ETV Bharat / international

కరోనా పుట్టుకపై చైనా వైరాలజిస్ట్ కీలక వ్యాఖ్యలు

author img

By

Published : Jul 29, 2020, 5:31 PM IST

కరోనా వైరస్ విషయంలో చైనా వ్యవహారంపై సంచలన ఆరోపణలు చేశారు ఆ దేశానికి చెందిన వైరాలజిస్టు లిమెంగ్ యాన్. ప్రస్తుతం అమెరికాలో ఆశ్రయం పొందుతున్న ఆమె.. వైరస్​కు సంబంధించి అన్ని వాస్తవాలను బీజింగ్ దాచిపెట్టిందని ఆరోపించారు.

china virus
కరోనా

కరోనా వైరస్‌కు సంబంధించి చైనా అన్ని వాస్తవాలనూ దాచి పెడుతోందని ఆ దేశానికి చెందిన వైరాలజిస్టు లిమెంగ్‌ యాన్‌ ఆరోపించారు. ఆమె ప్రస్తుతం దేశం నుంచి పారిపోయి అమెరికాలో ఆశ్రయం పొందుతున్నారు. ఒక స్పానిష్‌ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె పలు సంచలన విషయాలను వెల్లడించారు.

వుహాన్‌లో పుట్టలేదు.. సహజంగానూ రాలేదు..

కరోనా వైరస్‌ అందరూ అనుకుంటున్నట్టుగా వుహాన్‌ జంతువుల మార్కెట్‌లో పురుడు పోసుకోలేదని, సహజంగానూ ఆవిర్భవించలేదని యాన్‌ స్పష్టం చేశారు.

మార్చి 11న ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ వైరస్‌ను మహమ్మారిగా ప్రకటించింది. ఈ వైరస్‌ పుట్టుకపై అనేక వాదనలు ఉన్నాయి.

వుహాన్‌ ప్రయోగశాలలో పుట్టిందని, అక్కడి జంతువుల మార్కెట్‌ నుంచి మనుషులకు సోకిందని, 5జీ టెక్నాలజీతో సంబంధముందంటూ రకరకాల ప్రచారం జరుగుతోంది. అయితే గతేడాది డిసెంబరు కంటే ముందుగానే చైనా అధినాయకత్వానికి దీనిపై సమాచారం ఉందని ఆమె వెల్లడించారు.

తొలుత వుహాన్‌లో రాలేదు..

వైరస్‌ మొదటగా అందరూ అనుకున్నట్టుగా వుహాన్‌లో పుట్టలేదని యాన్ అన్నారు. అయితే అక్కడ ఉన్న శాస్త్రవేత్తలు గత ఏడాది చివరలో ఈ వైరస్‌కు సంబంధించిన జీనోమ్‌ మ్యాప్‌ను రూపొందించారని తెలిపారు. ఈ నివేదికలో వైరస్‌ పుట్టుక, వ్యాప్తి తదితర అంశాలకు సంబంధించిన పూర్తి వివరాలు ఉన్నాయని చెప్పారు.

మొత్తం సమాచారం తొక్కిపెట్టారు..

వైరస్‌కు సంబంధించిన పూర్తి సమాచారం చైనా వద్ద ఉందని అయితే బయటకు రానీయకుండా తొక్కిపెట్టారని వెల్లడించారు యాన్. కరోనాపై పరిశోధనలకు సంబంధించి తన సహ ఉద్యోగులతో చేసిన ఉత్తర ప్రత్యుత్తరాలను ఆమె బయటపెట్టారు.

వైరస్‌ బాధితులకు తొలినాళ్లలో వైద్యం చేసిన వైద్య సిబ్బందికి వ్యాధి సోకిందని, వారిలో వైరస్‌ లక్షణాలున్నప్పటికీ చైనా అధికారవర్గాలు ఆ అంశాలను బయటకు రానీయలేదన్నారు. కరోనా బాధితులు చికిత్స పొందుతున్న ఆసుపత్రుల్లో కనీసం పీపీఈ కిట్లు కూడా ఇవ్వలేదని ఆమె ఆరోపించారు.

నన్నూ హెచ్చరించారు..

ఈ వ్యాధి మొదట బయటపడిన సమయంలో ప్రపంచ ఆరోగ్య సంస్థకు చెందిన సిబ్బంది కొందరు చైనాలో ఉండగా వారిని జాగ్రత్తగా ఉండాలని సూచించినట్లు యాన్ తెలిపారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా వెళ్లవద్దని వారు తనను కూడా హెచ్చరించారని లిమెంగ్‌ యాన్‌ స్పష్టం చేశారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.