ETV Bharat / international

ఆంక్షల భయంతో బైడెన్​కు చైనా 'చర్చల' వల!

author img

By

Published : Dec 7, 2020, 7:25 PM IST

త్వరలోనే అమెరికా అధ్యక్ష బాధ్యతల్ని చేపట్టనున్న జో బైడెన్​తో మైత్రిని పెంచుకునేందుకు చైనా ప్రయత్నిస్తోంది. ఈ నేపథ్యంలో సమస్యలు పరిష్కరించుకునేందుకు ఇరు దేశాలు త్వరలోనే చర్చలు జరపాలని అభిప్రాయపడ్డారు చైనా విదేశాంగమంత్రి వాంగ్​ యీ. విభేదాలను పక్కన పెట్టి మైత్రిని కొనసాగించేందుకు చైనా ఎప్పుడూ సిద్ధమేనని స్పష్టం చేశారు.

China suggests dialogue with US as Joe Biden likely to take tough stance against Beijing
బైడెన్​ను కాకా పట్టేందుకు చైనా 'చర్చల' పిలుపు

అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్​ ట్రంప్ నాలుగేళ్ల​ పాలనలో విలవిలలాడింది చైనా. వాణిజ్య యుద్ధం నుంచి కరోనా సంక్షోభం వరకు అనేక సందర్భాల్లో చైనాపై కఠినంగా వ్యవహరించారు ట్రంప్​. అయితే ఇంకొన్ని రోజుల్లో ట్రంప్​ ఆ పదవి నుంచి తప్పుకోనున్నారు. అగ్రరాజ్య అధ్యక్ష ఎన్నిక ఎన్నికల విజేత జో బైడెన్​ ఆ పీఠాన్ని అధిరోహించనున్నారు. కానీ చైనా పరిస్థితి మాత్రం మారేలా కనిపించడం లేదు. ఆ దేశంపై బైడెన్​ మరింత కఠినంగా వ్యవహరించి, మరిన్ని ఆంక్షలు విధించే అవకాశముందని ఊహాగానాలు జోరందుకున్నాయి. ఈ క్రమంలో చైనా అప్రమత్తమైంది. జో బైడెన్​తో బంధాన్ని పెంచుకునేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఇందుకోసం చర్చల ప్రతిపాదనను తెరపైకి తెచ్చింది.

అన్ని స్థాయిల్లో అమెరికా-చైనా చర్చలు జరపాలని పిలుపునిచ్చారు చైనా విదేశాంగమంత్రి వాంగ్ యీ. అమెరికా-చైనా వ్యాపార మండలి బోర్డ్​ ఆఫ్​ డైరక్టర్స్​ సమావేశంలో ఈ వ్యాఖ్యలు చేశారు.

"సంప్రదింపులు జరిపేందుకు చైనా ఎప్పుడూ సిద్ధమే. చర్చలు జరపాల్సిన అంశాల జాబితాను రూపొందించవచ్చు. ఒకరికి ఒకరు సహకరించుకుంటూ విభేదాలను పరిష్కరించుకోవచ్చు. దీర్ఘకాల విషయాలు, వ్యూహాత్మక అంశాలపై ఇరుదేశాలు ఎప్పటికప్పుడు అవగాహన పొందేందుకు ఇది ఉపయోగపడుతుంది."

--- వాంగ్​ యీ, చైనా విదేశాంగమంత్రి.

అమెరికా- చైనా మధ్య బంధం బలహీనపడటాన్ని ఎవరూ చూడాలనుకోవడం లేదని, అమెరికాలోని సంఘాలు కూడా ఇదే అనుకుంటున్నాయని పేర్కొన్నారు వాంగ్​. ఇరు దేశాల ప్రజల శ్రేయస్సు కోసం త్వరగా చర్చలు మొదలవ్వాలని అభిప్రాయపడ్డారు.

బైడెన్​ కఠినమే!

చైనాపై ట్రంప్​ అవలంబించిన కఠిన వైఖరిని కొనసాగిస్తానని ఇప్పటికే సంకేతాలిచ్చారు బైడెన్​. ఆ దేశంతో ఇప్పట్లో చర్చలు జరపనని, ట్రంప్​ అమలు చేసిన ఆంక్షలు కూడా ఇప్పట్లో వెనక్కి తీసుకోమని స్పష్టం చేశారు.

ఇదీ చూడండి:- చొచ్చుకొస్తున్న చైనా- సరిహద్దుల్లో గ్రామాలు నిర్మాణం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.