ETV Bharat / international

'అమెరికా ఆరోపణలు తప్పు.. మా వద్ద అన్ని అణ్వాయుధాలు లేవు!'

author img

By

Published : Jan 4, 2022, 5:22 PM IST

China nuclear weapons: అణ్వాయుధాల అభివృద్ధి విషయంలో తమపై అమెరికా చేసిన ఆరోపణలు అసత్యమని చైనా స్పష్టం చేసింది. తమ అణు సంపద దేశ భద్రతకు అవసరమైన స్థాయిలోనే ఉందని పేర్కొంది. మరోవైపు, అణు యుద్ధాల నివారణపై భద్రతా మండలి శాశ్వత సభ్య దేశాల ఉమ్మడి ప్రకటన విషయంలో చైనా కీలక పాత్ర పోషించిందని తెలిపింది.

CHINA NUclear
CHINA NUclear

China nuclear weapons: అణ్వాయుధాలను వేగంగా అభివృద్ధి చేస్తోందంటూ చైనాపై అమెరికా చేసిన ఆరోపణలను బీజింగ్ ఖండించింది. ఈ వ్యాఖ్యలు పూర్తిగా అవాస్తవమని పేర్కొంది. తన అణు సంపదను.. దేశ భద్రతకు, అంతర్జాతీయ సుస్థిరతకు అవసరమైన స్థాయిలోనే ఉంచుకున్నట్లు తెలిపింది. అణు యుద్ధాలు జరగకుండా చూస్తామని భద్రతా మండలిలోని ఐదు సభ్య దేశాలు(పీ5) అంగీకారానికి రావడం చైనా వల్లే సాధ్యమైందని చెప్పుకొచ్చింది. ఆయుధ పోటీ ఉండకుండా తొలి ప్రకటన వెలువడే విషయంలో చైనా కీలకంగా వ్యవహరించిందని కితాబిచ్చుకుంది.

China on Nuclear war statement

"చైనా తన అణు సామర్థ్యాన్ని నాటకీయంగా పెంచుకుంటోందని అమెరికా అధికారులు చేసిన వ్యాఖ్యలు అవాస్తవం. అణ్వాయుధాలపై చైనా విధానం స్థిరంగానే ఉంది. తొలుత వినియోగించకూడదనే రక్షణాత్మక ధోరణినే చైనా పాటిస్తోంది. ఐరాస పీ5 దేశాల సంయుక్త ప్రకటనకు చైనా విశేషంగా దోహదం చేసింది. ఈ విషయంలో మిగిలిన సభ్యదేశాలు చర్యలు తీసుకుంటాయని చైనా ఆశిస్తోంది."

--ఫూ కాంగ్, చైనా విదేశాంగ శాఖ ఆయుధ విభాగం డైరెక్టర్ జనరల్

UNSC permanent members: ఐరాస భద్రతా మండలిలోని ఇతర శాశ్వత సభ్య దేశాలు సైతం 'నో ఫస్ట్ యూజ్' విధానాన్ని అవలంబించాలని ఫూ పిలుపునిచ్చారు. అంతర్జాతీయ సుస్థిరతను కాపాడేందుకు కట్టుబడి ఉన్నామన్న విషయాన్ని పీ5 దేశాల ప్రతిజ్ఞతో స్పష్టమైందని చెప్పారు. ఈ సంయుక్త ప్రకటనను తొలి అడుగుగా భావించి.. పరస్పరం విశ్వాసం పెంపొందించుకోవాలని అన్నారు.

చైనా వేగంగా అణ్వాయుధాలను అభివృద్ధి చేసుకుంటోందని అమెరికా రక్షణ శాఖ గతేడాది నవంబర్​లో విడుదల చేసిన నివేదికలో పేర్కొంది. ముందుగా ఊహించిన దానికంటే ఎక్కువగా ఆయుధాలను తయారు చేస్తోందని తెలిపింది. 2030 నాటికి వెయ్యి అణు వార్​హెడ్లు సిద్ధం చేసుకునే అవకాశం ఉందని అంచనా వేసింది.

అణు యుద్ధాలు నిలిపివేస్తాం...!

P5 countries nuclear war: అణు యుద్ధాలను నిరోధించాలని, అణ్వస్త్రాలను ఏ దేశంపైనా మోహరించకూడదని, పోటాపోటీగా ఆయుధాలను సమకూర్చుకోవడానికి స్వస్తి పలకాలని అణ్వస్త్ర దేశాలైన అమెరికా, చైనా, రష్యా, బ్రిటన్‌, ఫ్రాన్స్‌ సోమవారం విడుదల చేసిన సంయుక్త ప్రకటనలో పిలుపునిచ్చాయి. అణ్వాయుధ దేశాల మధ్య యుద్ధాన్ని నివారించడం, వ్యూహాత్మక ప్రమాదాలను తగ్గించడం తమ ప్రథమ కర్తవ్యాలని ఉద్ఘాటించాయి. అణు యుద్ధంలో గెలవలేమని, అది ఎప్పటికీ రాకూడదని పేర్కొన్నాయి. అణ్వస్త్రాలు కేవలం రక్షణ ప్రయోజనాలను అందించాలని, దూకుడు స్వభావానికి కళ్లెం వేయడానికి, యుద్ధాన్ని నివారించడానికి మాత్రమే వాటిని వినియోగించాలని పిలుపునిచ్చాయి.

ఇదీ చదవండి: కొండచరియలు విరిగిపడి 14మంది మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.