ETV Bharat / international

కరోనా ముగింపు దశ ఎలా ఉంటుంది?

author img

By

Published : Jan 4, 2022, 10:17 AM IST

When will covid end: కరోనా వైరస్‌ను పూర్తిగా నిర్మూలించడం సాధ్యం కాదని, అది ఎప్పటికీ జనబాహుళ్యంలోనే ఉంటుందని, దానితో కలిసి మనుగడ సాగించడాన్ని ప్రపంచం నేర్చుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. అయితే.. ఏదో ఒక దశలో చెప్పుకోదగ్గ సంఖ్యలో దేశాలు.. కొవిడ్‌ కేసులను గణనీయ స్థాయిలో తగ్గించుకోగలిగితే మహమ్మారి (ప్యాండెమిక్‌)కి అధికారికంగా ముగింపు పడిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటిస్తుంది.

When will covid end:
కరోనా ముగింపు దశ ఎలా ఉంటుంది?

When will covid end: ప్రపంచాన్ని కుదిపేసే మహమ్మారులకు ముగింపు ఉంటుంది. అదేరీతిలో కొవిడ్‌-19 పీడ కూడా ఎప్పుడు విరగడవుతుందా అని ప్రజలు ఆశగా ఎదురుచూస్తున్నారు. దీని ముగింపుపై విశ్లేషణలను ఒమిక్రాన్‌ వేరియంట్‌ సంక్లిష్టం చేస్తోంది. అయితే స్విచ్‌ ఆఫ్‌ చేస్తే విద్యుత్‌ దీపం ఆగిపోయినట్లుగా ఈ వ్యాధి కనుమరుగు కాదని నిపుణులు చెబుతున్నారు. కరోనా వైరస్‌ను పూర్తిగా నిర్మూలించడం సాధ్యం కాదని, అది ఎప్పటికీ జనబాహుళ్యంలోనే ఉంటుందని, దానితో కలిసి మనుగడ సాగించడాన్ని ప్రపంచం నేర్చుకోవాలని సూచిస్తున్నారు. కొవిడ్‌ అవసాన దశపై పరిశోధకుల అభిప్రాయం ఇదీ.. అత్యంత ఎక్కువ సాంక్రమిక శక్తి కలిగిన ఒమిక్రాన్‌ వల్ల కొవిడ్‌ కేసులు బాగా పెరుగుతున్నాయి. దీని వ్యాప్తిని అడ్డుకోవడానికి శ్రమించాల్సి వస్తోంది. ఈసారి పరిస్థితి ఒకింత మెరుగ్గా ఉంది. తీవ్రస్థాయి వ్యాధి బారినపడకుండా చాలావరకూ టీకాలు కాపాడుతున్నాయి. దీనికితోడు.. మునుపటి వేరియంట్లతో పోలిస్తే ఒమిక్రాన్‌ ఒకింత తక్కువ ప్రమాదకరంగా ఉంది. కరోనాకు చరమగీతం పాడే విషయంపై శ్రద్ధ పెట్టకుంటే కొత్త వేరియంట్లు రాక తప్పదని ఒమిక్రాన్‌ రుజువు చేస్తోందని యేల్‌ స్కూల్‌ ఆఫ్‌ పబ్లిక్‌ హెల్త్‌లో అంటువ్యాధుల విభాగం నిపుణుడు ఆల్బర్ట్‌ కో తెలిపారు.

అమెరికా ముందడుగు..

కొవిడ్‌ తీరుపై వాస్తవాలను గుర్తించిన అమెరికా.. ఈ దిశగా చర్యలకు నడుం బిగించింది. సమాజానికి, ఆర్థిక వ్యవస్థకు ఇబ్బందులు కలిగించని రీతిలో వైరస్‌కు కళ్లెం వేయాలని తలపోస్తోంది. లాక్‌డౌన్‌లు అవసరం లేకుండా ఒమిక్రాన్‌ కట్టడికి బూస్టర్‌ టీకాలు, కొత్త చికిత్సల వంటివి అందుబాటులో ఉన్నాయని చెబుతోంది. నిబంధనలనూ సడలిస్తోంది. కొవిడ్‌ సోకినవారు ఐసోలేషన్‌లో ఉండాల్సిన సమయాన్ని ఐదు రోజులకు తగ్గిస్తున్నట్లు సెంటర్స్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌ అండ్‌ ప్రివెన్షన్‌ ఇప్పటికే ప్రకటించింది.

ముగింపు ఇలా..

Worldwide covid situation: ఏదో ఒక దశలో చెప్పుకోదగ్గ సంఖ్యలో దేశాలు.. కొవిడ్‌ కేసులను గణనీయ స్థాయిలో తగ్గించుకోగలిగితే మహమ్మారి (ప్యాండెమిక్‌)కి అధికారికంగా ముగింపు పడిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటిస్తుంది. ఆ స్థాయికి చేరుకున్నా.. సరిపడా టీకాలు, చికిత్స మార్గాలు అందుబాబులో లేని అల్పాదాయ దేశాల్లో ఇక్కట్లు తప్పవు. మిగతా దేశాల్లో మాత్రం కొవిడ్‌.. 'ఎండెమిక్‌' దశకు చేరుకుంటుంది. అయితే ఈ రెండు దశల మధ్య తేడాలు ఒకింత అస్పష్టంగానే ఉంటున్నాయని హార్వర్డ్‌ టి.హెచ్‌.చాన్‌ స్కూల్‌ ఆఫ్‌ పబ్లిక్‌ హెల్త్‌కు చెందిన స్టీఫెన్‌ కిస్లర్‌ తెలిపారు. కొవిడ్‌ను ఎదుర్కొనే విషయంలో 'ఆమోదయోగ్య స్థిర దశ'కు చేరుకోవడాన్ని ఎండెమిక్‌ దశగా ఆయన అభివర్ణించారు. అయితే 'ఫ్లూ తరహా ఎండెమిక్‌ దశ'కు కొవిడ్‌ ఎప్పటికీ చేరుకోకపోవచ్చని పేర్కొన్నారు. భవిష్యత్‌లో కొవిడ్‌తో అనారోగ్యం, మరణాలు ఏ స్థాయిలో ఉంటాయన్నదానిపై అస్పష్టత ఉంది. కొవిడ్‌కు ముందు నాటి దశకు చేరుకోవడం మాత్రం సాధ్యం కాదని జాన్స్‌ హాప్కిన్స్‌ సెంటర్‌ ఫర్‌ హెల్త్‌ సెక్యూరిటీ అమీష్‌ అడలీజా పేర్కొన్నారు.

భవిష్యత్‌లో ఇలా ఉండొచ్చు..

మహమ్మారి దశ ముగిశాక కరోనా వైరస్‌ వల్ల కొందరిలో జలుబు తలెత్తవచ్చు. మరికొందరిలో ఇది తీవ్ర అనారోగ్యం కలిగించొచ్చు. ఆయా వ్యక్తుల ఆరోగ్యం, టీకా వేయించుకున్నారా.. లేదా, గతంలో ఈ ఇన్‌ఫెక్షన్‌ బారినపడ్డారా వంటి అంశాలపై ఇది ఆధారపడి ఉంటుంది.

వైరస్‌లో ఉత్పరివర్తనలు కొనసాగుతూనే ఉంటాయి. వాటిని ఎదుర్కొనేలా తీర్చిదిద్దిన టీకా బూస్టర్‌ డోసులను తరచూ పొందాల్సిందే.

కరోనాను గుర్తించి, దాన్ని ఎదుర్కోవడంలో మానవ రోగ నిరోధక వ్యవస్థలు క్రమంగా మెరుగుపడుతుంటాయి. ఈ క్రమంలో బహుళ అంచెల రక్షణ వ్యవస్థలు ఏర్పడొచ్చు. ఈ అంచెల్లో మెమరీ బి కణాలు కూడా ఉన్నాయి. అవసరమైతే ఇవి రంగంలోకి దిగి మరిన్ని యాంటీబాడీలను ఉత్పత్తి చేస్తాయి.

కొన్ని టీకాలు 'టి హెల్పర్‌' కణాలను పెంచుతాయని పరిశోధనలో తేలింది. ఇవి మరింత బలమైన, వైవిధ్యంతో కూడిన యాంటీబాడీలను ఉత్పత్తి చేస్తాయి. వైరస్‌ ఉత్పరివర్తన చెందినా ఇవి పనిచేసే వీలుంది.

ఇప్పటికే సరాసరిన జనాభాలో రోగనిరోధక శక్తి పెరిగింది. అందువల్ల టీకాలు వేయించుకున్నవారిలో ఇన్‌ఫెక్షన్లు వచ్చినా.. అవి తీవ్ర రూపం దాల్చడం, ఆసుపత్రిపాలు కావడం, మరణాల బారినపడటం తగ్గుతుంది. కొత్త వేరియంట్‌ వచ్చినా ఇదే పరిస్థితి కొనసాగొచ్చు.

భవిష్యత్‌లో.. కరోనా బారినపడినవారు 2-3 రోజుల పాటు ఇంటికి పరిమితమై, ఆ తర్వాత తమ పనులను యథావిధిగా కొనసాగిస్తారు. కరోనాకు ముగింపు దశ ఇలా ఉండొచ్చు.

ఇదీ చూడండి:- ఒమిక్రాన్.. నేచురల్ వ్యాక్సినా? సోకితే మంచిదేనా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.