కొవిడ్‌ వ్యాక్సిన్లతో రకరకాల వేరియంట్ల నుంచి రక్షణ

author img

By

Published : Oct 13, 2021, 6:42 AM IST

COVID-19 vaccines

కరోనా టీకా తీసుకున్నవారిలో ఉత్పత్తయ్యే యాంటీబాడీలు పలు రకాల వేరియంట్ల నుంచి రక్షణ కల్పిస్తున్నట్లు ఓ పరిశోధనలో తేలింది. కొవిడ్​తో దీటుగా పోరాడే అత్యంత బలమైన రోగనిరోధకశక్తి ఉంటున్నట్టు వెల్లడైంది.

కొవిడ్‌ టీకా తీసుకున్నవారిలో ఉత్పత్తయ్యే యాంటీబాడీలు చాలా వేరియంట్ల నుంచి రక్షణ కల్పిస్తున్నట్టు తాజా పరిశోధనలో వెల్లడైంది. వ్యాక్సిన్‌ తీసుకోవడానికి ముందే కొవిడ్‌కు గురైన వారిలోనైతే, కరోనాకు వ్యతిరేకంగా అత్యంత బలమైన రోగనిరోధకశక్తి ఉంటున్నట్టు తేలింది. యేల్‌ విశ్వవిద్యాలయం చేపట్టిన ఈ పరిశోధన వివరాలను 'నేచర్‌' పత్రిక అందించింది.

టీకాలు తీసుకున్న తర్వాత కరోనా సోకితే, వాటిని 'బ్రేక్‌త్రూ' కేసులుగా పరిగణిస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఇలాంటి కేసులు నమోదవుతూనే ఉన్నాయి. దీంతో అసలు వ్యాక్సిన్లు పనిచేస్తున్నాయా? లేదా? అన్న సందేహం ఏర్పడింది. ఈ అంశంపై దృష్టి సారించిన పరిశోధకులు.. గత ఏడాది నవంబరులో అమెరికాకు చెందిన 40 మంది ఆరోగ్య సిబ్బంది నుంచి రక్త నమూనాలను సేకరించారు. తర్వాత వారికి మోడర్నా, ఫైజర్‌ వ్యాక్సిన్లను రెండు డోసులుగా అందించారు. మొదటి, రెండో డోసు టీకా ఇచ్చిన తర్వాత కూడా వారి నుంచి రక్త నమూనాలను సేకరించారు. అనంతరం వాటిని డెల్టా సహా 16 రకాల వేరియంట్లపై ప్రయోగించి, యాంటీబాడీల స్థాయిని, టి-కణాల ప్రతిస్పందనను గమనించారు.

"వైరస్‌ వేరియంట్‌, వ్యక్తిని బట్టి రోగనిరోధక స్పందనలు, యాంటీబాడీల స్థాయి ఆధారపడి ఉంటున్నాయి. అందరిలోనూ ఇవి ఒకేలా ఉండటం లేదు. కానీ, టీకాలు తీసుకున్నవారిలో ఉత్పత్తి అవుతున్న యాంటీబాడీలు చాలారకాల వేరియంట్లను సమర్థంగా ఎదుర్కోవడానికి దోహదపడుతున్నాయి" అని పరిశోధనకర్త అకికో ఇవసాకి పేర్కొన్నారు.

ఇదీ చూడండి: వెయ్యి కిలోల గుమ్మడికాయ.. చూశారా ఎప్పుడైనా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.