వాయు కాలుష్యంతో ఊపిరితిత్తులు విలవిల- పెరుగుతున్న క్యాన్సర్‌

author img

By

Published : Dec 5, 2021, 7:22 AM IST

AIR POLLUTION LUNG CANCER

Air pollution Lung cancer: వాయు కాలుష్యం వల్ల లంగ్ అడినోకార్సినోమా(ఎల్ఏడీసీ) అనే ఊపిరితిత్తుల వ్యాధి పెరిగిపోతున్నట్లు తాజా పరిశోధనలో వెల్లడైంది. వాతావరణంలోని మసి రేణువులు క్యూబిక్‌ మీటరుకు 0.1 మైక్రోగ్రాముల మేర పెరిగితే ఎల్​ఏడీసీ 12 శాతం పెరుగుతుందని తేలింది.

Air pollution Lung cancer: వాయు కాలుష్యం ధాటికి ఊపిరితిత్తులు విలవిలలాడుతున్నాయి. ఈ అవయవంలో క్యాన్సర్లకు కారణమవుతోంది. గాల్లోని మసి రేణువుల వల్ల ప్రధానంగా ఈ పరిస్థితి తలెత్తుతున్నట్లు అంతర్జాతీయ శాస్త్రవేత్తల పరిశోధనలో వెల్లడైంది. ప్రపంచవ్యాప్తంగా వాయు కాలుష్యం వల్ల లంగ్‌ అడినోకార్సినోమా (ఎల్‌ఏడీసీ) అనే ఊపిరితిత్తుల క్యాన్సర్‌ కేసులు పెరిగిపోతున్నట్లు తేలింది. అదే సమయంలో పొగాకు వినియోగం తగ్గడం వల్ల లంగ్‌ స్క్వామస్‌ సెల్‌ కార్సినోమా (ఎల్‌ఎస్‌సీసీ) అనే మరో క్యాన్సర్‌ ఉద్ధృతి తగ్గుతున్నట్లు వెల్లడైంది. వాయు కాలుష్యాన్ని, ధూమపానాన్ని తక్షణం తగ్గించాల్సిన అవసరాన్ని ఇది సూచిస్తోంది.

Air pollution lung cancer new study

గత కొన్ని దశాబ్దాల్లో మహిళలు, పొగ తాగనివారిలో అనేక మంది కూడా ఊపిరితిత్తుల క్యాన్సర్‌ బారినపడటం పరిశోధకులను విస్మయానికి గురిచేస్తోంది. దీని వెనుక కారణాలను గుర్తించాల్సిన అవసరం ఏర్పడింది. ఈ నేపథ్యంలో సింగపూర్‌లోని నాన్యాంగ్‌ టెక్నోలాజికల్‌ యూనివర్సిటీ (ఎన్‌టీయూ), చైనీస్‌ యూనివర్సిటీ ఆఫ్‌ హాంకాంగ్‌ పరిశోధకులు దీనిపై పరిశోధన చేశారు. ఇందులో భాగంగా..

  • ఊపిరితిత్తుల క్యాన్సర్లకు సంబంధించి 1990 నుంచి 2012 వరకూ ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) డేటాను విశ్లేషించారు.
  • వాషింగ్టన్‌ విశ్వవిద్యాలయంలోని ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ హెల్త్‌ మెట్రిక్స్‌ అండ్‌ ఎవాల్యుయేషన్‌ సంస్థ నుంచి 1980 నుంచి 2012 వరకూ ధూమపాన వివరాలను సేకరించారు.
  • కాలుష్యానికి సంబంధించిన వివరాలను అమెరికా అంతరిక్ష సంస్థ ‘నాసా’ నుంచి కూడా తీసుకున్నారు. ప్రధానంగా మసి, సల్ఫేట్‌, పీఎం 2.5 రేణువులను విశ్లేషించారు.

Air pollution lung cancer study findings

  • వాతావరణంలో మసి రేణువులు క్యూబిక్‌ మీటరుకు 0.1 మైక్రోగ్రాముల మేర పెరిగితే ఎల్‌ఏడీసీ 12 శాతం పెరుగుతుంది. మసి రేణువులు.. పీఎం 2.5 కన్నా చిన్నగా ఉంటాయి.
  • 1990 నుంచి 2012 మధ్య ఈ రేణువులు ఏటా చదరపు మీటరుకు 3.6 మైక్రోగ్రాముల మేర పెరిగాయి.
  • ధూమపానం ఒక్క శాతం తగ్గినా ఎల్‌ఎస్‌సీసీ 9 శాతం మేర తగ్గుతోంది.
  • ప్రపంచవ్యాప్తంగా పొగరాయుళ్ల సంఖ్య ఏటా 0.26 శాతం మేర తగ్గింది. 1990- 2012 మధ్యకాలంతో పోలిస్తే ఇది దాదాపు 6 శాతం తక్కువ.

ఏమిటీ క్యాన్సర్లు?

AIR POLLUTION LUNG CANCER
.

ప్రపంచవ్యాప్తంగా క్యాన్సర్‌ మరణాల్లో ఊపిరితిత్తుల క్యాన్సర్‌ వాటా ఎక్కువగా ఉంది. ఈ వ్యాధితో 2020లో 18 లక్షల మంది చనిపోయారు.

  • లంగ్‌ అడినోకార్సినోమాకు జన్యు, పర్యావరణ, జీవనశైలి అంశాలు కారణాలుగా ఇప్పటికే పరిశోధనల్లో వెల్లడైంది.
  • లంగ్‌ స్క్వామస్‌ సెల్‌ కార్సినోమా మాత్రం చాలా వరకూ ధూమపానం వల్లే వస్తోంది.

భిన్నరకాలుగా..

ఊపిరితిత్తుల క్యాన్సర్లు, మసి రేణువుల మధ్య సంబంధం స్త్రీ, పురుషుల్లో భిన్నంగా ఉంది. ఉదాహరణకు.. మగవారితో పోలిస్తే ఆడవారిలో ఈ సంబంధం స్పష్టంగా కనిపిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఏటా క్యూబిక్‌ మీటరుకు 0.1 మైక్రోగ్రాముల మేర మసి రేణువులు పెరిగితే మహిళల్లో ఎల్‌ఏడీసీ 14 శాతం మేర పెరుగుతున్నట్లు వెల్లడైంది. పురుషుల్లో అది 9 శాతమే పెరుగుతోంది. ఎల్‌ఎస్‌సీసీ విషయానికొస్తే కాలుష్యకారకం ఇదే స్థాయిలో పెరిగితే ఆడవారిలో ఈ రకం క్యాన్సర్‌ ఉద్ధృతి 14 శాతం మేర పెరుగుతున్నట్లు తేలింది. మగవారిలో ఆ పెరుగుదల 8%గా ఉంది.

  • ఎల్‌ఎస్‌సీసీ తగ్గుదల పురుషుల్లోనే ఎక్కువగా ఉంది. పొగాకు వినియోగంలో తగ్గుదలకు అనుగుణంగా ఇది ఉంది.
  • ఆసియాలో వాయు కాలుష్యం ఎక్కువగా ఉంది. ఇక్కడ మసి రేణువులు ఏటా 11.9 మైక్రోగ్రాముల మేర, సల్ఫేట్‌ 35.4 మైక్రోగ్రాముల మేర పెరిగినట్లు వెల్లడైంది.

ఎందుకు?

  • విద్యుదుత్పత్తి, రవాణా కోసం శిలాజ ఇంధనాలను మండించడం వల్ల వాయు కాలుష్యం పెరుగుతోంది.
  • కార్బన్‌ డైఆక్సైడ్‌ ఉద్గారాలను పెంచడం ద్వారా ఇది వాతావరణ మార్పులనూ తీవ్రం చేస్తోంది. దీనివల్ల భూతాపం కూడా పెరుగుతోంది.

ఇదీ చదవండి: నచ్చిన సంగీతం వింటే మెదడుకు ఎంతో హాయి!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.