ETV Bharat / international

పారిపోతున్న 'గే'పై తాలిబన్ల క్రూరత్వం- రేప్​ చేసి మరీ...

author img

By

Published : Aug 31, 2021, 5:06 PM IST

తాలిబన్ల అరాచకాలు హద్దుమీరుతున్నాయి. మహిళల హక్కులపై ఉక్కుపాదం మోపుతున్న ఈ ముఠా.. ఇప్పుడు స్వలింగ సంపర్కులను వెంటాడుతోంది. తాజాగా ఎల్​జీబీటీ వర్గానికి చెందిన ఓ వ్యక్తిపై తాలిబన్లు దాడికి పాల్పడ్డారు. అంతటితో ఆగకుండా అత్యాచారానికి ఒడిగట్టారు. దీంతో అక్కడి స్వలింగ సంపర్కులు హడలెత్తిపోతున్నారు.

taliban atrocities
తాలిబన్ గే అత్యాచారం

స్వలింగ సంపర్కుడిపై తాలిబన్లు తమ కర్కశత్వాన్ని(taliban atrocities) ప్రదర్శించారు. దాడి చేసి.. విచక్షణారహితంగా కొట్టారు. అంతేగాక, ఆ వ్యక్తిపై అత్యాచారానికి ఒడిగట్టి(taliban rape gay man) తమ పైశాచికత్వాన్ని చాటుకున్నారు. ఆ వ్యక్తి చేసిన పొరపాటల్లా.. దేశాన్ని విడిచి వెళ్లేందుకు ప్రయత్నించడమే!

ఇదీ జరిగింది...

హనాన్(వ్యక్తిగత గోప్యత కోసం పేరు మార్చాం) అనే వ్యక్తి అఫ్గాన్ నుంచి బయటకు వెళ్లేందుకు ఒకరి సహాయం కోరారు. సామాజిక మాధ్యమాల ద్వారా అతనితో మాట్లాడారు. తనకు సహాయం చేసే వ్యక్తిని కలవడానికి ముందు మూడు వారాల పాటు సామాజిక మాధ్యమాల్లోనే సంప్రదింపులు చేశారు. అయితే, ఆ వ్యక్తి తాలిబన్ మనిషేనని తెలుకోలేకపోయారు హనాన్. ఈ క్రమంలోనే ఇద్దరు తాలిబన్లు హనాన్​పై దాడికి తెగబడి.. రేప్ చేశారు.

ఈ ఘటనపై అఫ్గాన్​కు చెందిన ఎల్​జీబీటీ హక్కుల ఉద్యమకారుడు ఆర్టెమిస్ అక్బరీ తీవ్రంగా మండిపడ్డారు. ప్రస్తుతం టర్కీలో తలదాచుకుంటున్న ఆయన.. కొత్త పాలన అందిస్తామన్న తాలిబన్ల హామీలు నీటిపై రాతలేనని స్పష్టమవుతోందని ధ్వజమెత్తారు.

"గత తాలిబన్ ప్రభుత్వంతో పోలిస్తే మరింత ఓర్పుగా ప్రస్తుత పాలన ఉంటుందని తాలిబన్లు చెబుతున్న మాట అవాస్తవం. స్వలింగ సంపర్కులను గుర్తించేందుకు సామాజిక మాధ్యమాలు తాలిబన్లకు బాగా ఉపయోగపడుతున్నాయి. వారు సామాజిక మాధ్యమాల్లో ఖాతా తెరిచి ఎల్​జీబీటీ వ్యక్తులకు గాలం వేస్తున్నారు. స్వలింగ సంపర్కులమంటూ తమను తాము పరిచయం చేసుకుంటున్నారు. ఇలాగే.. హనాన్​ను పరిచయం చేసుకొని దాడికి పాల్పడ్డారు. స్వలింగ సంపర్కుడన్న విషయాన్ని వాళ్ల ఇంట్లో వారికి చెబుతామని బెదిరించారు."

-ఆర్టెమిస్ అక్బరీ, ఎల్​జీబీటీ హక్కుల ఉద్యమకారుడు

అఫ్గానిస్థాన్​లోని అనేక మంది స్వలింగ సంపర్కులు(lgbt community afghanistan) దేశం విడిచి వచ్చేందుకు ప్రయత్నిస్తున్నారని అక్బరీ తెలిపారు. తాలిబన్ల క్రూరత్వాన్ని చూసి హడలెత్తిపోతున్నారని చెప్పారు.

ఎరేసి.. వలేసి..

స్వలింగ సంపర్కుల పట్ల తాలిబన్లు వ్యవహరించే తీరును పూసగుచ్చినట్లు వివరించారు అఫ్గాన్​లోని ఎల్​జీబీటీ కమ్యూనిటీకి చెందిన రచయిత నీమత్ సదాత్.

"స్వలింగ సంపర్కులు.. పంటలో కలుపు మొక్కలని తాలిబన్లు భావిస్తారు. వారిని ఏరివేయాలని లక్ష్యంగా పెట్టుకుంటారు. 'ఎరవేయడం, చంపడం, శవాన్ని ఛిద్రం చేయడం'... ఇది వారు స్వలింగ సంపర్కుల పట్ల వ్యవహరించే విధానం. ముందుగా ఇలాంటి వ్యక్తులను ఆన్​లైన్ మాధ్యమాలు, బహిరంగ ప్రదేశాల్లో ఎరవేసి పట్టుకుంటారు. ఏకాంత ప్రదేశాలకు వీరిని తీసుకెళ్లి హతమార్చుతారు. వారి శరీరాలను నాశనం చేస్తారు."

-నీమత్ సదాత్, రచయిత

మరోవైపు, రెయిన్​బో రైల్​రోడ్ అనే చారిటీ.. అఫ్గాన్ నుంచి బయటకు రావాలనుకుంటున్న స్వలింగ సంపర్కులకు సాయం చేస్తోంది. దాదాపు 200 మంది దేశాన్ని విడిచిపెట్టాలని భావిస్తున్నట్లు తెలిపింది. ఈ కమ్యూనిటీని తాలిబన్లు లక్ష్యంగా చేసుకున్నారని ఆందోళన వ్యక్తం చేసింది. కొందరిని చంపేశారని వెల్లడించింది.

ఇదీ చదవండి: అఫ్గాన్​ భవితవ్యాన్ని తేల్చేది ఈ 10 ప్రశ్నలే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.