ETV Bharat / international

దుష్ప్రభావాలు లేకుంటే టీకా పనిచేయనట్లేనా..?

author img

By

Published : Jun 11, 2021, 12:44 PM IST

కరోనా టీకా తీసుకున్న తర్వాత దుష్ప్రభావాలు లేకున్నా.. వ్యాక్సిన్​ (covid vaccine) పని చేస్తున్నట్లేనని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. వ్యాక్సిన్​ అందుకున్న తర్వాత తలెత్తే లక్షణాలు.. రోగనిరోధక వ్యవస్థ క్రియాశీలం కావడానికి సంబంధించిన సంకేతాలేనని తెలిపారు. అయితే అన్ని రకాల దుష్ప్రభావాలు సాధారణమేమీ కాదని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.

COVID-19 vaccines side effects
కరోనా వ్యాక్సిన్​ దుష్ప్రభావాలు

ప్రపంచవ్యాప్తంగా కొవిడ్‌ టీకాల(Covid Vaccine) వల్ల కొద్దిమందిలో తలెత్తుతున్న దుష్ప్రభావాలు చర్చనీయాంశమవుతున్నాయి. అయితే వ్యాక్సిన్‌ పొందాక ఒకటి రెండు రోజుల పాటు తలెత్తే లక్షణాలు.. రోగనిరోధక వ్యవస్థ క్రియాశీలం కావడానికి సంబంధించిన సంకేతాలేనని, ఇవి మామూలేనని నిపుణులు పేర్కొన్నారు. వ్యాక్సిన్‌ పొందాక ఒకరోజుపాటు శారీరక శ్రమ ఎక్కువగా ఉండే పనులు చేపట్టవద్దని నిపుణులు సూచిస్తున్నారు.

వ్యాక్సినేషన్‌ తర్వాత ఏం జరుగుతుంది?

మన రోగ నిరోధక వ్యవస్థలో రెండు విభాగాలు ఉన్నాయి. ఇందులో మొదటిది.. శరీరంలోకి బ్యాక్టీరియా, వైరస్‌ వంటివి చొరబడినప్పుడు వెంటనే గుర్తిస్తుంది. అనంతరం ఆ ప్రాంతాన్ని తెల్లరక్త కణాలు చుట్టుముడతాయి. ఫలితంగా ఇన్‌ఫ్లమేషన్‌ తలెత్తుతుంది. చలి, అలసట వంటి లక్షణాలు దీనివల్లే ఏర్పడుతుంటాయి. టీకా ఇచ్చాక ఇదే ప్రక్రియ జరుగుతుంది. రోగనిరోధక వ్యవస్థలోని ఈ సత్వర స్పందన లక్షణం.. వయసు పెరిగేకొద్దీ తగ్గిపోతుంటుంది. అందువల్లే వృద్ధులతో పోలిస్తే యువతలోనే ఇలాంటి లక్షణాలు ఎక్కువగా కనిపిస్తుంటాయి. కొన్ని రకాల టీకాలతో ఈ స్పందన మరింత ఎక్కువగా ఉండొచ్చు.

అలాగే స్పందన విషయంలో వ్యక్తుల మధ్య కూడా వైరుధ్యం ఉంటుంది. కొందరిలో ఇలాంటి లక్షణాలేవీ కనిపించకపోవచ్చు. దాన్నిబట్టి టీకా పనిచేయడంలేదన్న ఆపోహ చెందనవసరం లేదని శాస్త్రవేత్తలు తెలిపారు. శరీరంలో ఈ మొదటి అంచె ప్రక్రియ జరుగుతుండగానే.. రోగనిరోధక వ్యవస్థలోని రెండో భాగం తన పని తాను చేసుకుపోతుంది. వైరస్‌ నుంచి అసలైన రక్షణ కల్పించేది ఈ వ్యవస్థే. అది వైరస్‌ను నిర్వీర్యం చేసే యాంటీబాడీలను ఉత్పత్తి చేస్తుంది. రోగ నిరోధక వ్యవస్థ క్రియాశీలమైనప్పుడు కొన్ని సందర్భాల్లో అది తాత్కాలికంగా లింఫ్‌ నోడ్‌లలో వాపును కలిగించొచ్చు. అందువల్ల సాధారణ మామోగ్రామ్‌ పరీక్షలు చేయించుకోవాలనుకుంటున్న మహిళలు.. కొవిడ్‌-19 టీకాకు ముందే వీటిని చేయించుకోవాలని నిపుణులు సూచించారు. లేకుంటే టీకా వల్ల నోడ్‌లలో వచ్చిన వాపును క్యాన్సర్‌గా పొరబడే అవకాశం ఉంటుందన్నారు.

కొన్ని అసాధారణం..

అయితే అన్ని రకాల దుష్ప్రభావాలు సాధారణమేమీ కాదని శాస్త్రవేత్తలు తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా కోట్ల డోసులను ఇచ్చాక కొద్ది సంఖ్యలో తీవ్రస్థాయి ముప్పులను గుర్తించారు. ఆస్ట్రాజెనెకా, జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌ వంటి సంస్థల టీకాల వల్ల అరుదుగా రక్తంలో గడ్డలు వంటివి ఏర్పడుతున్నట్లు తేల్చారు. అందువల్ల ఈ వ్యాక్సిన్లను కొన్ని దేశాల్లో కొందరికి ఇవ్వడంలేదు. అయితే ఈ వ్యాక్సిన్ల వల్ల లభించే ప్రయోజనాలతో పోలిస్తే ముప్పులు చాలా స్వల్పమేనని నిపుణులు చెబుతున్నారు. కొంతమందిలో తీవ్రమైన అలర్జిక్‌ రియాక్షన్లు తలెత్తుతుంటాయి. అందువల్లే టీకా పొందాక కనీసం 15 నిమిషాల పాటు వ్యాక్సినేషన్‌ కేంద్రంలో ఉండాలని సూచిస్తుంటారు.

ఇవీ చూడండి:

92 దేశాలకు 50 కోట్ల టీకా డోసులు: అమెరికా

Covaxin X Covishield: 'ఆ నివేదికలో అనేక లోపాలు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.