ETV Bharat / international

'ఉక్రెయిన్‌కు బలగాలను పంపే యోచన లేదు'

author img

By

Published : Jan 31, 2022, 5:46 AM IST

Updated : Jan 31, 2022, 9:14 AM IST

us troops to Ukraine: అమెరికా బలగాలను ఉక్రెయిన్​కు పంపే ఆలోచన తమకు లేదని నాటో సెక్రటరీ జనరల్​ తెలిపారు. ఆ దేశ సరిహద్దుల్లో రష్యా బలగాలు ఏ క్షణమైన దాడికి పాల్పడే అవకాశమున్న నేపథ్యంలో నాటో చీఫ్​ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

NATO chief
నాటో

us troops to Ukraine: ఉక్రెయిన్‌పై దాడి చేసేందుకు రష్యా సన్నద్ధమవుతోంది. ఇప్పటికే ఆ దేశ సరిహద్దుల సమీపంలో లక్షలాది సైనికులను మోహరించిన రష్యా.. ఏ క్షణమైన దాడికి పాల్పడే అవకాశముంది. ఒకవేళ ఉక్రెయిన్‌పై దాడి జరిగితే, ఆ దేశానికి మద్దతుగా నాటో(నార్త్‌-అట్లాంటిక్‌ ట్రీటీ ఆర్గనైజేషన్‌) బలగాలు రంగంలోకి దిగుతాయని అందరూ భావిస్తున్నారు. కానీ, తమకు ఆ ఆలోచన లేదని నాటో వెల్లడించింది.

తాజాగా ఈ విషయంపై నాటో సెక్రటరీ జనరల్‌ జెన్స్‌ స్టోల్టెన్‌బర్గ్‌ మీడియా సమావేశంలో మాట్లాడారు. ఉక్రెయిన్‌పై రష్యా దండెత్తితే అడ్డుకోవడానికి నాటో బలగాలను పంపిస్తారా? అని ఓ విలేకరి ప్రశ్నించారు. దానికి స్టోల్టెన్‌బర్గ్‌ సమాధానమిస్తూ 'ఉక్రెయిన్‌కు నాటో బలగాలను పంపించే ఆలోచన మాకు లేదు. అయితే, వారికి మద్దతు తెలపడంపై దృష్టి సారించాం' అని చెప్పుకొచ్చారు.

నాటో అనేది 27 యూరోపియన్‌, 2 నార్త్‌ అమెరికన్‌ ఒక యూరోఆసియా దేశాల కూటమి. ఇందులోని సభ్య దేశాలపై ఇతర దేశాలు దాడి చేసినప్పుడు ఒకరినొకరు సహాయం చేసుకునేందుకు ఈ నాటో కూటమి ఏర్పడింది. రష్యా, ఉక్రెయిన్‌ దేశాలు నాటో సభ్యులు కాదు. కానీ, నాటో భాగస్వామ్య దేశాలుగా కొనసాగుతున్నాయి. అయితే, సభ్యత్వం లేని ఈ రెండు దేశాల సమస్యలో జోక్యం చేసుకోకుండా ఉండేందుకు నాటో ప్రయత్నిస్తోంది. 'నాటో సభ్య దేశంగా ఉండటానికి, నాటోకి విలువైన భాగస్వామ్య దేశంగా ఉండటానికి తేడా ఉంది' అంటూ స్టోల్టెన్‌బర్గ్‌ చేసిన వ్యాఖ్యలు దీనికి బలం చేకూరుస్తున్నాయి. కాగా.. భాగస్వామ్య దేశంగా ఉన్న కారణంగా ఉక్రెయిన్‌కు ప్రత్యక్షంగా కాకున్నా పరోక్షంగా మద్దతు ఇవ్వాలని నాటో భావిస్తున్నట్లు తెలుస్తోంది.

దాడికి తెగబడితే.. కఠినమైన ఆర్థిక ఆంక్షలు

నాటో-రష్యా కూటమి మధ్య ఉద్రిక్తతలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఉక్రెయిన్‌పై దాడికి తెగబడితే ఆర్థిక ఆంక్షలతో రష్యాను కఠినంగా అణిచివేస్తామని బ్రిటన్‌, అమెరికా హెచ్చరిస్తున్నాయి. 'క్రెమ్లిన్‌కు, అక్కడి ప్రభుత్వానికి సన్నిహితంగా మెలిగే ప్రతి సంస్థనూ లక్ష్యంగా చేసుకుంటాం. దీంతో రష్యా ప్రభుత్వాన్ని ప్రోత్సహిస్తున్న పుతిన్‌.. అతని సన్నిహితుల సంస్థలు ఎక్కడా దాక్కోలేవు' అని బ్రిటన్‌ విదేశాంగ శాఖ మంత్రి లిజ్‌ ట్రస్‌ తెలిపారు. మరిన్ని సేనలను రష్యాకు సమీపంలోని నాటో దేశాలకు పంపే ఏర్పాట్లను బ్రిటన్‌ ముమ్మరం చేస్తోంది. అమెరికా సెనేటర్లు కూడా రష్యాపై ఆర్థిక ఆంక్షలకు సంబంధించిన బిల్లుకు తుదిరూపం ఇస్తున్నారు. మరోవైపు నాటో కూటమిపై రష్యా విమర్శలు చేసింది. తమను బూచిగా చూపి ఉక్రెయిన్‌ని కూటమిలోకి లాక్కునే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించింది. దాదాపు ఉక్రెయిన్‌ సమీపానికి నాటో సైన్యం వచ్చేసిందని.. ఇక ఆ దేశాన్ని లాక్కోవడమే మిగిలిందని రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లవ్రోవ్‌ వ్యాఖ్యానించారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోనిలో రిజిస్ట్రేషన్ ఉచితం!

ఇదీ చూడండి: రెండు దేశాల మధ్య యుద్ధవాతావరణం.. ఆ అధ్యక్షుడి కీలక వ్యాఖ్యలు

Last Updated : Jan 31, 2022, 9:14 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.