ తర్వాత అన్ని దేశాలకు విస్తరించి ఇప్పటివరకు 6కోట్ల 26లక్షల మందికిపైగా సోకింది. దాదాపు 14లక్షల 60వేల మంది ప్రాణాలను బలిగొంది. వైరస్​ మూలాలను కనుగొనేందుకు వుహాన్​లో దర్యాప్తు చేపట్టాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇప్పటికే స్పష్టం చేసింది.

ఇదీ చూడండి: కరోనా టీకా తీసుకోనని తేల్చి చెప్పిన అధ్యక్షుడు

Last Updated : Nov 29, 2020, 3:56 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.