ETV Bharat / international

అఫ్గాన్​కు సైన్యాన్ని పంపుతున్న మూడు దేశాలు- ఎందుకంటే?

author img

By

Published : Aug 13, 2021, 11:16 AM IST

అఫ్గానిస్థాన్​లోని తమ పౌరులు, సిబ్బందిని తరలించేందుకు పలు దేశాలు తమ సైన్యాన్ని పంపిస్తున్నాయి. అదనపు దళాలు పంపిస్తున్నట్లు అమెరికా వెల్లడించింది. కెనడా, డెన్మార్క్ సైతం తమ ప్రణాళికలను వివరించాయి.

AFGHAN TROOPS
అఫ్గాన్​కు సైన్యాన్ని పంపుతున్న మూడు దేశాలు

తాలిబన్ల దురాక్రమణతో అఫ్గానిస్థాన్​లో రోజురోజుకు పరిస్థితులు ప్రమాదకరంగా మారుతున్నాయి. ప్రధాన నగరాలన్నీ క్రమక్రమంగా ముష్కరుల చేతిలోకి జారుకుంటున్నాయి. వేగంగా దూసుకొస్తున్న తాలిబన్లను అడ్డుకోవడం అఫ్గాన్ సైన్యానికి కత్తిమీద సాములా మారింది. ఇదిలా ఉంటే.. పలు దేశాలు అఫ్గాన్​లో ఉన్న తమ పౌరులను వెనక్కి తీసుకొచ్చే పనిలో పడ్డాయి. ఇందుకోసం సైన్యాన్ని పంపిస్తున్నాయి.

అఫ్గాన్​లోని తమ పౌరులను సురక్షితంగా అమెరికా తరలించేందుకు అదనపు దళాలను రక్షణ శాఖ పంపిస్తోందని అగ్రరాజ్య విదేశాంగ ప్రతినిధి నెడ్ ప్రైస్ తెలిపారు. ఈ మేరకు అఫ్గాన్ అధ్యక్షుడు అష్రఫ్ ఘనీతో చర్చించినట్లు వెల్లడించారు. కాన్సులర్ సర్వీసులు కొనసాగుతున్నాయని, ప్రత్యేక ఇమ్మిగ్రెంట్ వీసాలను జారీ చేస్తున్నామని స్పష్టం చేశారు.

రాయబార కార్యాలయాన్ని మూసేసే ఉద్దేశంతో ఇప్పటికే మూడు వేల మంది దళాలను అమెరికా పంపుతోంది. యూకే దేశస్థులు అఫ్గాన్ విడిచి వెళ్లేందుకు సహకరించేలా మరో 600 మంది జవాన్లను పంపనున్నట్లు తెలిపింది.

కెనడా

మరోవైపు, కాబుల్​లోని రాయబార కార్యాలయాన్ని మూసేస్తున్నట్లు ప్రకటించిన కెనడా.. అక్కడి సిబ్బందిని వెనక్కి తెచ్చేందుకు ప్రత్యేక దళాలను పంపిస్తోంది. ఎంత మందిని పంపుతున్న విషయంపై అధికారులు స్పష్టత ఇవ్వలేదు.

డెన్మార్క్

అదేసమయంలో.. దేశాన్ని ఖాళీ చేయాలనుకుంటున్న 45 మంది అఫ్గాన్ పౌరులను సైతం వెనక్కి తీసుకురావాలని డెన్మార్క్ ప్రభుత్వం నిర్ణయించింది. వీరికి ఐరోపాలో రెండేళ్ల వరకు ఆశ్రయం కల్పించనున్నట్లు తెలిపింది. వీరంతా అఫ్గాన్​లో డెన్మార్క్ ప్రభుత్వం తరపున పనిచేశారు.

తాలిబన్ల చేతిలోకి అఫ్గాన్...

అఫ్గాన్​లో రెండో అతిపెద్ద నగరమైన కాందహార్​ను తాలిబన్లు వశపరుచుకున్నారు. దీంతో కలిపి మొత్తం 12 నగరాలు తాలిబన్ల హస్తగతమయ్యాయి. ఈ నేపథ్యంలో తాలిబన్లతో అధికారం పంచుకునే ఒప్పందానికి అష్రఫ్ ఘనీ సర్కారు సిద్ధమైంది. ఈ మేరకు ఖతార్‌లోని అఫ్గాన్‌ ప్రభుత్వ ప్రతినిధులు తాలిబన్ల ముందు ఈ ప్రతిపాదన ఉంచినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.

ఇదీ చదవండి: మరో నగరం తాలిబన్ల వశం- సంధికి సిద్ధమైన అఫ్గాన్‌!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.