చెట్లకు కాగితాలు చుడుతూ.. కార్చిచ్చు నుంచి రక్షిస్తూ...

author img

By

Published : Sep 19, 2021, 5:37 PM IST

sequoia trees

కాలిఫోర్నియాలో కొనసాగుతున్న కార్చిచ్చు నుంచి ప్రఖ్యాత సీక్వోయా జాతీయ పార్కులోని వృక్షాలను రక్షించేందుకు అక్కడి సహాయక సిబ్బంది చర్యలు చేపట్టారు. చెట్ల కాండాలకు అల్యూమినియం కాగితం చుట్టి తాత్కాలికంగా రక్షణ కల్పిస్తున్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద వృక్షంతో పాటు ఇతర భవనాలను ఇదే తరహాలో వారు సంరక్షిస్తున్నారు.

అల్యూమినియంతో చెట్ల సంరక్షణ

అమెరికా కాలిఫోర్నియాలో కార్చిచ్చు బీభత్సం కొనసాగుతోంది. మంటల ధాటికి అక్కడి అటవీ సంపద.. అగ్నికి ఆహుతి అవుతోంది. అయితే.. శుక్రవారం కాస్త వాతావరణం చల్లబడగా.. సియెర్రా నెవాడా ప్రాంతంలోని ప్రఖ్యాత సీక్వోయా జాతీయ పార్కులో పురాతనమైన వృక్షాలకు రక్షించేందుకు అక్కడి సహాయక సిబ్బంది నడుం బిగించారు. చెట్ల కాండం చుట్టూ అల్యూమినియం కాగితం చుట్టి మంటల బారి నుంచి చెట్లను రక్షించేందుకు ప్రయత్నిస్తున్నారు.

1.5 కిలోమీటర్ల దూరంలో..

కార్చిచ్చు కారణంగా వేసవి కాలంలో పశ్చిమ అమెరికాలోని చాలావరకు అడవి దగ్ధమైంది. అయితే.. సీక్వోయా జాతీయ పార్కుకు ఈ మంటలు ఇంకా చేరుకోలేదు. ఈ పార్కుకు దాదాపు 1.5 కిలోమీటర్ల దూరంలో ప్రస్తుతం మంటలు ఉన్నాయి. దీంతో ఈ పార్కులో ఉండే దాదాపు 2,000 పురాతన సీక్వోయా చెట్లను రక్షించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు.

sequoia trees
ఆకాశాన్ని తాకేలా ఉన్న సీక్వోయా వృక్షాలు
sequoia trees
సీక్వోయా జాతీయ పార్కులో అగ్నిమాపక సిబ్బంది
sequoia trees in california
సీక్వోయా వృక్షాన్ని పరిశీలిస్తున్న సహాయక సిబ్బంది
sequoia trees in california
సీక్వోయా జాతీయ పార్కులోని చెట్లు

ప్రపంచంలోనే అతిపెద్ద చెట్టుకూ..

ఉష్ణోగ్రతలు పడిపోవడం, పొగ కమ్ముకోవడం కారణంగా సీక్వోయా జాతీయ పార్కు పరిసర ప్రాంతాల్లో మంటల వ్యాప్తి ప్రస్తుతం తక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో చెట్లను, ఇతర భవనాలను మంటల నుంచి రక్షించేందుకు అల్యూమినియం కాగితాలను వాటి చుట్టూ చుడుతున్నారు. ప్రపంచంలోనే అతపెద్ద ఘనపరిమాణం(52,508 చదరపు అడుగులు) ఉన్న చెట్టుగా పేరున్న 'జనరల్ షెర్మన్​ ట్రీ'కి కూడా అగ్నిమాక సిబ్బంది అల్యూమినియం కాగితం చుట్టారు. అయితే.. ఇలా అల్యూమినియాన్ని చెట్లకు చుట్టడం ఇదే తొలిసారి కాదు. పశ్చిమ అమెరికాలోని వివిధ జాతీయ పార్కుల్లో చాలా ఏళ్లుగా మంటల నుంచి రక్షించేందుకు ఈ విధానాన్ని పాటిస్తున్నారు.

general sherman tree
జనరల్ షెర్మన్​ ట్రీ కాండానికి అల్యూమినియం కాగితం చుట్టిన దృశ్యం
sequoias trees
మంటలు వ్యాపించిన అల్యూమినియం కారణంగా దెబ్బతినకుండా ఉన్న ఇల్లు
aluminum foil to houses
ఇంటికి అల్యూమినియం కాగితంతో రక్షణ
aluminum foil to houses
ఇంటిని అల్యూమినియం కాగితంతో చుట్టేసిన దృశ్యం

కార్చిచ్చుకు ఆజ్యం..

గతేడాది కాలిఫోర్నియాలో వ్యాపించిన మంటలతో వేలాది సీక్వోయా వృక్షాలు.. నాశనమయ్యాయి. ఈ ప్రాంతంలో ఏర్పడ్డ భీకర కరవు పరిస్థితలు, వాతావరణ మార్పులు.. కార్చిచ్చుకు ఆజ్యం పోస్తున్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. గత 30 ఏళ్ల కంటే ఈసారి వాతావరణం అత్యంత పొడిగా మారిందని చెప్పారు.

కాగా.. సీక్వోయా జాతీయ పార్కుకు సమీపంలోని అడవుల్లో సెప్టెంబర్​ 9న పిడుగుపాటు పడగా కార్చిచ్చు వ్యాపించిందని అధికారులు చెప్పారు. ఈ మంటలను అదుపు చేయడానికి 400 మంది అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు.

ఇదీ చూడండి: In Pics: కాలిఫోర్నియా నగరానికి కార్చిచ్చు ముప్పు- ఏ క్షణమైనా...

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.