ETV Bharat / international

జో బైడెన్​కు ముంబయితో లింక్ ఏంటి?

author img

By

Published : Aug 23, 2020, 1:11 PM IST

అమెరికా అధ్యక్ష పదవి కోసం డొనాల్డ్​ ట్రంప్​తో అమీతుమీ తేల్చుకోనున్నారు డెమొక్రాట్​ అభ్యర్థి జో బైడెన్. అలాంటి అత్యున్నత పదవి కోసం పోటీపడుతున్న బైడెన్​కు.. ముంబయితో చాలా ఏళ్ల అనుబంధం ఉందంటే నమ్మగలమా..? అందులోనూ వ్యక్తిగతంగా, కుటుంబానికి సంబంధించిన ఓ కనెక్షన్​ అంటే ఎలా ఉంటుంది..? ఓసారి ఆ విశేషాలు తెలుసుకుందాం.

Joe Biden's elusive quest for 'Biden from Mumbai' continues
అమెరికా అధ్యక్ష అభ్యర్థి 'జో బైడెన్'​కి ముంబయితో కనెక్షన్​..?

జో బైడెన్​.. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్​కు ప్రత్యర్థి. ఈయన 1972లో యూఎస్​ సెనేటర్​గా ఎంపికయ్యారు. అత్యంత పిన్నవయసులోనే ఈ పదవి చేపట్టి రికార్డు సృష్టించారు. అయితే ఆ సమయంలో బైడెన్​ను అభినందిస్తూ ముంబయి నుంచి ఓ లేఖ వచ్చిందట. అది పంపిన వ్యక్తి పేరు చివరన బైడెన్​ ఉండటం విశేషం. అంతేకాదు 'ముంబయి బైడెన్'​ పంపిన లేఖలో డెలావేర్​ సెనేటర్​గా​ బైడెన్​ ఎంపికైనందుకు అభినందనలు చెప్తూనే.. ఇద్దరికి సంబంధం ఉందని అందులో పేర్కొన్నారట.

29 ఏళ్ల వయసున్న సెనేటర్​ బైడెన్..​ ఆ సమయంలోనే లేఖ రాసిన 'ముంబయి బైడెన్​'ను కలవాలనుకున్నారట. అయితే కుటుంబం సహా తాను రాజకీయాల్లో బిజీ అవడం వల్ల కుదరలేదని చెప్పారు. ఆ తర్వాత పలు వేదికలపై ఆ స్టోరీలను పంచుకున్నారు.

స్టోరీలు చెప్తూనే..

భారతీయ​-అమెరికన్లు, భారతీయ రాజకీయ నేతలను కలిసిన ప్రతిసారి 'ముంబయి బైడెన్' కథ చెప్తూనే ఉండేవారట జో బైడెన్​.

2013, జులై 24న ముంబయిలోని బాంబే స్టాక్​ ఎక్స్చేంజీని అమెరికా ఉపాధ్యక్షుడి హోదాలో సందర్శించారు బైడెన్​. ఆ సమయంలో 'ముంబయి బైడెన్' స్టోరీని కార్యక్రమంలోని ప్రేక్షకులతో పంచుకున్నారు.

"భారత్​లోని ముంబయికి రావడం గౌరవంగా భావిస్తున్నా. ఇక్కడ ఓ విషయం చెప్పాలి. నాకు బాగా గుర్తుంది. నేను 29 ఏళ్ల వయసులో 1972లో యూఎస్​ సెనేట్​గా ఎంపికయ్యాను. అయితే ఆ సమయంలో ఓ లేఖ అందుకున్నాను. కానీ నేను దాన్ని ఫాలోఅప్​ చేయలేకపోయాను. ఎవరైనా వంశావళి గురించి అధ్యయనం చేస్తున్నవారు ఆడియన్స్​లో ఉంటే నాకోసం వారిని ఫాలో అప్​ చేయాలి. బైడెన్​ అనే పేరుతో ఆ లేఖ ముంబయి నుంచి వచ్చింది. కచ్చితంగా ఆ వ్యక్తితో నాకు ఏదో అనుబంధం ఉందని అనుకుంటున్నా. 1700 సంవత్సరంలో ఈస్ట్ ఇండియా ట్రేడింగ్ కంపెనీ కోసం మా పూర్వీకులు ముంబయికి వచ్చారు."

-బైడెన్

పోటీచేస్తున్నానంటూ నవ్వించారు..

"నేను దాని గురించి ఇప్పటికీ ఆలోచిస్తున్నాను. అది నిజమైతే నేను భారత్​లో ఆఫీస్​ పెట్టుకోవచ్చు. భారతదేశంలో ఎన్నికల్లో పోటీ చేయడానికి నేను అర్హత పొందవచ్చు. కానీ నేను అప్పుడు ముంబయి నుంచి వచ్చిన ఆ లేఖను సరిగ్గా పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు నేను చాలాసార్లు తిరిగి వచ్చాను. 'ముంబయి బైడెన్'​తో నాకు సంబంధం ఉందా అని తెలుసుకోవడానికి చాలా ప్రయత్నిస్తున్నాను. ఇప్పుడు అతడు ఉంటే మంచి స్థితిలో ఉంటాడని నేను నమ్ముతున్నాను" అని బైడెన్ 2013లో ముంబయిలోని కార్యక్రమంలో మాట్లాడుతూ సరదాగా ఆ సందర్భాన్ని గుర్తుచేసుకున్నారు.

మరోసారి...

వాషింగ్టన్​లో జరిగిన ఓ కార్యక్రమంలోనూ దీనిని ప్రస్తావించారు బైడెన్​. తన పూర్వీకులకు, ముంబయిలోని బైడెన్​ పూర్వీకులకు సంబంధం ఉందని అభిప్రాయపడ్డారు. ఈస్ట్​ ఇండియా కంపెనీలో పనిచేసేందుకే వాళ్లు ముంబయికి వెళ్లారని అన్నారు.

"ముంబయి బైడెన్​ 1848లో ముంబయికి వెళ్లారు. ఈస్ట్​ ఇండియా టీ కంపెనీలో పనిచేస్తున్నప్పుడు భారతీయ మహిళను పెళ్లి చేసుకున్నారు. భారత్​లోనే స్థిరపడ్డారు" అని యూఎస్​-ఇండియా బిజినెస్​ కౌన్సిల్​ సమావేశంలో చెప్పారు అధ్యక్ష అభ్యర్థి బైడెన్​. ఈ కార్యక్రమం 2015, సెప్టెంబర్​ 21న జరిగింది.

అయితే ముంబయిలో ప్రసంగం తర్వాత ఓ జర్నలిస్టు ఐదుగురు బైడెన్​లు ముంబయిలో ఉంటున్నారని ఓ జాబితా తనకు అందజేసినట్లు వాషింగ్టన్​ డీసీ ఈవెంట్​లో బైడెన్​ చెప్పుకొచ్చారు. "కాబట్టి, నాపట్ల మరింత ఆదరణ చూపించండి" అంటూ​ భారతీయులతో తన బంధాన్ని నొక్కిచెప్పారు జో బైడెన్.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.