ETV Bharat / international

అమెరికా ఎన్నికల వేళ చైనాలో హైఅలర్ట్

author img

By

Published : Nov 2, 2020, 11:15 AM IST

అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రక్రియ తుది దశకు చేరుకున్న వేళ చైనా అప్రమత్తంగా వ్యవహరిస్తోంది. తుది ఫలితాల తర్వాత రెండు దేశాల మధ్య విభేదాలు తారస్థాయికి చేరుకునే అవకాశం ఉందన్న విశ్లేషణలతో జాగ్రత్త వహిస్తోంది. ఎన్నికల్లో చైనా జోక్యం, కరోనా మహమ్మారి వంటి అంశాలతో ఆ దేశానికి ఇబ్బందులు తలెత్తుతాయని విశ్లేషకులు భావిస్తున్నారు.

us china
అమెరికా చైనా

అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రక్రియ చరమాంకానికి చేరుకున్న వేళ చైనా అప్రమత్తమైంది. ఇరు దేశాల మధ్య విభేదాలు పెరిగే అవకాశం ఉందన్న నివేదికలతో ఈ మేరకు జాగ్రత్త వహిస్తోంది.

రెండు దేశాల మధ్య కొంత కాలంగా సంబంధాలు అత్యంత బలహీనపడ్డాయి. తీవ్ర అనిశ్చితి నెలకొంది. ఇది ప్రమాదకర పరిస్థితులకు దారితీసే అవకాశం ఉందని చైనా కమ్యూనిస్టు పార్టీ (సీపీసీ) అంతర్గత పరిశీలకులు హెచ్చరించారు. అయితే, చైనా మాత్రం ఇరు దేశాల మధ్య ఘర్షణ, సైనిక చర్యను నివారించడానికే ప్రాముఖ్యం ఇస్తుందంటూ సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్​కు చెందిన జియాంగ్​తావో వ్యాసం రాశారు.

"అమెరికా ఎన్నికల తుది ఫలితాలు ఆ దేశంలో సుదీర్ఘ రాజ్యాంగ సంక్షోభానికి దారితీయొచ్చు. కొత్త అధ్యక్షుడు బాధ్యతలు స్వీకరించే వరకు రెండు దేశాల మధ్య మరింత అనిశ్చితి పెరుగుతుంది. ఇది అమెరికా-చైనా ద్వైపాక్షిక సంబంధాలకు ప్రమాదకర కాలం. అలా జరిగితే అంతర్జాతీయంగా గందరగోళం, హింసకు కారణమవుతాయి. ముఖ్యంగా అధ్యక్షుడు ట్రంప్ వైఖరితో మరింత ప్రమాదకరంగా మారే అవకాశం కనిపిస్తోంది" అని ఓ చైనా ప్రభుత్వ సలహాదారు అభిప్రాయపడినట్లు జియాంగ్​తావో వెల్లడించారు.

చైనా అంశంపైనే చర్చ..

అధ్యక్ష అభ్యర్థుల రెండో డిబేట్​లోనూ చైనా వ్యవహారాన్ని కీలకంగా ప్రస్తావించారు. అందులో చైనా అధ్యక్షుడు షీ జిన్​పింగ్​ను 'ప్రమాదకారి'గా డెమొక్రటిక్ అభ్యర్థి అభివర్ణించారు. రష్యా, ఉత్తర కొరియాతో ట్రంప్ సన్నిహితంగా ఉన్నారని ఆరోపించారు. అయితే, బైడెన్​కు​ చైనాతో వ్యక్తిగత విరోధం లేనప్పటికీ.. ఇటీవలి కాలంలో ఆయన పూర్తి వ్యతిరేకంగా ఉన్నారని జియాంగ్​తావో విశ్లేషించారు. అమెరికా ప్రజాస్వామ్య వ్యవస్థకు చైనాతో దీర్ఘకాల ముప్పు ఉందని ఆయన అభిప్రాయపడుతున్నారని తెలిపారు.

బైడెన్​ గెలిస్తే..

బైడెన్​ తక్కువ మెజారిటీతో గెలిస్తే అమెరికా-చైనా సంబంధాలకు ప్రమాదం ఎక్కువ అని అమెరికా కేంద్రంగా పనిచేసే పరిశీలకుడు డెంగ్ యువెన్ అభిప్రాయపడ్డారు. ఎన్నికల్లో తన ఓటమికి చైనానే కారణమని ట్రంప్ ఆరోపించే అవకాశం ఉందన్నారు. ఎందుకంటే, కరోనా వైరస్ సంక్షోభం లేకపోతే కచ్చితంగా ట్రంప్ గెలిచేవారని ఆయన తెలిపారు. వైరస్ విపత్తుతో పరిస్థితులు పూర్తిగా తారుమారు అయ్యాయని పేర్కొన్నారు.

అమెరికా, చైనా మధ్య కొంత కాలంలో అనేక అంశాల్లో విభేదాలు తలెత్తాయి. హాంకాంగ్​లో జాతీయ భద్రత చట్టాన్ని ప్రవేశపెట్టడం, షిన్​జియాంగ్​లో మానవ హక్కుల ఉల్లంఘన, దక్షిణ చైనా సముద్రంలో దూకుడుపై అమెరికా తీవ్రంగా విమర్శిస్తోంది.

ఇదీ చూడండి: ఎన్నికలపై న్యాయపోరాటానికి ట్రంప్ సిద్ధం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.