ETV Bharat / international

'వారాంతానికి 16 కోట్ల మందికి వ్యాక్సినేషన్​ పూర్తి'

author img

By

Published : Jul 7, 2021, 10:08 AM IST

Updated : Jul 7, 2021, 11:53 AM IST

ఈ వారంతానికి అమెరికాలో పూర్తి స్థాయిలో కరోనా టీకా(Corona vaccine) అందుకున్నవారి సంఖ్య 160 మిలియన్లకు చేరుతుందని ఆ దేశ అధ్యక్షుడు జో బైడెన్(Joe Biden)​ పేర్కొన్నారు. ఈ ఏడాది జనవరి నుంచి కొవిడ్-19​(Covid-19) కేసులు, మరణాలు 90 శాతం మేర తగ్గాయన్నారు.

biden
బైడెన్​

ఈ వారం చివరినాటికి 160 మిలియన్ల మంది అమెరికన్లకు వ్యాక్సినేషన్(రెండు డోసులు)​ పూర్తవుతుందని ఆ దేశ అధ్యక్షుడు జో బైడెన్(Joe Biden)​ ప్రకటించారు. మహమ్మారి నుంచి స్వేచ్ఛను పొందేరోజు ఎంతో దూరంలో లేదని వ్యాఖ్యానించారు. ఈ ఏడాది జనవరి నుంచి కొవిడ్ కేసులు(Covid cases), మరణాలు 90 శాతం తగ్గాయని పేర్కొన్న ఆయన.. పూర్తిగా టీకా(రెండు డోసులు) అందుకున్న దేశ పౌరులు.. కరోనా ముందునాటి సాధారణ జీవితాన్ని గడుపుతున్నారని తెలిపారు.

"కొవిడ్ ​పోరులో తుది ఘట్టానికి చేరుకున్నాం. ఈ విషయాన్ని చెప్పడానికి చాలా గర్వంగా ఉంది. 150 రోజుల్లోనే 300 మిలియన్ల డోసులను పంపిణీ చేశాం. 182 మిలియన్ల మందికిపైగా ఒక డోసును అందుకున్నారు. అందులో 90 శాతం వృద్ధులు సహా 27ఏళ్లు దాటిన 70 శాతం మందికి టీకా వేశాం. ఈ వారం చివరి నాటికి పూర్తిగా టీకా అందుకున్నవారి సంఖ్య 160 మిలియన్ల మార్కును దాటనుంది. జులై నాలుగో తేదీకి నిర్దేశించిన లక్ష్యాన్ని ఆ తర్వాత మరి కొన్నిరోజుల్లోనే చేరుకోనున్నాం."

- అమెరికా అధ్యక్షుడు జో బైడెన్​

నాలుగు దశాబ్దాల గరిష్ఠానికి ఆర్థిక వృద్ధి

దేశంలో త్వరలోనే సాధారణ పరిస్థితులు ఏర్పడతాయని.. వాణిజ్య సంస్థలు తిరిగి తెరుచుకుంటాయన్నారు. ఆర్థిక వృద్ధి నాలుగు దశాబ్దాల గరిష్ఠానికి చేరుకుంటుందని పేర్కొన్నారు. కరోనాపై విజయానికి అమెరికా చేరువయ్యిందన్న బైడెన్‌.. కొవిడ్​ను పూర్తిగా అధిగమించలేదన్నారు.

ఆ దాడి.. ప్రజాస్వామ్య మనుగడకు పరీక్ష

అమెరికాలో క్యాపిటల్​ భవనంపై జనవరి 6న జరిగిన దాడిని అస్తిత్వ సంక్షోభంగా పేర్కొన్నారు బైడెన్​. దేశంలో ప్రజాస్వామ్యం మనుగడలో ఉన్నప్పటికీ.. దానిని ద్వేషం, ఉగ్రవాదం నుంచి కాపాడుకోవాలన్నారు.

"అంతర్యుద్ధ సమయంలో కూడా క్యాపిటల్ భవనంపై దాడి జరగలేదు. కానీ ఆరు నెలల క్రితం ఇదే రోజున ​అల్లరి మూకలు క్యాపిటల్​ భవనం, ప్రజాప్రతినిధులు, పోలీసులపై దాడికి పాల్పడ్డారు. ఇది అసమ్మతి కాదు. రుగ్మత. అస్తిత్వ సంక్షోభం. ప్రజాస్వామ్య మనుగడుకు పరీక్ష" అని జో బైడెన్​ వ్యాఖ్యానించారు.

జాతి ఐక్యత కోసం అందరు కలిసి పని చేయాలన్నారు బైడెన్​. అమెరికన్లుగా అవధుల్లేని శక్తి సామర్థ్యాలను ప్రదర్శించాలన్నారు. చట్టంపై గౌరవ, మర్యాదలు పునరుద్ధరించాలని పేర్కొన్నారు.

ఇదీ చూడండి: 'కరోనాపై విజయానికి చేరువయ్యాం.. కానీ'

Last Updated : Jul 7, 2021, 11:53 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.