ETV Bharat / international

'నవ్య అమెరికాను నిర్మిద్దాం.. నాతో రండి'

author img

By

Published : Jan 21, 2021, 5:11 AM IST

అమెరికా 46వ అధ్యక్షుడిగా జో బైడెన్​ ప్రమాణస్వీకారం అట్టహాసంగా పూర్తయింది. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశానికి అధినేతగా బైడెన్ ప్రసంగాన్ని వినేందుకు అతిథులతో పాటు.. ప్రపంచమంతా ఆసక్తిగా ఎదురుచూసింది. అధికారిక హోదాలో బైడెన్ చేసిన ప్రసంగం రాబోయే రోజుల్లో చేయబోయే అభివృద్ధితో పాటు.. ఆయన చిత్తశుద్ధిని ప్రపంచం ముందు ఆవిష్కరించింది.

'Democracy has prevailed,' says Biden in his maiden speech as US President
'నవ్య అమెరికాను నిర్మిద్దాం నాతో రండి'

ప్రజాస్వామ్య పరిరక్షణకు చిత్తశుద్ధితో కృషి చేస్తానని అమెరికా నూతన అధ్యక్షుడు జో బైడెన్‌ ఉద్ఘాటించారు. అధికారం కోసం కాకుండా ప్రజల శ్రేయస్సు కోసమే నిరంతరం ఆలోచిస్తానని హామీ ఇచ్చారు. గత నాలుగేళ్ల పాలనలో అంతర్జాతీయ సమాజంతో దెబ్బతిన్న సంబంధాలను పునరుద్ధరించుకుంటామన్నారు. అమెరికా అధ్యక్షుడిగా బుధవారం ప్రమాణం చేసిన బైడెన్‌.. ఆ హోదాలో చేసిన తొలి ప్రసంగంలో ప్రధానంగా ఐక్యతా రాగం ఆలపించారు. అమెరికాను మరోసారి అగ్రగామిగా నిలపడంలో తనకు తోడ్పాటునందించాలని దేశ ప్రజలను సవినయంగా కోరారు. కొవిడ్‌ విజృంభణతో వచ్చిన కష్టాలు, రెండు వారాల క్రితం క్యాపిటల్‌ భవనం వద్ద చోటుచేసుకున్న హింస, దేశాన్ని ఇంకా పట్టిపీడిస్తున్న జాతి వివక్షత, పర్యావరణ మార్పులు వంటి అంశాలను ప్రస్తావించారు. బైడెన్‌ ప్రసంగంలోని ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే..

ఒక్కటై నిలిచాం: ఈ రోజు మనం ఇక్కడ వేడుక నిర్వహించుకుంటున్నది ఒక వ్యక్తి విజయం సాధించినందుకు కాదు.. ప్రజాస్వామ్యం గెలుపొందినందుకు. ప్రజాస్వామ్యం విలువైనదని, సున్నితమైనదని మనం మరోసారి తెలుసుకున్నాం. ఎట్టకేలకు ప్రజాస్వామ్యం విజయం సాధించింది. ప్రజల సంకల్పం నెరవేరింది. కొద్దిరోజుల క్రితం ఇక్కడే హింస చోటుచేసుకుంది. క్యాపిటల్‌ పునాదులనే కదిలించే ప్రయత్నం జరిగింది. మనమంతా ఒక్కటై.. ఒక దేశంగా నిలబడ్డాం. రెండు శతాబ్దాలుగా ఎలా శాంతియుతంగా అధికార బదిలీ జరుగుతోందో.. అలాగే ఈసారీ జరిగేలా చేశాం. ఇది చరిత్రలో నిలిచిపోయే రోజు. ఆశలు చిగురించిన రోజు.

అందరి అధ్యక్షుణ్ని..

నాకు ఓటు వేసినవారు.. వేయనివారు అనే వివక్షను ఎంతమాత్రం చూపబోను. అమెరికన్లందరికీ అధ్యక్షుడిగా ఉంటా. రాజ్యాంగాన్ని పరిరక్షిస్తా. ప్రజాస్వామ్యాన్ని కాపాడతా. అధికారం గురించి కాకుండా అవకాశాల గురించి ఆలోచిస్తా. వ్యక్తిగత ప్రయోజనాలను పక్కనపెట్టి ప్రజల బాగు కోసం కృషి చేస్తా. శ్వేతజాతి ఆధిపత్యం, దేశీయ ఉగ్రవాదాలను ఓడిస్తాం. ఆ దిశగా చేసే పోరాటంలో ప్రతి అమెరికన్‌ నాతో చేతులు కలపాలి. ఐకమత్యం లేకపోతే శాంతి లేదు. ప్రగతి లేదు. దేశం లేదు. కేవలం ఆందోళనే ఉంటుంది. ఐక్యంగా ఉంటే మనం ఎప్పటికీ విఫలం కాబోము.

అంతర్జాతీయ సంబంధాలను పునరుద్ధరించుకుంటాం.. గత నాలుగేళ్లలో బీటలువారిన కూటములకు మరమ్మతులు చేసుకుంటాం. అంతర్జాతీయ సంబంధాలను పూర్తిస్థాయిలో పునరుద్ధరించుకుంటాం. శాంతి, ప్రగతి, భద్రతలో విశ్వసనీయ భాగస్వామిగా ఉంటామని అంతర్జాతీయ సమాజానికి హామీ ఇస్తున్నానన్నారు బైడెన్.

'నా తోటి అమెరికా పౌరులారా.. దేవుడి మీద ప్రమాణం చేసి, మీ ముందు వాగ్దానం చేస్తున్నా. మీకెప్పుడూ నేను సత్యమే చెబుతాను' అంటూ 21 నిమిషాల తన ప్రసంగాన్ని బైడెన్‌ ముగించారు.

కరోనాతో మృత్యువాతపడ్డ అమెరికన్లకు నివాళిగా కొన్ని క్షణాలు మౌనం పాటించారు.

ఆమే ఉదాహరణ..

శ్వేతజాతి ఆధిపత్యాన్ని దేశం ప్రతిఘటించాలి. 'అందరికీ సమన్యాయం' అనే కల సాకారమవడంలో ఇంకెంతమాత్రమూ జాప్యం చోటుచేసుకోకూడదు. ఒకరినొకరం గౌరవించుకుందాం. ఇతరుల స్థానంలో ఉండి ఆలోచిద్దాం. ఉపాధ్యక్షురాలిగా కమలా హారిస్‌ ప్రమాణం చేయడం.. దేశంలో ఎంత గొప్ప మార్పులు రాగలవో చెప్పేందుకు ఉదాహరణ. పరిస్థితులు మారవు అనే మాటలను నేను విశ్వసించను.

వెంటనే పని మొదలెట్టాలి..

కరోనా మన దేశాన్ని కబళించింది. రెండో ప్రపంచ యుద్ధంలో అమెరికా ఎంతమంది పౌరుల ప్రాణాలను కోల్పోయిందో.. ఒక్క ఏడాదిలోనే అంతమంది అమెరికన్లను ఈ వైరస్‌ బలి తీసుకుంది. లక్షల మంది ఉద్యోగాలు కోల్పోయారు. వేల వ్యాపారాలు మూతపడ్డాయి. ఐక్యంగా ఉంటే మనం చాలా చేయొచ్చు. కరోనాపై పైచేయి సాధించొచ్చు. అమెరికాను మరోసారి తిరుగులేని శక్తిగా నిలపొచ్చు. ఇక సమయాన్ని ఎంతమాత్రమూ వృథా చేయొద్దు. వెంటనే రంగంలోకి దిగాలి.

తొలుత దేవునిపై ప్రమాణం చేస్తూ..

అమెరికా ఉపాధ్యక్ష పదవిని చేపట్టిన తొలిమహిళగా ప్రమాణ స్వీకారం చేసిన కమలా హారిస్.. 'కమలా దేవి హారిస్‌ అనే నేను'.. ప్రజల సేవకు సిద్ధంగా ఉన్నట్టు ప్రకటించారు. 'కమలా దేవి హారిస్‌ అనే నేను విదేశీ, స్వదేశీ శత్రువులందరి నుంచి అమెరికా రాజ్యాంగానికి మద్దతు తెలిపి, కాపాడుతానని; రాజ్యాంగంపై నిజమైన నమ్మకం, విధేయత కలిగి ఉంటానని; ఈ విధిని స్వేచ్ఛగా స్వీకరిస్తానని; ఎలాంటి మానసిక అనుమానాలు, ఎగవేత ధోరణులు లేవని; నేను చేపట్టబోయే పదవిని చక్కగా, బాధ్యతతో నిర్వర్తిస్తానని ప్రమాణం చేస్తున్నాను. భగవంతుడా! ఇందుకు నాకు సహకరించు' అని పేర్కొన్నారు.అనంతరం అధికారిక ట్విటర్‌ ఖాతా ద్వారా తొలిసారిగా ట్వీట్‌ చేస్తూ 'ప్రజలకు ఎల్లప్పుడూ సేవలు చేయడానికి సిద్ధంగా ఉన్నా. నేనిప్పుడు ఈ స్థానంలో ఉన్నానంటే అందుకు ఇంతవరకు ముందుడుగు వేసిన మహిళలే కారణం' అని తెలిపారు. ఈ సందర్భంగా తన తల్లి శ్యామల సహా, పలువురు నల్లజాతి మహిళల ఫొటోలను జత చేశారు. కమలా హారీస్‌ ప్రమాణ స్వీకారం రోజున ఊదా రంగు దుస్తులు ధరించి ఆకట్టుకున్నారు. వీటిని నల్లజాతికి చెందిన డిజైనర్లు క్రిస్టఫర్‌ జాన్‌ రోగర్స్‌, సెర్గియో హడ్సన్‌లు రూపొందించారు.

'చేయాలనుకున్నది చేసేయ్‌, ఇతరుల మాటలు పట్టించుకోకు అంటూ కమలా హారిస్‌కు దిల్లీలో ఉన్న ఆమె మేనమామ గోపాలన్‌ బాలచంద్రన్‌ హితవు చెప్పారు.'

ఇవీ చదవండి:

అగ్రరాజ్యంలో నవశకం.. అధ్యక్షుడిగా బైడెన్ ప్రమాణం

చరిత్ర సృష్టించిన కమల.. ఉపాధ్యక్షురాలిగా ప్రమాణం

బైడెన్ రాకతో అమెరికా స్టాక్ మార్కెట్లకు జోష్

బైడెన్, కమలా.. సీక్రెట్​ కోడ్​ పేర్లు ఇవే..!

అమెరికా నూతన కథను లిఖిద్దాం రండి: బైడెన్

అమెరికా అధ్యక్షునిగా జో బైడెన్​​ ముందున్న సవాళ్లు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.