ETV Bharat / international

'అమెరికాలో మరిన్ని చైనా కాన్సులేట్‌లు బంద్'

author img

By

Published : Jul 23, 2020, 8:05 PM IST

అమెరికా-చైనా మధ్య వివాదం మరింత ముదురుతోంది. హ్యూస్టన్​లోని చైనా రాయబార కార్యాలయాన్ని ఇప్పటికే మూసేయాలని ఆదేశించిన అగ్రరాజ్యం... మరిన్ని కాన్సులేట్ల విషయంలో ఇదే తరహా నిర్ణయం తీసుకునే అవకాశముందని సంకేతాలిచ్చింది. చైనా సైతం ప్రతీకార చర్యలకు సిద్ధమవుతున్నట్లు సమాచారం.

US will be closed more Chinese consulates, Trump Said
అమెరికాలో మరిన్ని చైనా కాన్సులేట్‌లు మూసేస్తాం: ట్రంప్‌

ప్రపంచ దేశాలను సంక్షోభంలోకి నెట్టిన కరోనా వైరస్‌ మహమ్మారికి కారణం చైనానే అంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ విమర్శిస్తూనే ఉన్నారు. దీనికి కారణమైన చైనాపై చర్యలు ఉంటాయని పలుమార్లు హెచ్చరించారు. తాజాగా అమెరికా ఆ వైపు అడుగులు వేస్తున్నట్లు కనిపిస్తోంది. ఇప్పటికే హ్యూస్టన్‌లోని చైనా రాయబార కార్యాలయాన్ని మూసివేయాలని ఆదేశించిన అగ్రరాజ్యం.. తాజాగా ఆ దేశంలో మరిన్ని చైనా రాయబార కార్యాలయాలను మూసివేసే అవకాశం ఉందని వెల్లడించింది.

హ్యూస్టన్‌లో చైనా రాయబార కార్యాలయాన్ని మూసివేయాలన్న ఆదేశంపై ట్రంప్‌ స్పందించారు. అక్కడి మంటలు చెలరేగాయని గుర్తు చేసిన ట్రంప్​.. ఏవో పత్రాలు తగులబెట్టినట్లు భావిస్తున్నామని చెప్పారు. అయితే వారు అలా ఎందుకు చేశారో తెలియదని, ఈ విషయం తెలిసి ఆశ్చర్యపోయినట్లు చెప్పారు ట్రంప్​. భవిష్యత్తులో మరిన్ని చైనా రాయబార కార్యాలయాలను మూసివేసే అవకాశం ఉందని శ్వేతసౌధంలో మీడియా సమావేశం సందర్భంగా అభిప్రాయపడ్డారు ట్రంప్​.

గూఢచర్యం ఆరోపణలు..

అమెరికాలో తన రాయబార కార్యాలయం నుంచి చైనా అక్రమంగా గూఢచర్యానికి పాల్పడుతోందని అమెరికా ఆరోపిస్తోంది. అమెరికా మేధోసంపత్తిని, అమెరికన్ల వ్యక్తిగత సమాచారాన్ని కాపాడుకోవడంలో భాగంగానే చైనా కాన్సులేట్‌ మూసివేత నిర్ణయం తీసుకున్నట్లు అమెరికా సమర్ధించుకుంటోంది. ఈ సందర్భంలోనే హ్యూస్టన్‌లోని కార్యాలయాన్ని 72గంటల్లోగా మూసివేయాలని ఆదేశించిన విషయాన్ని చైనా స్వయంగా వెల్లడించింది. ఇది ఇరుదేశాల దౌత్య సంబంధాలను తీవ్రంగా దెబ్బతీస్తుందని హెచ్చరించింది. అమెరికా చర్యను తీవ్రంగా ఖండించిన చైనా.. ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే సరైన రీతిలో స్పందిస్తామని స్పష్టం చేసింది.

చైనా ప్రతీకార చర్య.!

అమెరికా తీరును ఖండించిన చైనా ప్రతీకార చర్యకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా చైనాలోని అమెరికా రాయబార కార్యాలయాన్ని మూసివేసేందుకు సిద్ధమైనట్లు సమాచారం. తొలుత చెంగ్డూ నగరంలోని అమెరికా రాయబార కార్యాలయాన్ని మూసివేస్తారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇదే విషయాన్ని చైనా స్థానిక మీడియా వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా చైనాను దోషిగా చిత్రీకరించడానికే అమెరికా ప్రయత్నం చేస్తోందంటూ చైనా మీడియా అభిప్రాయపడింది. అమెరికాలో మొత్తం ఐదు నగరాల్లో చైనా రాయబార కార్యాలయాలు ఉన్నాయి. చైనాలోనూ అమెరికాకు చెందిన ఐదు రాయబార కార్యాలయాలు ఉన్నాయి. వీటికి అదనంగా హాంగ్‌కాంగ్‌లోనూ అమెరికా రాయబార కార్యాలయం ఉంది.

ఇదీ చదవండి: కరోనా మృతుల అంత్యక్రియలకు వెయిటింగ్ లిస్ట్!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.