ఒంటరి అయిన బైడెన్‌- మున్ముందు ఎలా?

author img

By

Published : Aug 29, 2021, 12:45 PM IST

us-president-joe-biden
అమెరికా అధ్యక్షుడు ()

అఫ్గాన్‌ పరిణామాలతో పాటు వివిధ అంశాలపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్​ విమర్శలను ఎదుర్కోవాల్సి వస్తోంది. అమెరికా గౌరవానికి భంగం కలగకుండా అఫ్గాన్​ నుంచి బలగాల ఉపసంహరణను పూర్తి చేయడంలో విఫలమై.. ఒంటరి అయ్యారన్న సూత్రీకరణలు తాజాగా వినవస్తున్నాయి.

సంక్షోభంలోనే నాయకత్వ పటిమ బయటపడుతుంది.. ఈ లెక్కన అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ విఫలమై.. ఒంటరి అయ్యారన్న సూత్రీకరణలు తాజాగా వినవస్తున్నాయి. అఫ్గాన్‌ పరిణామాలతో పాటు వివిధ అంశాలపై ఆయన విమర్శలను ఎదుర్కోవాల్సి వస్తోందని విశ్లేషకులు చెబుతున్నారు. అఫ్గానిస్థాన్‌లో శాంతి సుస్థిరతలను, ప్రజాస్వామ్యాన్ని నెలకొల్పడానికి 20ఏళ్ల పాటు సైనిక కార్యకలాపాలు నిర్వహించి, లక్ష కోట్ల డాలర్లు వెచ్చించినా.. చివరకు తాలిబన్లను అణచలేక అమెరికాయే అక్కడి నుంచి వైదొలగవలసి వచ్చింది. ఈ మేరకు మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ హయాంలోనే ఒప్పందం కుదిరినా, అమెరికా గౌరవానికి భంగం కలగకుండా దాన్ని అమలు చేయడంలో బైడెన్‌ విఫలమయ్యారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఐసిస్‌-కె ఉగ్రవాద సంస్థ కాబుల్‌ విమానాశ్రయం వద్ద జరిపిన ఆత్మాహుతి దాడుల్లో 13 మంది అమెరికా సైనికులు, 169 మంది అఫ్గాన్లు మరణించడం ఆయన వైఫల్యానికి నిదర్శనమని కొందరు చెబుతున్నారు. సరైన ముందస్తు ప్రణాళిక లేకుండా కాబుల్‌ నుంచి సైనికులను, అఫ్గాన్‌ ప్రజలను హడావుడిగా తరలించేందుకు పూనుకోవడమే కారణమంటూ బైడెన్‌ ప్రభుత్వం సర్దిచెప్పుకోజాలదని.. ఇది అమెరికా అసమర్థతేనని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తాజా పరిణామాలన్నీ వైఫల్యాన్ని సూచిస్తున్నాయని పులిట్జర్‌ గ్రహీత, చరిత్రకారుడు జోసెఫ్‌ ఎలిస్‌ వ్యాఖ్యానించారు.

ఓవైపు అఫ్గాన్‌ పరిణామాలు ఇలా ఉండగా.. మరోవైపు అదుపులోకి వచ్చిందనుకున్న కరోనా వైరస్, డెల్టా వేరియంట్‌ రూపంలో అమెరికాలో మళ్లీ విజృంభిస్తోంది. ఇది చాలదన్నట్లు టెన్నెసీ రాష్ట్రంలో భారీ వరదలు.. అమెరికా పశ్చిమభాగంలో కార్చిచ్చులు.. తీవ్ర అనావృష్టి, తూర్పుతీరంపై పెను తుపాను దాడి అమెరికాను, ముఖ్యంగా బైడెన్‌ ప్రభుత్వాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. అలాగే మెక్సికో శరణార్థులను అమెరికాలోకి రానివ్వకుండా గతంలో ట్రంప్‌ సర్కారు జారీ చేసిన ఉత్తర్వులను గత వారం సుప్రీంకోర్టు సమర్థించింది. అద్దె కట్టలేని వారిని ఉన్నపళంగా వెళ్లగొట్టకూడదని బైడెన్‌ సర్కారు విధించిన మారటోరియాన్నీ రద్దు చేసింది. ఇలా అన్నివైపుల నుంచి బైడెన్‌కు ఇబ్బందికర పరిణామాలు ఎదురవుతున్నాయి. అమెరికా ప్రభుత్వంలో వివిధ హోదాల్లో 40 ఏళ్ల పాటు పనిచేసిన అనుభవం ఉన్నప్పటికీ.. సంక్షోభాలను బైడెన్‌ నివారించలేకపోతున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అధ్యక్ష పదవి చేపట్టిన తరవాత తొలి 6 నెలల్లో ఆయన మంచి మార్కులే సాధించినా నేడు మైనస్‌ మార్కులు పడుతున్నాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అఫ్గాన్‌ నుంచి సైనిక ఉపసంహరణకు తాలిబన్లతో లోపభూయిష్టమైన ఒప్పందం కుదుర్చుకున్నది డొనాల్డ్‌ ట్రంపే అయినా, నిందను మాత్రం బైడెన్‌ భరించాల్సి వస్తోంది.

ఇదీ చూడండి: బైడెన్​పై అమెరికన్లలో పెరుగుతున్న అసంతృప్తి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.